పిరికి పిల్లి ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  ఒక అడవిలో ఓ పిల్లి ఉండేది.
       అది బలే పిరికిది. 
       చిన్న చిన్న చప్పుడులకే ఉలిక్కి పడేది. 
       బారుగా వెళ్లే చీమలను చూసి కూడా జడుసుకునేది. 
       పురుగుల్ని చూసి పారిపోతుండేది.
       ఆ పిరికి పిల్లిని చూసి అడవిలోని ప్రాణులు పొట్ట చెక్కలవ్వులా నవ్వు కునేవి. 
       అప్పుడప్పుడు ఏడిపించేవి. 
       వెక్కిరించివి.  
       దీనితో ఎలుకలకు కూడా లోకువ అయింది.  
       కప్పలు బెకబెక మంటూ బెదిరించేవి. 
       పిల్లికి ఏ చేయాలో పాలు పోవడం లేదు.  
       భయం భయంగా బ్రతుకు ఈడ్చుకు వస్తుంది.
       బయటకు రావాలంటేనే గడగడా వణకుకుతుంది.
       ఇంట్లోనే ముడుక్కుని పడుకుంటుంది.
       ఇంట్లో మాత్రం భయం లేకుండా పోతుందా?
       గోడ మీద వున్న బల్లిని చూసింది. 
       అది నాలుక బయట పెట్టి వెక్కిరించింది. 
       పిల్లి  సిగ్గుతో చితికి పోయింది. 
       భయాన్ని జయించడం ఎలా అని ఆలోచించింది.
       ఇంతలో పిల్లి ఇంటికి ఒక చుట్టం వచ్చింది.
       అది ఒక  ఎలుగుబంటి. 
       పిల్లి పిరికితనం సంగతి తెలుసుకుంది. 
        దాన్ని పోగొట్టాలి అనుకుని "పిల్లి అల్లుడు! ఏమిటి ఆ కంగారు. ఎందుకు అలా భయపడి  చస్తున్నావు? భయానికి విరుగుడు ధైర్యం. పిరికితనం తరమక పోతే మనుగడ దుర్లభం. చావు ఒకసారే చంపుతుంది. భయం క్షణక్షణం చంపి  జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. పిరికి తనం పక్కన పెట్టు. ధైర్యాన్ని దరి చేర్చుకో.  నీకు అంతటా జయమే ప్రాప్తిస్తుంది. ఈ రోజు నుంచి దైర్యంతో మెలగు. భయంతో పోరాడు. దానితో  నేరుగా ఢీకొను" అని బోధ చేసింది ఎలుగుబంటి. 
       ఎలుగు బంటి మాటలు పిల్లికి వంట బట్టాయి.
       వళ్ళు ఉప్పొంగింది. 
       రోమాలు నిక్క పొడుచుకున్నాయి. 
       రోషం వచ్చిది. 
       పౌరుషం పొంగింది. 
       అదే సమయంలో ఓ పులి అటుగా పోతుంది. 
       పిల్లిని చూసింది. 
       దడిపించిలని వెక్కిరిస్తు పిల్లి ముందుకు వచ్చింది.
       "ఏమోయ్! ...పిరికిక పిల్లి! ఏమిటి సంగతి?" అని ఏదో అనబోయింది.
       అంతే, పిల్లి మీసాల నిటారుగా నిలుచున్నాయి. 
       కళ్ళు  చింత నిప్పులు అయ్యాయి. 
       పళ్ళు నూరింది. 
       వళ్ళు విరుచుకుంది. 
       అమాంతం పులిమీద పడింది.
       గోర్లతో రక్కింది. 
       పళ్ళతో పీకింది. 
       పులి వంటి నిండా గాట్లే. 
       రక్తపు మరకలే.
       చారలు కట్టాయి. 
       అనుకోని ఈ పరిణామానికి పులి అవక్కాయింది.
       చేసేదిలేక పలాయనం చిత్తగించింది.
       కాలుకు బుద్ధి చెప్పింది.
       మరెప్పుడు అటు రాలేదు.  
       అప్పటి నుండి పిల్లిని చూస్తే అందరికి హడలే.
       పిల్లి  పెద్ద హీరో అయింది.
       నీతి: భయపడితే బల్లి కూడా భయపెడుతుంది. ఎదురు తిరిగితే పులి ఐనా పారిపోతుంది.