కుమ్మరి ఒక బ్రహ్మ:- సత్యవాణి

 కుమ్మరి గంగన్న ఒకడు
కుండజేయ బూనెను
బంకమన్ను గడ్డతెచ్చి
బాగ నలుగ గొట్టెను
జల్లెడతో జల్లించి
మన్నుకుప్ప జేసెను
కుప్పపైన నీళ్ళుజల్లి
కసాపిసా త్రొక్కెను
మెత్తబడిన మట్టి ముద్ద
సారెపైన పెట్టెను
కుమ్మరి సారెను కర్రతొ
గార గిరా త్రిప్పెను
సారి తిరుగుచుండగానె
మట్టి వొడుపునపట్టెను
మట్టిముద్ద మారిపోయి
మంచి కుండ ఆయెను
ఆరబెట్టి ఆకుండను
ఆవలోన బెట్టెను
ఆవలోన వేడివలన
అయెను కుండ గట్టిగా
గట్టి మట్టి కుండనీరు
ఘనమౌ ఆరోగ్యానికి
క్రొత్తకుండలోనినీరు
కుతి తీర్చును హాయిగా
కుండలైన కూజాలైన కుమ్మరన్నకొక్కటే
మట్టిముద్ద చేతబట్టి
మాయలెన్నొ చేయును
రక రకాల రూపాలను
బ్రహ్మ వలెను మలచును