అగ్గో మీ బాపు అస్తుండే..కూడేస్తరాపోమే..
అమ్మ మాట్లు దినామూ పోరికి
సెవుల పాటల్లే ఇనిపిస్తది..
బాపు పక్కన తొడమింద గూసోని
నాల్గు మెతుకులు నోట్లబెట్టించుకుంటే..
కలిపిన పుంటికూరతొక్కు గూడ
అము ర్తమే కదా.. నోట్లనీల్లూర
బడతయ్ తల్సుకున్నప్పుడల్ల..
బాపుకోసమే ఏపిన తాటాకు చాప గెవనంగా నంచుకదిని పిస్తడు మల్ల!
పొద్దుగాల తర్వాని దాగిపోయిన అయ్య
చెలికలో పనీ అయితేనే వొస్తడు,
మద్దేనం అమ్మే కసింతబువ్వ ఎత్తక బోతాకనిపిస్తది బడి వసార లోంచి..
ఇంగ బడిలో ఏసింది నోట్ల బెట్టుకొని..
సందేళ ఎప్పుడో అని ఎదురుసూపే ఈ పిల్ల పద్నకి
అయ్యచేతి బువ్వకి ఆ రుసి
యెట్ట వస్తాదో...
అవునే.. మట్టిల ఇత్తులేసిన కానించి..
ఈ బువ్వ నాయిన కష్టమే గద!
అందుకే గావల్ల.. !
కలుపుకి బోయినపుడు మాసెడ్డ బాదపడతడు.. అయ్య
మా లచ్చిమిదేవిని ఎందుకు
తోలుకొస్తివిమే..
ల్యాత సేతుల్తోనే కలుపుదీస్తే
రేపు బళ్ళో రాయవద్దా..?
అని.. అమ్మని కేకలేస్తడు.
సాల్లే ఊకో.. నాలుగు సేతులు
పనీపాట చేత్తేనే గద..
మనం మెతుకులు కంచానికేసుకోవల్ల..
అది సదువుకోని సంపాదిచ్చె
టప్పుడు నువ్వు తిందువులే..
నాలుగు మెతుకులు.. అంటాడు అన్న.. !
మెతుకులు : ---ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు