బీదవాడిగ పుట్టి
విధికి తల వంచక
పట్టుదలతో చదివి
బారిష్ట రయ్యాడు !
రాజమండ్రి నందు
లాయరుగ పనిచేసి
ఆ పట్టణానికి
అధ్యక్షుడయ్యాడు !
చెన్నపట్నం పోయి
హైకోర్టునందతడు
న్యాయవాదిగ చేసి
కడు ఖ్యాతి నొందాడు !
సహాయ నిరాకరణ
ఉద్యమము నందతడు
అడుగు పెట్టి ,అగ్ర
నేతగా మారాడు !
స్వరాజ్య పత్రికను
సొంతంగ స్థాపించి
ఆంగ్ల పాలన నతడు
తూర్పారబట్టాడు !
చెన్నపట్నం లోకి
సైమన్ కమీషన్ రాగ
వ్యతిరేకం తెలుప
గోబ్యాక్ అన్నాడు !
తెల్ల సైన్యం వచ్చి
గురిపెట్టి భయపెట్ట
దమ్ముంటే కాల్చరా
అని రొమ్ము చూపాడు !
ఆంధ్ర కేసరి బిరుదు
ప్రజలచే పొందాడు !
స్వరాజ్య సాధనలో
ఆంధ్రులను నడిపాడు !
స్వాతంత్ర్య మొచ్చాక
ఆంధ్ర రాష్ట్రం రాగ
తొలి ముఖ్యమంత్రి గ
సేవలందించాడు !
ఆతడెవరో కాదు
ప్రకాశం పంతులు
ఆంధ్ర మాత కనిన
ఆణిముత్యం అతడు !
ఆంధ్ర కేసరి (గేయకథ):-బెలగాం భీమేశ్వరరావు--పార్వతీపురం