కుందేలు వ్యవసాయం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

 ఒక అడవిలో నక్క ఉండేది. 
       దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు . 
       వచ్చి ఓ చెట్టుకింద కూచుంది . 
       అప్పుడే అక్కడికి ఓ తోడేలు వచ్చింది. 
       దానికి కూడా ఎక్కడా తిండి దొరకలేదు. 
       అదీ నీరసంగా కూలబడింది. 
       రెండు విచారంగా ఒక దాని ముఖం ఒకటి చూసుకున్నాయి.
      "తోడేలు తమ్ముడూ ! ఎన్నాళ్ళు ఇలా ఎదుగు బోదుగు లేకుండా జీవిద్దాం. ఆహార అన్వేషణలోని కాలం కదలి  పోతుంది. రోజు పస్తులతోనే గడిచి పోతుంది. ఏదైనా వ్యాపారం చేసి పొట్ట పోసుకుందామా?" అని అడిగింది నక్క. 
          తోడేలు నీరసంగా ఊపిరి పీల్చింది " ఉ...." అని నిట్టూర్పు విడిచి "అదొక్కటే తక్కువ. మన ముఖాలకు వ్యాపారం కూడానా? అయ్యోరామా! వ్యాపారానికి ఎంత డబ్బు కావాలో తెలుసా ? ఎక్కడ నుంచి తెద్దాం అంత డబ్బు" అంది తోడేలు.
       అప్పు చేద్దాం...." అంది నక్క 
       "అప్పా ! ఓరీ అప్పారావు , మనకు అప్పు ఇచ్చేవాడు కూడా ఉన్నాడా? మన సంగతి తెలియని వారెవరూ? ఎవరైనా దయ తలచి
ఇచ్చినా, మనం తీరుస్తామా? చస్తామా. ఆ సంగతి మర్చిపో.  కావాలంటే వ్వవసాయం చేసి బ్రతుకుదాం"  అంది  తోడేలు
       "వ్యవసాయమా !! ఎంత పెద్ద జోకు వేశావు. అది మన వలన అయ్యే పనేనా? వ్యవసాయం అంటే మాటలా. ఎంతో చాకిరీ చేయాలి .  ఎంత చేసినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం  ఉందా? ఆ ప్రయత్నం మానుకో.  ఎప్పటి లాగా దిమ్మరులులా తిరుగుదాం. తేరగా దొరికితే తిందాం . అమాయకులు కనిపిస్తే మోసం చేద్దాం " అంది నక్క.
       కాసేపు  అక్కడే ఉండి రెండూ వెళ్లిపోయాయి.
       ఆ చెట్టు తొర్రలో ఓ కుందేలు ఉంది. 
       అది వాటి మాటలు   విన్నది. 
       అవి వెళ్ళగానే కిందకు దూకింది . 
       దానికి వ్యాపారం, వ్వవసాయం చేయాలి అనిపించింది. 
       నిముషమైనా ఆలశ్యం చేయకుండా పొలం కౌలుకు తీసుకుంది. 
       ఉల్లి గడ్డలు, దుంపలు, కారెట్లు , వేరుశనక్కాలు వేసింది. 
        కాపలా కాసింది . 
       పుట్టెడు పంట పండింది.
        వాటితో వ్యాపారం చేసింది. 
       పుష్కలంగా సంపాయించింది .
       నక్క తోడేలు మాత్రం బిక్షాటనలోనే ఉన్నాయి.
       నీతి : అనుకోవటం కాదు, ఆచరించటంలోనే ఉంది విజయం.