సామెత కథ : ఎం. బిందు మాధవి


 తోటివాడు తొడ కోసుకుంటే నేను

మెడ కోసుకుంటా!

 

‘ఉదయ్’ది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. చిన్నప్పుడే చదువైపోయి వెంటనే మంచి కంపెనీ లో ఉద్యోగం లో కూడా చేరాడు. అక్కడ తక్కువ కాలం లోనే మంచి స్థాయి కి చేరాడు. తరువాత కాలక్రమేణా కంపెనీ మారి ఇంకో మంచి కంపెనీ లో ఇంకా పెద్ద స్థాయిలో చేరాడు. ఆ కంపెనీ ద్వారా విదేశాల్లో కూడా పని చేశాడు. అందువల్ల అతనికి ఉద్యోగం కోసం కష్ట పడటం, జీతం లేక ఇబ్బంది పడటం అనేవి తెలియవు, ఆ అనుభవమూ లేదు.

ఉదయ్ దగ్గరబంధువు వెంకట్రావు కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, తరువాత ఉద్యోగం పూర్తిగా వదలకుండానే, ఖాళీ సమయంలో స్నేహితుల వ్యాపారంలో భాగస్వామిఅయ్యాడు. వెంకట్రావు భార్య ఉద్యోగం చేస్తున్నది. కుటుంబ పోషణకి ఇబ్బంది ఉండదు కనుక, అది ఒక ఆసరాగా తీసుకుని వెంకట్రావు ‘ఒక ప్రయత్నం చెయ్యచ్చు’ అని వ్యాపారం ఒక ‘ప్రత్యామ్నాయం’ గా అందులోకి దిగాడు.

పూర్తి స్థాయి వ్యాపారం లోకి వెళ్ళినా కూడా కొంత కాలం వరకు తన వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన కన్సల్టేషన్ చేస్తూ, తన ప్రొఫెషన్ కి దూరం కాకుండా ఉండే ప్రయత్నం చేశాడు. రేపు వ్యాపారంలో ‘స్నేహితులతో సమస్య’ వచ్చినా, లేక తనకి తానుగా ‘నిలదొక్కుకోలేకపోయినా’ ఇబ్బంది పడకుండా ఆ ఏర్పాటు చేసుకున్నాడు.

క్రమేణా కొంత నమ్మకం చిక్కాక, స్నేహితులతో విడిపోయి తనకి తానే ఒంటరిగా అదే వ్యాపారం చెయ్యటం మొదలుపెట్టాడు.

వెంకట్రావు బంధువు పెద్దాయన ఒకరు మాట సాయం చేస్తూ అతనికి ‘అండ దండలు’గా ఉన్నారు. భార్య ఎలాగూ ఉద్యోగం చేస్తున్నది కాబట్టి, వెంకట్రావు ధైర్యంగానే ఉన్నాడు. క్రమ క్రమంగా వ్యాపారంలో ‘ఆను పానులు’ తెలుసుకుని నిదానంగా నిలదొక్కుకుని కాస్తో కూస్తో వెనకేసుకునే స్థితికి వచ్చాడు. పిల్లలకి చదువులు చెప్పించి వివాహాలు చేసి పంపించాడు. తన అభిరుచి మేరకు ‘ఇల్లు’ కట్టుకుని మంచి ‘కారు’ కూడా కొనుక్కున్నాడు.

వ్యాపారం చెయ్యవలసిన పద్ధతిలో చేస్తూ, ఏ భేషజాలకి పోకుండా ఉంటే, ఏ ఒడుదుడుకులూ లేకుండా పది రూపాయలు సంపాదించ వచ్చని బంధు వర్గం లో మంచి పేరు,గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘వెంకట్రావు’ ఎదుగుదల చూసి ‘ఉదయ్’ తను కూడా వ్యాపారం చెయ్యాలని, ఉద్యోగంలో ఎన్నాళ్ళు తిప్పలు పడ్డా వ్యాపారంలో లాగా ‘చేతి నిండా’ సంపాదించలేమని నిర్ణయించుకుని భార్య తో ఆ విషయమే చెప్పాడు. అప్పటి వరకు పెద్ద ఉద్యోగం చేస్తూ ఒక హోదాలో కుటుంబాన్ని నడిపిన భర్త హఠాత్తు గా ఈ వ్యాపార నిర్ణయానికి భార్య ఉలిక్కి పడింది.

కారణం ఉదయ్ కి మనుషులు, వారిలో మర్మం తెలుసుకునే సత్తా లేదు. నిష్కల్మషమైన మనిషి. ఎవరైనా కష్టం వచ్చింది అని ఉదయ్ దగ్గరకి వచ్చి బుడి బుడి దీర్ఘాలు తీస్తే, నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఎంత ఉంటే అంత ఇచ్చే రకం, వీలైతే చేబదులు తెచ్చి మరీ ఇచ్చే రకం.

అలాంటి మనిషి వ్యాపారం అంటూ మొదలు పెడితే, చుట్టు ఉన్న బంధు వర్గం అతన్ని నిలవనివ్వరు అని భార్య భయపడుతున్నది. ‘నాలుగు గోడల మధ్య ఉన్న కాపురం నడి వీధిలో పడుతుంది’ అని చెప్పటానికి ప్రయత్నం చేసింది. ‘పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు, ఖర్చులన్నీ ముందే ఉన్నాయి’ ఇప్పుడెలా ఇతన్ని ఆ ఆలోచన నించి మళ్ళించాలో అర్ధం కాక ఉదయ్ భార్య, వెంకట్రావు సహాయం కోరింది.

వెంకట్రావు ఉదయ్‌తో ‘వ్యాపారం అందరికి చేత కాదు, అందునా నీలాంటి ముక్కుసూటి వారికి అసలు సరిపడదు. వ్యాపారం పైకి కనిపించినంత ఆకర్షణగా ఉండదు, అనేక సందర్భాల్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ల తో ‘చిక్కులు’, వాళ్ళకి మామూళ్ళు తినిపించటం, ‘ఇన్ కంటాక్స్’ వారితో ‘స్క్రూటినీ’లు వగైరా సమస్యలు, ఇవన్నీ white collared job చేస్తున్న నీకు అర్ధం కావు, నువ్వు పడలేవు ఈ సమస్యలన్నీ’ అని వివరించాడు.

‘సీయ్యేలు వాళ్ళు ఆడే నాటకాలు వాళ్ళు ఆడతారు, జాగ్రత్తగా ఉండాలి, cut throat గా ఉండక్కరలేదు కానీ, నిక్కచ్చి గా ఉండాలి’ అని చెప్పి, ‘అయినా "తోటి వాడు తొడ కోసుకున్నాడని, మనం మెడ కోసుకుంటే" మనకే నష్టం’ అని హెచ్చరించాడు.

‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు, అప్పుడు నీ జీవితం ఎటూ కాకుండా అవుతుంది. అటు ఉద్యోగం లోకి వెళ్ళలేవు, ఇటు వ్యాపారం కొనసాగించలేవు. ఖర్చులు తగ్గవు, ఇల్లు నడపటం కష్టమవుతుంది’ అని చెపుతూ ‘నీకెందుకయ్యా ఈ వ్యాపారాలు, హాయిగా ప్రొఫెషనల్ లైన్ లో ఉన్న వాడివి ఉద్యోగం చేసుకోక’ అని కేకలేశాడు.

అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుంది"