ఉడుత సాయం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

 ఒక అడవిలో ఓ కుందేలు ఉంది. అది చాలా మంచిది. దానికి ఒక ఉడుత మిత్రుడు ఉండేది. అవి  ఒకదానికి ఒకటి సాయం చేసుకుంటూ ఉండేవి.
      కుందేలుకు ఆ అడవిలోకి ఇద్దరు శతృవులు ఉండేవారు . అవి ఒక నక్క, ఒక తోడేలు - అవి కుందేలుపై కన్ను వేసాయి. చంపి తినాలని పన్నాగం  పన్నాయి.   అవకాశం కోసం వేచి ఉన్నాయి . కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాయి. ఈ సంగతి కుందేలు తెలుసుకుంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంది. మనో వేదనతో కృంగి  పోతుంది. కుందేలు చింతను ఉడుత పసిగట్టింది. కార
ణం తెలుసుకుంది. బాగా ఆలోచించింది. కుందేలుకు ధైర్యం చెప్పింది.
       ఉడుత నేరుగా మృగరాజు గుహకు వెళ్ళింది. ధనాగారం లో దూరింది. రెండు వజ్రాలను దొంగిలించింది. చెంగునా బయటకు వచ్చింది. వాటినికుందేలుకు ఇచ్చింది. చెవిలో గుసగుసలు చెప్పింది .
            నక్క, తోడేలు ను పిలిచింది కుందేలు. ఆ రెండు వజ్రాలను చెరొకటి ఇచ్చింది. "బావలూ! ఇలాంటి వజ్రాలు చాలా ఉన్నాయి . కావాలంటే ఎన్నైనా ఇస్తాను. నా వెంట వస్తారా?" అని
అడిగింది కుందేలు.  నక్క,తోడేలు  ఎగిరి గంతేశాయి.  వాటిని చూపమని  ఆతృతగా అడిగాయి. కుందేలు వెంట బయలు దేరాయి.  
        అప్పటికే ఉడుత మృగరాజును కలిసింది. "రాజా! మీ ధనాగారంలో వజ్రాలు దొంగిలించబడుతు ఉన్నాయి. నిన్న రాత్రి ఒక నక్క, తోడేలు వచ్చి  పట్టుకు పోవడం నేను కళ్ళారా చూశాను. అవి కాపలాదారులయిన పిల్లి, భల్లుకాలకు మత్తు ఇచ్చాయి. నిద్రపుచ్చి దొంగిలించుకు పోయాయి . కావాలంటే మీరే చూడండి. ఈ రాత్రికి అవి మళ్ళీ వస్తాయి" అంది.
         సింహం అంతా గమనిస్తూ మెలుకువగా ఉంది. ఇంతలో  నక్క, తోడేలును గుహలోకి పంపింది కుందేలు. వజ్రాలు దొరికేది అందులోనే అంది. అవి
ఆలోచించకుండా గబగబా లోపలికి దూరాయి. కోపంతో  ఉన్న సింహం అమాంతం వాటి మీదకు దూకింది. రెండు చేతులతో రెంటిని పట్టుకుంది. "మీరు వజ్రాల కోసమేనా వచ్చింది?" అని అడిగింది. అవి వణకుతూ "అవును" అని తలలూపాయి. 
అంతే.  సింహం కోపంలో రెచ్చి పోయింది. దాని గుండే  కుతకుత ఉడికంది . తన పంజాతో రెంటినీ చీల్చి చంపింది.
           తన శత్రువులను తుదముట్టించే ఉపాయం చెప్పి సాయం చేసినందుకు ఉడుతకు కృతజ్ఞనతలు తెలిపింది కుందేలు.
              నీతి; ఆపద వచ్చినప్పుడు ఇతరుల సాయంతో తప్పించుకోవాలి