ప్రమీలా సామ్రాజ్యం.:- వసుధా రాణి

 మా సావిత్రి అక్కయ్యా వాళ్ళు రమణారెడ్డి గారి ఇంట్లో అద్దెకు ఉన్న రోజులు మా చిన్నారి ,కిషోరూ మరియూ నాకూ బంగారురోజులు.ఇంటి చుట్టూ పెద్ద తోట . ఆ తోటలో లేని పండ్ల చెట్టు,పూల చెట్టు లేదు. మేము ఆడని ఆటలు లేవు. ఐతే కొన్ని రోజుల  పాటు పక్కవాటాలో మాకు ఎంతమాత్రం పొసగని కుటుంబం ఒకటి ఉండేది.వాళ్ళతో రకరకాల ఇబ్బందులు,గొడవలు అయ్యాక కొన్నాళ్ళకి బగమంతుడు మాయందు ఉండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.ఆ శుభసందర్భంలో మేము ముగ్గురం పుణుగులు,మిర్చిబజ్జి,సోంపాపిడి పార్టీ  చేసుకున్నాం కూడా.
కొన్నాళ్ళు మొత్తం ఇంటికి మేమే రాజుల్లా , రాణుల్లా గడుపుతూ ఉండగా. ఒక రోజు మేము బడినుండి ఇంటికి వచ్చేసరికి అశోక్ ల్యేలాండ్ లారీ ఇంటి ముందు నిలిపి దానినుంచి సామాన్లు పక్కవాటాలో దింపుతూ మనుషులు . అయ్యో మళ్ళీ మనకి పోటీదారులు ఎవరో వస్తున్నారురా అనుకున్నాం.
సరే ఓ నాలుగు రోజులు పక్కింట్లో వాళ్ళని వదిలేసి మా ఆటలు ఆడుకున్నాం ఎంత మాత్రం పట్టించుకోకుండా.ఒకరోజు సాయంత్రం వాకిట్లో రెండు గేట్లకి నడుమ వుండే గుబురు సంపెంగ పొద దగ్గర నిలబడి వాసననుబట్టి పువ్వు ఎక్కడవుందో చూసి కోస్తూ ఉండగా ,నువ్వు స్వరాజ్య పద్మజ చెల్లెలివి కదోయ్ అంటూ మా అక్కవయసు ఉన్న అమ్మాయి పక్కయింట్లోనుంచి బయటికి వచ్చింది. అబ్బా పద్దక్కా ఇక్కడ కూడానా అనుకున్నా.ఎందుకంటే బడిలో ,ఇంకా కొన్ని చోట్ల మాపద్దక్క లేబుల్ నుంచి బయటపడి నా మార్క్ వేసుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అవును పద్మజ చెల్లెల్ని,సావిత్రి మేడం మా అక్క ఇక్కడుండేది వాళ్లే అన్నా ఇల్లు చూపుతూ.
అంతే వాళ్ళ వైపు వరండాలో నుంచి బిలాబిలా ఈ అమ్మాయి కంటే వయసుల వారీ పెద్దగా ఉన్న మరో నలుగురు అక్కయ్యలు.ఇంకో పెద్దావిడ  బయటికి వచ్చారు నవ్వుతూ. మొత్తం ఆరుగురు ఆడ వాళ్ళు స్నేహ పూర్వకమైన చిరునవ్వుతో నాకేసి చూస్తూ అదృశ్యం నా మనోఫలకంపై అలా ముద్రపడిపోయింది.ఇంక చూసుకోండి .నేను కొన్నిరోజులు ఆ అక్కల మత్తులో ఎంతలా పడిపోయాను అంటే ఆటలు కట్టబెట్టి బడినుంచి రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని.
వయసులో ఆఖరి అమ్మాయి వాసంతి అక్క నాకన్నా ఐదు ఏళ్ళు పెద్ద ఇంక అలా  పై వయసు వాళ్ళు మిగిలిన సత్యవతి,విజయలక్ష్మి,మల్లిక, అనూరాధ . మా చిన్నారి,కిషోర్ కు వీళ్లేమీ ఆసక్తిగా అనిపించ లేదు కానీ , నాకు మాత్రం యమా కిక్కు ఉండేది వాళ్ళతో.
మూడు ఆకర్షక అంశాలు వాళ్ళ దగ్గర నన్ను అటువైపు లాగుతుండేవి, అవి ఏమిటంటే మొదట చిరుతిండి నేను వెళ్ళేసరికి ఏదో ఒకటి తినటానికి వాళ్ళమ్మ  సిద్దంగా పెట్టివుండేది.మా అమ్మ కూడా ఎప్పుడూ నేను అడగకుండా పెట్టలేదు మరి. రెండో అంశం నేను వెళ్ళగానే అందరూ నన్ను మధ్యలో కూర్చోపెట్టుకుని నా చుట్టూ కూర్చుని నేను చెప్పే కాకమ్మకబుర్లు శ్రద్ధగా వినేవాళ్ళు. మూడోది బహుముఖ్యమైన విషయం అదేమిటంటే వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ ఆడవాళ్లే వుండే వాళ్ళు.వాళ్ళ అమ్మ,ఈ ఐదుగురు అక్క చెల్లెళ్ళు .
మా ఇంట్లో మేము అందరం ఆడపిల్లలం అయినా నాన్న, అన్నయ్య ఉండేవాళ్ళు. అక్కయ్యా వాళ్ళ ఇంట్లో బావగారు ఇట్లా ఉండేది.ఇక్కడ ఇందుకు భిన్నంగా మొత్తం ఆడపిల్లలు, వాళ్ల అమ్మ  అందరూ కలిసి ఇల్లు నడుపుకునే వాళ్ళు.చక్కగా పనులు చేసుకునే వాళ్ళు, విజయలక్ష్మి అక్క ఇల్లు శుభ్రంగా పెట్టటం,అందంగా సర్దటంలో నేర్పరి.వంగిచూస్తే మన మొఖం కనపడేంతగా  అద్దంలా ఉండేది నేల. వాసంతి అక్క బజారు పనులన్నీ చేసేది.ఇలా అందరూ తలా ఓ పని చేసుకుంటూ ,ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళు.
వీళ్ళందరిలోకి పెద్దది ఐన అనూరాధ అక్క నన్ను ఒకసారి బేతాబ్ హిందీ సినిమాకి తీసుకెళ్లింది.సన్నీ డయోల్ ఇష్టం అట అక్కకి, ఐతే మిగిలిన వాళ్ళకి ఎవరి హీరోలు వాళ్లకి వున్నారు కనుక మిగిలిన అక్కలు రాలేదని నన్ను తీసుకెళ్లింది.హీరోలని అందం ఆధారంగా కూడా చూస్తారని నాకు వాళ్ళ వలన తెలిసింది.
ఇలా కొన్నిరోజులు బోలెడన్ని కబుర్లు , బోలెడు రకాల తినుబండారాలుగా మా స్నేహం కొనసాగుతుండగా ఒకరోజు నేను బడి నుంచి ఓ మాంచి కాకమ్మకబురుతో వాళ్ళ ఇంటిలోకి వెళ్ళాను.అక్కలందరూ పెద్దపెద్దగా ఏడుపు గొంతుకలతో మాట్లాడుతూ వున్నారు.ఒక పెద్దాయన నల్లగా, చింపిరి జుట్టుతో  చొక్కా లేకుండా తెల్లప్యాంట్ మాత్రం వేసుకుని కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఎవరూ ఏమీ మాట్లాడటానికి లేదు ,నా ఇష్టం అంటూ గట్టిగా ఒక  వినకూడని పదం వాడాడు.
అంతే నేను గిర్రున వెనుదిరిగి వచ్చేసా.
      (సశేషం)