కవనపవనాలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి, సికింద్రాబాద్.

 ఏకపది:(జంట నగరాలు)
*******
అన్నదమ్ముల్లాగా_రెండు సంస్కృతుల హైద్రాబాద్,సికింద్రాబాదులు.
ద్విపదం:(హైటెక్ సిటీ)
*******
సాంకేతికతకు చిరునామై వెలసినది.
అభివృద్ధికి‌ సంకేతమై నిలబడినది.
త్రిపదం:(సైబరాబాద్)
*******
నగర విస్తరణకు మార్గమైనది.
శివారుల సింగారమై ఏర్పడినది.
జనాభా నివాసానికి అనువైనది.
లఘుకవిత:(సుందర భారతదేశం)
**********
హిమాలయాలే కిరీటాలుగా
కాశ్మీరమే నుదుటి సింధూరంగా
నదీనదాలు జడపాయలుగా
పుణ్యక్షేత్రాలే ఆభరణాలుగా
పచ్చనిపొలాలే వస్త్రాలుగా
అభివృద్ధి, సౌభ్రాతృత్వం కరాలుగా
సకలకళలే గళసీమగా
ఆధ్యాత్మికత,తాత్వికత రెండు నయనాలుగా విలసిల్లునది.
వచనకవిత:(దుష్టసంహార నరసింహ దురితదూర)
**************************
వేయిసంవత్సరాల చరిత్ర కలిగిన
యోగలక్ష్మీనృసింహుని దర్శనం
సర్వపాపహరణమై ప్రసిద్ది గాంచింది.
గోదావరినదీ తీరాన కొలువై
వేదవిద్యలకు,జ్యోతిశ్శాస్త్రానికి
ఆలవాలమైంది.
శాతావాహనులు,బాదామి చాళుక్యులు,కళ్యాణి చాళుక్యుల కాలంలో ఉన్నతమై విలసిల్లింది.
స్వయంభూ సాలగ్రామ విగ్రహరూపంలో
పద్మాసనుడై,కోరమీసాల ప్రసన్నవదనంతో,భక్తులకొంగుబంగారమైనాడు.
స్కాందపురాణ ప్రశస్తి కలిగి
ధర్మవర్మ పేరు మీదుగా ధర్మపురై
తెలంగాణ ముఖ్యపుణ్యక్షేత్రమయింది.
గంపలవాడ,తొట్లవాడలతో
చారిత్రాత్మకమై నిలిచింది.
సత్యవతీదేవి నిర్మించిన సైకతస్తంభం సత్యనిదర్శనమై
నేటికీ కనిపిస్తుంది.
దక్షిణకాశీగా పిలవబడి,
ధర్మపురికి పోతే యమపురి ఉండదనే నానుడితో ప్రసిద్ధమైంది.
శివకేశవుల నిలయమై
శైవ,వైష్ణవ,ముస్లిముల మతసామరస్యానికి ప్రతీకై
యమధర్మరాజు కొలువైన పవిత్రక్షేత్రం.
భూషణవికాసశతకంలో స్తుత్యమై,ప్రఖ్యాతి గాంచింది.
నానీ:(టీ హబ్)
*****
యువకెరటాలకు
దిశానిర్దేశం.
నవమస్తిష్కాలకు
ప్రోత్సాహం.