శతక పద్యం కథ : ఎం . బిందు మాధవి


 గ్రౌహిణ్యం"

దక్షుడు లేని యింటికిఁబదార్థము వేఱొక చోట నుండి వే 

లక్షలు వచ్చుచుండినఁబలాయనమై చనుఁగల్ల గాదు ప్ర 

త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే 

అక్షయమైన గండి తెగనట్టి తటాకములోన భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! గట్లు తెగి గండి పడి యున్న పెద్ద చెరువులోనికి ఎన్ని వైపులనుండి ఎంత గొప్ప ప్రవాహములు ఎన్నివాగులు వచ్చి పడిననూ ఆ నీరు నిలువదు కదా! అదే విధంగా, ఒక కుటుంబమునకు ఎన్ని విధములుగా ఎంతఆదాయము వచ్చిననూ ఆ సంపదను ఒక పద్ధతి ప్రకారము నిర్వహించు సమర్థుడైన యజమాని లేక పోయినచో ఆసంపదలన్నియు వ్యర్థముగా ఖర్చయిపోవునని భావం

"మా ప్రకాష్ రెండో ఫ్లాట్ కి ఎడ్వాన్స్ కట్టాడు. వాళ్ళుంటున్నది స్వంత ఫ్లాటే! నీకు తెలుసుగా" అన్నాడు మధు. 

"వాళ్ళ లాగే మనమూ డి ఐ జి (డబుల్ ఇన్ కం గ్రూప్ అని ఆఫీస్ వాళ్ళు పెట్టిన ముద్దు పేరు అది). మనకి ఒక ఫ్లాట్కొనటమే చేతకావట్లేదు. వాళ్ళకీ మనలాగే ఇద్దరు పిల్లలు. ఎలాగబ్బా" అని క్వశ్చన్ మార్క్ మొహం పెట్టింది వల్లి. 

వీరి మాటలు వింటున్న రుక్మిణమ్మ గారు, "లిటిల్ డ్రాప్స్ మేక్ ద ఓషన్" అని చిన్నప్పటి నించీ వింటున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ, ప్లానింగ్ ఉంటే అన్నీ సాధ్యమే. "వేణ్ణీళ్ళతో కొంపలు ఆరవు" అనుకుంటారు కానీ జాగ్రత్త  లేని చోట మనం వేసే ప్రతిఅడుగులోను వృధా ఉంటుంది. కాకపోతే అది వృధా అని గుర్తించం" అన్నారు. 

* * * * 

ఉదయం వంటతో పాటు మిగిలిన  పనులు ముగించి పిల్లలని తయారు చేసి, తను తయారయి వల్లి ఆఫీస్ కివెళుతుంది. వల్లి వెళ్ళాక, తమతో ఉండే ఆడపడుచు పిల్లలని స్కూల్ ఆటో ఎక్కిస్తుంది. వంట పనిలో మిగులు ఏమైనాఉంటే పూర్తి చెయ్యమని ఆడపడుచు మల్లిక కి చెప్పి వెళుతుంది. 

చదువు మీద అశ్రద్ధ, టీవీ మీద అత్యంత శ్రద్ధ ఉన్న మల్లిక వదిన చెప్పిన విషయాలు సగం వినిపించుకోదు. ఆటో వాడుఎక్కువ సేపు వేచి ఉండడు కనుక, ఆటో ఎక్కించటానికి పిల్లలని తయారు చేసే పని మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. 

"మల్లికా..పచ్చడికి అన్నీ సిద్ధం చేసి గిన్నెలో పెట్టాను. కొబ్బరి పచ్చడి మిక్సీలో వేసి, పప్పు లో పోపు పెట్టేసి, మీ అన్నయ్యబాక్స్ సర్దేసెయ్యి. పిల్లల బాక్స్ లో కూర పెట్టాను. స్టవ్ మీద పాలు ఉన్నాయి. పొంగాక తీసి, చల్లారాక ఫ్రిజ్ లో పెట్టు. నాకుఇవ్వాళ్ళ ఇన్స్పెక్షన్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి" అన్నది చెప్పులేసుకుంటూ. 

అందరి క్యారేజిలు సర్దుకోవటం అయ్యాక, కాలేజికి వెళ్ళే లోపు మిగిలినవి ఫ్రిజ్ లో పెట్టే పని మల్లికది. కానీ పదార్ధాలునచ్చలేదని కొన్ని, ఆ రోజు ఆ పదార్ధం తిన బుద్ధి అవలేదని కొన్ని, పనిమనిషి లచ్చికిచ్చేస్తుంది. రాత్రికి మళ్ళీ అన్నిపదార్ధాలతో పూర్తి వంట చెయ్యవలసిందే! 

* * * * 

మల్లిక టీవీ చూస్తూ వదిన చెప్పి వెళ్ళిన పనుల్లో కొన్ని మర్చిపోతుంది. ఎక్కువ సార్లు పాల స్టవ్ ఆర్పటం మరచిపోయిఇగరపెట్టేస్తూ ఉంటుంది. వల్లికి ఆఫీస్ నించి వచ్చి కాఫీ తాగే అలవాటు! పాలు ఉంటే సరే, లేకపోతే అప్పటికప్పుడుపనమ్మాయి లచ్చి సూపర్ బజార్ కి వెళ్ళి తేవలసిందే! 

ఇలా తరచు జరగటం వల్ల, లచ్చి కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పనిలో పని ఆ డబ్బులో తనకి కావలసినసరుకులు వల్లి ఇచ్చే డబ్బులోనె తెచ్చేసుకుంటుంది. "అమ్మగారూ... చిల్లర ఇదిగో అని ఇస్తూ నాను ఓబిస్కిట్ ప్యాకెట్తెచ్చుకున్నాను. పిల్లగాడు ఊకనే గోల పెట్ట పట్టిండు. పస్ట్ కి జీతం లో పట్టుకోండి" అని నిజాయితీగా చెబుతుంది. 

ఆ డబ్బు విషయం ఫస్ట్ కి జీతం ఇచ్చేప్పుడు వల్లీ పట్టించుకోదు,  లచ్చికీ గుర్తుండదు. ఇలా మాట్లాడుకున్న జీతం కాకనెలకి ఇంకో ఐదారువందలు అదనంగా తీసుకుంటూ ఉంటుంది. 

ఆఫీస్ పనులతో సతమయ్యే వల్లికి ఇవన్నీ పట్టించుకునే ఓపిక, తీరిక లేవు. 

"అమ్మా తమ్ము ప్రాజెక్ట్ వర్క్ కోసం థెర్మో కోల్, కలర్ పేపర్స్ తేవటానికి "రత్న దీప్" కి వెళుతున్నాను" అని పాపాయ్ గట్టిగాఓ కేక వేసి వల్లి సమాధానానికి ఎదురు చూడకుండా  వెళ్ళిపోయింది. 

చేసే పనిలోంచి తలెత్తిన వల్లి "నిన్న  ఆఫీస్ నించి వస్తూ తెచ్చాను కదా! మళ్ళీ ఎందుకురా. నాతో చెప్పి,నేను మాట్లాడేలోపే వెళ్ళిపోతే ఎలా? అది ఇన్ ఫర్మేషనా..పర్మిషనా! ఒక్కో వస్తువు రెండు మూడు సార్లు కొని ఇల్లు నింపుతున్నారు. డబ్బంటే లెక్క లేకుండా పోయింది" అన్నది. 

ఇంతలో పాపాయి వస్తువులు తేవటమూ అయింది..బాబి గాడు కత్తెరొకటి పుచ్చుకుని కార్య రంగంలోకి దిగటమూఅయింది. 

"నేను తెచ్చినవి బుక్ షెల్ఫ్ లో పైన పెట్టండి. ఈ సారి అవసరమైనప్పుడు మళ్ళీ కొనకుండా ఉపయోగపడతాయి" అన్నదివల్లి. 

కానీ ఆ సరికే ఇంట్లో ఉన్నవి చూసిన బాబిగాడు "నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. స్కూల్ కి వస్తూ తెచ్చి నీకిస్తాలే" అని  ఫ్రెండ్కి ప్రామిస్ చేసెయ్యటం జరిగిపోయింది. 

* * * * 

దొరికే ఒక్క ఆదివారం కాస్త రిలాక్స్ అవ్వాలని మనసులో ఉన్నా, అందరూ ఇంట్లో ఉంటారని, ఓపిక చేసుకుని అన్నిఐటంస్ తో వల్లి వంట చేస్తుంది. టీవీలో మునిగిపోయిన పిల్లలు కానీ, మధు కానీ వంట అయ్యేంత వరకు మాట్లాడరు. 

తీరా లంచ్ టైంకి "రోజూ ఇదే లంచ్ బోర్ కొడుతోంది మమ్మీ! వెరయిటీగా  హోటల్ కి వెళదాం" అని పిల్లలు గొడవచెయ్యటంతో, చేసిన వంట వదిలేసి, మధు పిల్లలకి ఓటేస్తూ ఉంటాడు.  ఆ ఇంట్లో అది సర్వ సాధారణం! 

"బయటికి వెళ్ళతల్చుకుంటే ముందుగా చెప్పండి, శ్రమ..ఖర్చు తప్పుతాయని" ఎన్ని సార్లుచెప్పినా వల్లి ఆక్రోశం "చెవిటివాడి ముందు ఊదిన శంఖనాదం" లాంటిదే! 

"ఫరవాలేదు లేవోయ్ వారం లో ఒక్క రోజు పిల్లలు సరదా పడితే, తీసుకెళితే కూడా గొడవేనా? వండిన పదార్ధాలన్ని చక్కగాలచ్చికిచ్చెయ్. దానికి మాత్రం అన్ని రకాల పదార్ధాలతో భోంచెయ్యాలని ఉండదా? మామూలుగా అయితే  మనం మాత్రంవండుకున్న అన్ని పదార్ధాలు ఇస్తామా ఏంటి" అని మధు సన్నాయి నొక్కులు నొక్కుతాడు. 

* * * * 

"ఏమండి మా కొలీగ్ స్వప్న ఇంట్లో అర్జంట్ అవసరం వచ్చిందని అడిగితే, పది వేలిచ్చాను. వచ్చే నెల్లో ఇస్తానంది" అనిచెప్పింది వల్లి రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర. 

"అరే, మా కొలీగ్స్ అంతా ఎక్కడో ప్లాట్స్ కొనాలని ఎడ్వాన్స్ ఇస్తుంటే నేను ఇచ్చాను. ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనిచెబుదామనుకుంటుంటే నువ్వీ కబురు చెప్పావు. సరేలే" అన్నాడు. 

ఇలా అప్పటికి పదేళ్ళ నించీ ఉద్యోగం చేస్తున్న వల్లి-మధు జంట చేసే ఖర్చులు, ఇంటి నిర్వహణ ఇలా "పిట్టని కొట్టపొయిలో పెట్ట" లాగా ఎక్స్ట్రా ఖర్చు ఏమొచ్చినా వెతుక్కునేట్లే ఉంటుంది. 

మంచి ఉద్యోగాలు చేస్తూ, మెరుగైన జీతాలు తెచ్చుకుంటున్న ఇద్దరికీ ఖర్చులో ఒక నియంత్రణ, ఆర్ధిక ప్రణాళిక, రేపన్న రోజుకిదాచుకోవటం అనేవి లేకపోయే సరికి ఎలాంటి దురలవాట్లూ లేకపోయినా అప్పటి వరకు ఫ్లాట్ కొనుక్కోవటం చేత కాకఅద్దె ఇళ్ళల్లోనే బ్రతుకుతున్నారు.  పిల్లకి తనకి చిన్నమెత్తు బంగారం కొనటం మీద దృష్టి పోలేదు. 


* * * * 

ఆ మాటే ఇప్పుడురుక్మిణమ్మగారు కూతురు వల్లికి  చెప్పి, 

"దక్షుడు లేని యింటికిఁబదార్థము వేఱొక చోట నుండి వే 

లక్షలు వచ్చుచుండినఁ................

నీరు నిల్చునే 

అక్షయమైన గండి తెగనట్టి తటాకములోన భాస్కరా!"

అని "చిల్లు కుండ" లాంటి ఇంట్లో ఎంత సంపాదన వచ్చినా, చేతిలో రూపాయ్ ఉండదు. అవసరం వచ్చినప్పుడు డబ్బువెతుక్కోవలసి వస్తుంది " అని చెప్పింది. 

"చదువు, సంపాదన ఎంత ముఖ్యమో, దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యం అని తెలియాలి" అని కూడా చెప్పి ఆర్ధికప్రణాళిక ఎలా ఉండాలో చెప్పింది.