సామెత కథ : ఎం. బిందు మాధవి

 చేటు పాటు తెలియనమ్మ 
మొగుడు పెళ్ళికి వెళ్ళిందిట!
 
‘ప్రమీల’, ‘వినయ్’ భార్యా భర్తలు. వినయ్ ‘సెంట్రల్ వేర్ హౌస్’ లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు క్యాంపులకి వెళ్ళవలసి వస్తుంది. ప్రమీల పెళ్ళి కి ముందు ఉద్యోగం చేసింది. తరువాత ఇంటి నిర్వహణ, అత్తమామల సంరక్షణ, పిల్లల పెంపకం కోసం మానేసింది. కానీ పాత మిత్రులు, సహ ఉద్యోగులు ఇంటికి వచ్చిపోతూ ఊండటంతో స్నేహాలు కొనసాగుతున్నాయి.
చదువుకున్న రోజుల్లోని స్నేహితులు కొందరు ‘మార్క్ ఫెడ్’ లోను, కొందరు ‘సెంట్రల్ ఎక్సైజ్’ లోను పని చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసుల విషయాలు, ఇంటి వ్యవహారాలు, పిల్లల పెంపకం గురించి అనేక విషయాలు మాట్లాడుతూ ఉండే వారు. 
అందరూ కలిసి వారాంతపు సెలవుల్లో ‘కిట్టీ పార్టీలు’ పెట్టుకునే వారు. అందులో ‘చిట్లు’ వేసుకునే వారు. ప్రమీల బయటికి ఉద్యోగానికి వెళ్ళే అవసరం లేదు కనుక ఎక్కువ సార్లు వీళ్ళ ఇంట్లోనే పార్టీ పెట్టుకునే వారు. వాళ్ళందరికీ ‘భోజనాలు’ తనే ఏర్పాటు చేసేది. మళ్ళీ ఎక్కువ సేపు వారాంతంలో బయటికి వెళితే, ‘అత్త మామ’లకి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి కూడా ‘ట్యూషన్’ లు ‘హోంవర్కు’లకి కష్టం అవుతుందని అలాంటి ఏర్పాటు చేసుకున్నారు.
‘మార్క్ ఫెడ్’ లో పని చేసే స్నేహితురాలు ప్రభుత్వం ద్వారా ‘మంచి వస్త్రాలు’ తక్కువ ధరలో దొరుకుతాయి. అవి ఎలాగంటే, ఒక్కొక్క సారి ‘ఎగుమతుల’కోసం తయారు చేసిన వస్త్రాలు, కారణాంతరాల వల్ల ఎగుమతి అవక ఇక్కడే ‘న్యాయమైన’, ‘సరళమైన’ ధరలకి అమ్ము తారు. అది ముందుగా మార్కెట్ లో పెట్టరు. డిపార్ట్ మెంట్ వాళ్ళం కనుక మాకు ముందుగా తెలుస్తుంది’. అని ‘అది మన బోటి వాళ్ళకి మంచి అవకాశం’ అని, ‘ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చింది’ అని ప్రమీలని ఆ గిడ్డంగి కి తీసుకెళ్ళింది.
ఆ బట్టలు చూసేటప్పటికి ప్రమీలకి ఒళ్ళు తెలియలేదు. ‘మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదు’ అని ఆబగా, అవసరానికి మించి బోలెడు డబ్బు పోసి చాలా బట్టలు కొనేసింది. నెల ఖర్చులకి భర్త ఇచ్చిన డబ్బులో ఎక్కువగా ఖర్చు పెట్టేసింది. ఇంటికొచ్చి అత్త గారితో ‘తను చేసిన పని చాలా మంచిదని, ఏటికేడాది బోలెడు డబ్బు పోసి, చాలా చోట్లు తిరిగి కొనవలసినవన్నీ ఒక్క చోటే కొనగలగటం తన అదృష్టమని’ బాగా సంబరంగా చెప్పింది.
అప్పటికే, ఈ ‘కిట్టీ పార్టీ’ల పేరు చెప్పి తనే ‘భోజనాలకి’, ఇతరత్రా ‘ఎక్కువ ఖర్చులు’ పెట్టటం, ఆ విషయాన్ని గొప్పగా చెబుతూ, తన ఇంట్లో వారిని ఏమరుపాటు లేకుండా చూసుకోవటానికి ఆ ఏర్పాటు చెయ్యటం తన ‘తెలివి’కి ‘పరాకాష్ట’గా భావించటం అనే విషయాలతో కొంత ‘అసంతృప్తి’గా ఉన్నారు ప్రమీల అత్తగారు. 
‘ప్రమీలా తప్పు చేశావమ్మా, సంవత్సరమంతా సంపాదించే డబ్బుతో తీర్చుకోవలసిన అవసరాలు ఒక్క నెల్లోనే ఖర్చు పెట్టేస్తే పిల్లలున్న ఇంట్లో కష్టం కదమ్మా. ఒంటి చేతి సంపాదన, రేపన్న రోజు ఏ రోగమో రొప్పో వస్తే మళ్ళీ డబ్బుకు వెతుక్కోవాల్సి వస్తుంది’ అని ఆవిడ సున్నితంగా కేకలేసింది.
అత్తగారి ఈ రియాక్షన్ తో చిన్న బుచ్చుకున్న ప్రమీల భర్త రాగానే, ఉత్సాహం తెచ్చి పెట్టుకుని మధ్యాహ్నం తన షాపింగ్, అందులో లాభాలు ఏకరువు పెట్టింది. అసలే ఆఫీస్ పనిలో అలిసిపోయి వచ్చిన ‘వినయ్’ భార్యని కేకలెయ్యలేక, అలా అని చేసిన పనిని హర్షించలేక, నవ్వుతూ ‘నీలాంటి వాళ్ళని చూసే వచ్చి ఉంటుందోయి "చేటు పాటుతెలియనమ్మ మొగుడి పెళ్ళికి వెళ్ళింది" అనే సామెత’ అన్నాడు. “ఖర్చు పెట్టే ముందు కొంచెం ఆలోచించాలోయి” అన్నాడు.