పగటి కలలు:-పండుగాయల సుమలత.గొట్లూరు.కర్నూలుజిల్లా.


 ఒక ఊరిలో రామయ్య అనే చేపలు వ్యాపారి ఉండేవాడు.అతను ప్రతి రోజు చెరువుకు వెళ్లి చేపలు పట్టేవాడు. అతనికి రేచీకటి ఉంది. రామయ్యకు ఎప్పటికైనా కోటీశ్వరుడు కావాలని ఆశ.

ఒక రోజు రాత్రంతా పెద్ద వర్షం పడింది. రామయ్య ఆనందానికి అవధులు లేవు.'చెరువు  బాగా  నిండి  ఉంటుంది, ఎక్కువ చేపలు ఉంటాయి. ఇక నాకు బాగా లాభం వస్తుంది' అని అనుకున్నాడు. పడవను, వలను తీసుకొని చెరువుకు వెళ్లాడు.రామయ్య అనుకున్న విధంగానే చెరువు బాగా నిండింది.అది చూసి గట్టుమీదే ఉండి కలలు కుంటున్నాడు.

'నేను బాగా సంపాదించి ఇలాంటి పడవలను చాలా కొని,  సముద్రంలో వలలు వేస్తాను. చాలా చేపలు పడతాయి. పెద్ద పెద్ద పడవలు కొంటాను.మేడలుకడతాను, ఇంటినిండా ధనధాన్యాలు ఉంటాయి. పనివారు నా చుట్టూ ఉంటారు' అని రకరకాలుగా కలలు కంటున్నాడు. అప్పటికి సమయం సాయంత్రం అయింది.అప్పుడు లేచి 'ఇంత సేపు కలలు కంటున్నానా!' అనుకుంటూ గబగబా పడవతో చెరువు మధ్యకు వచ్చి వలను విసిరాడు. కొన్ని చేపలు పడ్డాయి. కాని అప్పుడే పెద్ద గాలి, వాన మొదలయింది. అయినను రామయ్య చేపలు పడుతున్నాడు.కాని అతని దురదృష్టం. పడవ పాతది కావడంతో విరిగి పోయింది.అందులో అప్పటికే చీకటి పడింది.ముందే రామయ్యకు రేచీకటి. ఏమి కనిపించదు. ఈత రావడంతో కనిపించక పోయినా కష్టపడి గట్టుకు చేరాడు. పాపం రామయ్యకు తన ప్రాణాలు తప్ప ఏమి మిగల లేదు.

అందుకే 'మనం ఏదైనాఉపయోగపడేపని చేయాలనుకుంటే, కలలు కంటూ కూర్చోకూడదు. ముందు పని మొదలు పెట్టాలి.' అనుకున్నాడు రామయ్య.