Reminiscence - 167:-తుమ్మేటి రఘోత్తమరెడ్డి


 ఎదురుగా ఉన్న ఓ దేవతా మూర్తి కాంస్య విగ్రహాన్ని చూస్తూ , ఒక పిల్లవాడు అనుకరిస్తూ విగ్రహ భంగిమలో నిలుచున్నాడు! అది అనుకరణ!!


ఆ ఫొటోను చూస్తూ ఉంటే, నాలో నవ్వు విరిసి ,కొన్ని జ్ఞాపకాలు కదిలాయి...ఇది ప్రతీ వారి స్ధితే! కాకపోతే స్ధలకాలాలు వివరాలు కాస్తా వేరువేరుగా ఉంటాయి.


నా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ఏవో కొన్నింటిని అనుకరించి ఉంటానా?

ఎప్పుడెప్పుడు వేటిని ఎవరిని అనుకరించాను? చిన్నపుడేనా? ఇప్పటికీ కొనసాగుతోందా?


పిల్లలు పుట్టి పెరుగుతున్న క్రమంలో , పెద్దవాళ్ల ప్రవర్తనలను అనుకరించే ప్రయత్నాలు చేస్తారు!

కొందరి నడక తీరును కొందరు పిల్లలు‌ అనుకరిస్తారు-మరి కొందరి మాట తీరును అనుకరిస్తారు- ప్రకృతిలోని జీవజాతుల కంఠస్వరాలను అనుకరిస్తారు! 

చిన్నప్పుడు కోకిల లాగా పాడటానికి ప్రయత్నం చెయ్యని వారు అరుదు కద!? అదీ మనమూ పోటీ పడి పాడటం మరిచిపోలేని జ్ఞాపకం!


అనుకరణ వల్ల బోలెడు హాస్యం కూడా కలుగుతుంది!


ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే..

నా చిన్నప్పుడు మా కొట్టంలో ఎడ్లు బర్లు(గేదెలు)దుడ్డెలు ఆవులు దూడలు కూడా ఉండేవి! అవి అరుస్తూ ఉంటే, వాటిలాగే అరవడానికి ప్రయత్నం చేసేవాన్ని!

అందులో బర్లు ఒర్రడం రకరకాలుగా ఉంటుంది!

బర్రె తన దుడ్డె కోసం అరవడం ఒకలాగా ఉండేది! అందులో ఆందోళన ఆరాటం ప్రేమ కలగలిపి ఉండేవి! వాటిని నా గొంతులో పలకడానికి సాధన చేసేవాన్ని!

తమను మట్ల నుండి కట్లు విప్పమని బర్లు ఒర్రేవి,అవి మరొకలాగా ధ్వనించేవి!

బర్లు అరవడం రెండు మూడు విధాలుగా ఉంటే, వాటి చిన్న చిన్న దుడ్డెలు ఒర్రడం మరో విధంగా ,ఆర్తి నిండిన స్వరాలతో ఉండేవి! సేమ్ దుడ్డెల మాదిరిగా ఒర్రడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, బర్లు తిరిగి చూసేవి!

ఒక్కొక్క సారి బర్రెలాగా అరుస్తూ ఉంటే , పాపం దుడ్డెలు నిజమే తమ తల్లి వచ్చిందనుకుని సంతోషంగా ఇంటిముందు వాకిటి వైపు చూసేవి!


ఎడ్లు సాధారణంగా ఎక్కువ అరిచేవి కావు! అప్పుడప్పుడు పోరాట స్వరాలను వినిపించేవి! వాటిని 'రంకెలు' అనే వారు! నేనూ అలాగే వేసేవాన్ని ! అలా వేసినప్పుడు ఒక్కొక్క సారి ఎడ్లు నా వైపు తిరిగి చూసేవి! అప్పుడు మనం సక్సెస్ అని సంతోషం కలిగేది!


వర్షాకాలం వచ్చిందంటే, సాయంత్రం వర్ష సూచనలు గమనిస్తే , గొల్లబోయుడు మేపడానికి బీడు భూముల్లోకి‌ తోలుకుపోయి , తిరిగి ఇంటికి తోలుకు వచ్చేవాడు!

అవి తల్లుల పిల్లల అరుపులతో కొట్టంలోకి వచ్చేవి! వాటి అరుపులనూ అనుకరించేవాన్ని!


కోళ్లు బాతులు ఎలా అరిస్తే,నేనూ అలాగే అరవడానికి ప్రయత్నం చేసేవాన్ని! అవీ తిరిగి చూసేవి!

కోళ్లను పరీక్ష చెయ్యడానికి, గద్ద లాగా అరవడం! పిల్లుల అరుపులు కుక్కల అరుపులు సరేసరి!

ఆట పట్టించవలసిన వదినె వరసైన వారు ఇంట్లోకి రాబోతోంటే , తలుపు చాటు నుండి కుక్క లాగా అరవడం, సదరు వదినలు భయపడి , గ్రహించి ' హబ్బో నేను నిజంగానే కుక్క అనుకున్న - ఎంత భయపెట్టిస్తివి మరిదీ" అని నవ్వేవారు!


మా ఊరిలో ఒకరింటి వెనక రేగు చెట్టు ఉండేది! రేగు పండ్ల దొంగతనానికి వెళ్తే ,ఆమె ఎలా తిడుతుందో అచ్చం ఆమె లాగే " పోరగాండ్లూ మీ తలపండ్లు పలుగ- నేను వత్తాన ఉండుండ్రి" అనడానికి ప్రయత్నం చేసేవాన్ని!


మా వాడకు ఉన్న ఒక ముసలాయన రోజు మోదుగు ఆకు కోసం మా ఇంటికి వచ్చేవాడు! పొగాకు చుట్ట చుట్టుకోవడానికి! అతని బోసి నోటితో చుట్టాకు ఇవ్వమని అడగడాన్ని సేమ్ ఆయనలాగే అని , ఆయన నవ్వగానే ఆకును తెచ్చి ఇచ్చేవాన్ని!


గ్రామంలో కొందరు ప్రత్యేక కంఠస్వరాలు కలిగి ఉండేవారు!

వారి స్వరాలను అనుకరించేవాన్ని!ఒక రైతు- ఒక కూలీ- దుకాణం నడిపే కోమటి- బిచ్చగాళ్లు - గ్రామంలో ఉండే ఓ వెలమ దొర- దేవున్ని చెప్పే స్త్రీ- ఆడవారిలో కొందరు ఎలా శోకాలు పెడతారో వగైరా పిల్లలుగా ఆటల మధ్య అనుకరణ చేసేవాళ్లం!


గ్రామాలలో నాటకాలు ఆడేవారు!

'గంటె బాగోతులు' ' చిందు మాదుగులు' వగైరా!

ఆ నాటకాలు చూసిన తరువాత ,తిరిగి పిల్లలం ఓచోట చేరి 

అలాగే రాగయుక్తంగా పాటలు పాడే ప్రయత్నాలు చేసేవారం! అదంతా అనుకరణ!


కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల వీపులు మ్రోతలు మోగించేవారు,పిల్లలు ఆరున్నొక్క రాగాల స్ధాయిలో ఏడ్చేవారు- వారిని మరింత ఏడ్పించడానికి లేదా ఏడ్పును మాన్పించడానికి‌ వారిలాగే ఏడ్వటాన్ని‌ అనుకరించేవాన్ని!


ఈ విధమైన అనుకరణను ఓ విద్య లాగా సాధన చేసిన కొందరు , మిమిక్రీ కళాకారులుగా పేరుప్రఖ్యాతులు గడించారు!ఈ స్వరానుకరణ క్రమంగా సంగీతం వినడం వైపు దారితీసింది!


మనకు అందినంత వరకు రామాయణంలో మారీచుడు 'సీతా లక్ష్మణా" అని రాముని వలె అరవడం మొదటి అనుకరణ!


క్రమంగా ఆ బాల్య దశ దాటుతూ ,ప్రత్యేకంగా కొందరిని గమనిస్తూ ఉండేవాన్ని! అందులో మా బాపు (నాన్న) ముఖ్యుడు!

ఆయన'కర్మయోగి'

ఆయన ప్రవర్తన నామీద చాలా ప్రభావం చూపింది!

ఇప్పటికీ ఆయన లాగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను.. అది కూడా అనుకరణే! ఆయన మా ఇద్దరు అన్నదమ్ములకు ఆస్తిపాస్తులు పంచిన రోజు ,తనకు ఏమీ తీసుకోలేదు! అలా నా ఎరుకలో ఎవరూ లేరు!

ఆస్తిపాస్తుల పట్ల మా బాపు వైఖరి ఎప్పుడూ నన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది! దీన్ని అనుకరణ దశ దాటిన అనుసరణ అనాలి!

'ఆపేక్షలు వద్దు -ప్రశాంతంగా ఉండు'

తరువాత , ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నపు రామారావు గారిని కూడా కొంత అనుకరిస్తూ ఉన్నాను! 

'సామాజిక రుణం' వగైరా విషయంలో!


బాల్యంలో అనుకరణ ప్రారంభమై, కొన్ని విషయాలలో అది 'అనుసరణ' గా సాగుతోంది...కొన్ని విషయాల్లో మనం కొత్తగా నడవనక్కరలేదు- పెద్దల అడుగుజాడల్లో నడిస్తే చాలు!


అనుకరణ కొంతా-స్వతంత్రత కొంతా,వెరసి నా జీవితం!