వెన్నముద్దాకు (Scurvy Weed) ఔషధంగా... : -పి . కమలాకర్ రావు

 వెన్న ముద్దాకు  జొన్న ,మొక్కజొన్న  చేనుల్లో  విపరీతంగా మొలుస్తుంది. అక్కడ క్కడ చెత్తకుప్పల పై నీరు నిలిచే ప్రాంతాల్లో కూడా ఇది మొలుస్తుంది. పల్లెల్లో దీనిని ఆవు దూడ లకు గేదె దూడ లకు ఎక్కువగా తినిపిస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో దీని గురించి తెలియక పీకి పారేస్తుంటారు. దీనికి చిన్న చిన్న నీలి రంగు పూలు పూస్తాయి. దీని ఆకుల్లో సూక్ష్మక్రిములను నిర్మూలించే శక్తి ఉంది. 
 దీని ఆకులను శుభ్రంగా కడిగి నెల గొట్టి నీటిలో వేసి మరిగించి పసుపు వేసి చల్లారిన తర్వాత తేనె కలిపి త్రాగితే గొంతులో గవద బిళ్ళలు(Mumps) గొంతువాపు రాకుండా కాపాడుతుంది.
 వెన్నముద్ద ఆకులను  నీళ్లలో వేసి మిరియాల పొడి జీలకర్ర పొడి కలిపి కషాయంగా చేసి త్రాగితే ప్లీహం లో వాపు తగ్గిపోతుంది. మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరానికి కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది.
వెన్నముద్ద ఆకులను మెత్తగా నూరి కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి వాపుల పై గడ్డలపై కట్టుగా క డితే వాపు తగ్గి పోతుంది. గడ్డలు కరిగిపోతాయి. చంకల్లో గడ్డలు గజ్జల్లో గడ్డలు వచ్చినవారు ఈ మందును వాడి గడ్డలుతగ్గించుకోవచ్చు.
 వెన్న ముద్ద లేత ఆకులను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పెసరపప్పు లో వేసి పప్పు కూరగా వండుకొని తినవచ్చు.
 వెన్నముద్ద ఆకులను గుర్తించి దీని మొక్కలను కుండీలలో పెంచి వాడుకోవచ్చును.