గుడ్మార్నింగ్ -(155 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 మా ఊరికి వచ్చినప్పుడల్లా కొన్ని విషయాలు మనసులో మెదులుతూ ఉంటాయి!
అందులో 'ఊరి రుణం' అనేది ఒకటి! అంటే పుట్టి పెరిగిన ఊరు రుణం! 
మనిషికి నాలుగు రుణాలు ఉంటాయని అంటారు!
తల్లి రుణం- తండ్రి రుణం- గురు రుణం- సామాజిక రుణం అనే నాలుగు రుణాలు! అందులో సామాజిక రుణం అనే పెద్ద సబ్జెక్టును మళ్ళీ విడదీసి చూస్తే, పుట్టి పెరిగిన ఊరికి కూడా మనిషి ఎంతో కొంత బాకీ ఉన్నానని భావించుకోవడం! 
'మేం ఏం బాగుపడ్డాం? ఏం సంపాదించుకున్నాం? మేం ఎవరికీ దేనికి బాకీ పడిలేం ' అనుకునే ఉంటారు కూడా ఉంటారు! అటువంటి వారు కూడా కేవలం పుట్టి పెరిగినందుకు పుట్టిన ఊరుకు బాకీ ఉంటారు!
సంపాదించడం అంటే చాలా మంది అభిప్రాయం ప్రకారం ఆస్తులను పోగుచేసుకోవడం-సంతానానికి అందించడం!
అటువంటి వారి దృష్టిలో పుట్టడం పెరగడం అదే గ్రామంలో లేదా పట్టణంలో తిని బ్రతికారు కద? ఏదో ఒక పని చేసుకుని ఏదో ఒక జీవనప్రమాణం మేరకు బ్రతుకుతున్నారు కద? అందుకు ప్రతీ వారికి పుట్టిన ఊరి రుణం ఉంటుంది!ఆస్తులు వెనక వేసుకోక పోయినా, కేవలం ఆ గ్రామంలో ఆ వనరులతో బ్రతికుతున్నాం కనుక
తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో ఎవరికి చేతనైన పద్దతిలో వారు ఊరికి ఉపకారం చెయ్యాలి!
మనం ఎప్పుడైనా ఊరుకు నమస్కరించామా?
దానికి ఎప్పుడైనా గుడ్మార్నింగ్ చెప్పామా??
మనుషులను సకల ప్రాణులను మొక్కలను‌ కని పెంచుతున్నది ఈ భూగోళమే కద! అంటే మన ఊరే కద?
ఆ మాత్రం చాలు కద!? ఊరికి కూడా రుణపడి ఉన్నామని గుర్తించడానికి!?
బాగా సంపాదించిన వారు ఊరి రుణం తప్పనిసరిగా తీర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఊరికి నాలుగు వైపులా ఉన్న రహదారులకు రెండు పక్కలా మొక్కలు నాటి పెంచి వృక్షాలుగా అభివృద్ధి చెయ్యాలి.
గ్రామంలో వృద్దులను‌ పండగలకు పబ్బాలకు సన్మానించాలి!
ఎవరూ దిక్కు లేని పేదలకు నీడ కల్పించాలి.పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చెయ్యాలి. గ్రామ పాఠశాల నిర్మాణ నిర్వహణలో భాగస్వాములు కావాలి!
ఊరు ఉమ్మడి అవసరాలను తీర్చడానికి ప్రయత్నాలు చెయ్యాలి. అలా కొందరు చేస్తున్నారు కూడా!
మనిషిగా ఓ గ్రామంలోనో ఓ పట్టణంలోనో పుట్టి పెరిగినందుకు మనం ఆ గ్రామానికో పట్టణానికో రుణపడి ఉంటాం!దాన్ని గుర్తిస్తూ తీర్చుకునే ప్రయత్నాలు చెయ్యాలి!
పేదలైనా సరే, ఇంటి ముందు ఓ మొక్కను నాటి వృక్షంగా పెంచినా చాలు! ఊరి రుణం తీరుతుంది!
నా మటుకు నేను పుట్టి పెరిగిన మా ఊరు' వెల్లంపల్లి కథ' రాసాను.కథ వంటి చరిత్ర అది! తరతరాలుగా ఊరి గురించి ఎవరూ ఏదీ రాత పూర్వకంగా రికార్డు చెయ్యలేదు!
ఊరు ఎప్పుడు పుట్టి ఉంటుంది? దాని వందల వేల సంవత్సరాల జీవితంలో ఏమేమి జరిగి ఉండవచ్చు? మా పూర్వులు పుట్టి పెరిగి బ్రతికి తనువులు చాలించి తిరిగి ఇదే ఈ ఊరి మట్టిలో కలిసారు! అటువంటి ఊరుకు ఓ కథ ఉంటుంది! అది మహా గాథ అయి ఉంటుంది! ఎందరెందరి కథలో  మా ఊరి కథలో కలిసి ఉంటాయి! 
మీరు చదువుకున్న వారు అయితే, మీ ఊరు కథో కథ వంటి చరిత్రో రాసి పుస్తకంగా ప్రచురించి , ఊరిలో ఆవిష్కరణ చెయ్యవచ్చు! అటువంటి కృషి తరతరాలకూ నిలుస్తుంది. ప్రతీ తరానికి అందుతుంది. తరువాత తరాల వారు ఆ కథను కంటిన్యూ చేస్తారు! మీరు చేసిన కృషికి అనుబంధంగా ఇక అది ప్రతీ తరంలో సాగుతుంది!
ముందుగా మనం ఊరికి రుణపడి ఉన్నామని గుర్తించాలి.
తరువాత ఎవరికి తోచిన విధంగా వారు తీర్చుకునే ప్రయత్నం చెయ్యొచ్చు!
ఇప్పుడంతా రుణాల ఎగవేత కాలం కద?
మనం ఓ చిన్న ప్రయత్నం చేద్దాం!
ఊరికి నమస్కారం!