ఊరు ఎప్పుడు ప్రారంభం అయిందో ,అప్పటి నుండి ఇప్పటి వరకు ఊరి నుండి బయటకు ఎందరు వలస వెళ్లి ఉంటారు? బయటి నుండి ఊరికి ఎందరు వలస వచ్చి ఉంటారు? వందల సంవత్సరాల, లేదా వేల సంవత్సరాల ఊరి చరిత్రలో ఇక్కడికి వచ్చిన వారు ఎందరు? ఇక్కడి నుండి బయటకు వెళ్లిన వారు ఎందరు? ఎందుకని ఈ ఊరు నుండి కొందరు బయటకు వెళ్లారు? ఎందుకని మరికొందరు ఈ ఊరికి వచ్చి స్థిరపడ్డారు?మా గ్రామ నిర్మాణం ప్రకారం-గ్రామ చరిత్ర ప్రకారం- గ్రామ కథ ప్రకారం మా వంశస్థులు ఇక్కడ మొదటివారు!మరో రెండు వంశాల వారు మాత్రమే రెడ్లలో మొదటివారు!ఇప్పుడు కనిపిస్తున్న మరికొన్ని రెడ్డి వంశాల వారు మా వంశాల వారిళ్లలోకి ఇల్లరికాలు వచ్చిన వారే! మరికొందరు బ్రతుకుతెరువు వెదుక్కుంటూ వచ్చిన వారు!మా గ్రామం నుండి కొందరు ఒకప్పుడు , మరింత తూర్పు వైపుకు ,అడవి పల్లెల వైపు ,ఓ ఎనబై వందా కిలోమీటర్ల లోపు వలస వెళ్లారు!ఆ కుటుంబాలు ఇక్కడ పెరిగి,వ్యవసాయ భూమి తరిగి,ఉన్న భూమిని కాస్తా ఎక్కువ ధరకు అమ్ముకుని, అడవుల వైపు ఉచితంగా పొందడానికి, లేదా ఇక్కడికంటే అక్కడ చౌకగా లభిస్తాయి కనుక, వ్యవసాయదార్ల వలసలు సాగాయి! మరికొందరు కష్టపడి పనిచేసే స్వభావం లేక కూడా ఉన్న ఆస్తులను అమ్ముకుని, ఇక అదే గ్రామంలో ఉండలేక కూడా వలసలు వెళ్లారు!ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు కింది గ్రామాలలో ఇప్పుడు వినపడే రెడ్డి వంశాలు వరంగల్ చుట్టుపక్కల గ్రామాల వారే!అలాగే గ్రామంలో కొందరు మాదిగల ఇంటిపేర్లను పరిశీలన చేస్తే ,అందులో ఎక్కువ పేర్లు మరెక్కడో ఉన్న గ్రామ నామాలు! అంటే ఆయా కుటుంబాలు ఆయా గ్రామాల నుండి ఇక్కడికి వలస వచ్చారని,ఆ కారణంగా వారిని వారు వలస వచ్చిన గ్రామాల పేరు మీదుగా పిలిచారు!పాత సమాజంలో- అంటే , కులవృత్తుల సమాజంలో కూడా అనాదిగా వలసలు సాగాయి! ఒక కులవృత్తి వారు ఒక గ్రామంలో ఎక్కువ మంది అవడం, అక్కడ పని లేకపోవడం,మరెక్కడో అడవి అంచున రూపొందే కొత్త గ్రామాలకు వారి సేవలు అవసరం ఉండటం వగైరా కారణాలతో ,అప్పటి వలసలు సాగాయి!వలసలతో పాటు ,వంశనామాలు కూడా మారేవి!రాత కోతలు అందుబాటులోకి రాక ముందు ,వలసల కారణంగా వంశ నామాలు మారేవి! కేవలం గోత్రనామాలు మాత్రమే కొనసాగాయి!ఎక్కడో యూరోప్ లో 1830 సుమారు ప్రారంభం అయిన పారిశ్రామిక విప్లవం దాని పరిణామాలు,మన వైపు క్రమంగా వస్తున్నాకొద్దీ,గ్రామాల నుండి పారిశ్రామిక ప్రాంతాలకు వలసలు వేగం అయ్యాయి! మునుపు వ్యవసాయం దాని అనుబంధ కులవృత్తులు మాత్రమే మనుషులకు బ్రతుకుతెరువులు! పారిశ్రామిక విప్లవం తరువాత కులవృత్తులు క్రమంగా పనికి రాకుండా అయి ,చదువులు ఆధునిక ఉపాధులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి!ఇదంతా దేశ స్వాతంత్ర్యానికి ముందు, ఇక్కడ నిజాం నవాబు పరిపాలన కాలాని కంటే ముందు ,బహుశా కాకతీయ సామ్రాజ్యపు(1327 కు ముందు)విస్తరణతో అడవి పల్లెల మధ్య వాగులు వంకల మీద గొలుసు కట్టు చెరువులు నిర్మించడం ,వాటి పక్కన శివాలయాలు నిర్మించిఅప్పటికే ఉన్న చిన్న చిన్న అడవి పల్లెలను కులవృత్తుల వ్యవసాయ గ్రామాలుగా అభివృద్ధి చెయ్యడం ,లేదా కొత్త గ్రామాల ఏర్పాటు వలన కూడా కొత్తగా వలసలకు అవకాశాలు ఏర్పడ్డాయి! వలసలు ఎక్కువ జరిగాయి! ఇప్పటి వరంగల్ చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని వంశ నామాలు ,దానికి దూరంగా ఓ వంద కిలోమీటర్ల రేడియస్ లో కూడా తిరిగి కనపడతాయి. రాజధాని చుట్టూ బ్రతుకుతెరువు ఇరుగ్గా మారడం ముఖ్యకారణం!అప్పటికి వలస వెళ్ళిన కుటుంబాల గురించి అప్పుడప్పుడు పెద్దవారు చెప్పగా వినడమే కానీ సదరు వ్యక్తులు ఎన్నడూ తిరిగి మా గ్రామంలో కనపడలేదు! రాకపోకలు సాగలేదు! అప్పుడు కమ్యూనికేషన్ ట్రాన్స్‌పోర్ట్ ఇప్పటిలా లేదు! కాలి నడక - నోటి మాట !కనుక సంబంధాలు తెగిపోయాయి!ఆ మధ్య నా పేస్ బుక్ అకౌంటులోకి మా ఇంటిపేరు కలిగిన ఓ మనిషి వచ్చి చేరాడు! అతన్ని విచారిస్తే ,ఒకానొకప్పుడు మా గ్రామం నుండి తూర్పు అడవుల వైపు వలస వెళ్లిన వారే అని తేలింది! గోత్రం కూడా ఒకటే!కొందరు ఉన్న ఊరిలో బ్రతకలేక వలస వెళితే, మరికొందరు మా ఊరికి వలస వచ్చి స్థిరపడ్డారు! విచిత్రమైన విషయం!ఇక్కడ బ్రతుకుతెరువు లేదనుకుని కొందరు మరెక్కడికో వెళితే, మరెక్కడో బ్రతుకుతెరువు లేదనుకుని కొందరు ఇక్కడికి వచ్చారు!ఒకప్పుడు బ్రతుకుతెరువులకు చాయిస్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ!కాలక్రమంలో వ్యవసాయ రంగ సంక్షోభం కారణంగా నేను కూడా బొగ్గుగనుల్లో ఉద్యోగం కోసం వెళ్లాను! అయితే నాకు కథారచన కూడా ఒక లక్ష్యం!వ్యవసాయానికి కాస్తా పెట్టుబడి సహాయం చెయ్యొచ్చు, అలాగే నా ఇష్టపూర్వక రచనా వ్యాసంగాన్ని సాగించవచ్చు అని , నేను బొగ్గుగనుల్లో ఉద్యోగం కోసం వెళ్లాను!నేను అలా వలస వెళ్లకుండా ఇదే గ్రామంలో ఉంటే, ఇప్పుడు నేను ఉన్నట్టు ఉండేవాడినా? ఆర్ధిక సామాజిక చైతన్యాల విషయంలో అంటే? కాదనే చెప్పాలి!నేను వలస వెళ్లడం వల్ల నా స్థితులు మెరుగయ్యాయి!వలసలు వెళ్లి బాగుపడ్డ వారు ఉన్నట్టుగానే, చెడిపోయిన వారు కూడా ఉన్నారు! మనుషులు బాగు పడటానికి చెడిపోవడానికి,వ్యక్తుల కర్మలు ఎంత కారణమో,వ్యవస్థ కూడా అంతే కారణం!వలసలకు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి కానీ,బాగుపడటమో చెడిపోవడమో మన చేతిలోనే ఉంటాయి!అయితే, వలసలు అవసరమే కానీ, వలసవాదం ప్రమాదకరం!
గుడ్మార్నింగ్ -(156 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి