గుడ్మార్నింగ్ (158 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 మాటకు చేతకు పొంతన లేని మనుషులను నిత్యం ఎందరినో చూస్తూ ఉంటాం! ఇలా పొంతన లేని జీవితాలను గడిపేవారు అన్ని రకాల మనుషుల్లోనూ గమనించవచ్చు!
ఇక్కడ మాత్రం ఏ వర్గ విభేదాలు లేవు! నటనలో సమానత్వాన్ని సాధించారు!
ఎక్కడికక్కడ అనువైన మాటలు మాట్లాడుతూ, ఎక్కడికక్కడ తప్పించుకు తిరగటం చాలా మంది నైజం!
మాటకు చేతకు పొంతన లేని మనుషులు ,మనకు అడుగడుగునా కనిపిస్తారు! ద్వంద్వ ప్రవర్తన వల్ల వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు!
అయినా, ఉదయం నుండి సాయంత్రం వరకు మళ్ళీ అలాగే ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు!
అటువంటి ఓ నలుగురు వారికి శృతి కూడా పడుతూ ఉంటారు!
కుటుంబాలలో కూడా తగినంత నటన రక్తికడుతూ ఉంటుంది! భార్యాభర్తల నటన- తల్లిదండ్రులు పిల్లల మధ్య నటన- స్కూల్ వ్యాపార వాణిజ్య రంగాల వారి మధ్య నటన! అధికారులు శ్రామికుల మధ్య నటన- ఇలా చెప్పుకుంటూ పోతే నటన లేని మానవ జీవితం లేకుండా అయింది!
'నోటి మాటకు కట్టుబడి ఉన్న' ఒకానొక కాలం ఒకటి ఉండేదని ఇప్పుడు ఎవరికీ జ్ఞాపకం కూడా లేదు!
ఆధునిక జీవితం సాంతం నటనతో నిండింది!
తినేవీ కట్టేవీ కృత్రిమమే- వాటిలాగే మాటకు చేతకు పొంతన లేని జీవితాలు అవుతున్నాయి!
'మిమ్మల్ని కలవాలని అనుకుంటూ ఉన్నాను కానీ ఎప్పుడూ కుదరలేదు- ఇప్పుడు అనుకోకుండా కలిసారు' అని గొప్పగా నటిస్తూ, సెల్ ఫోన్ లో మరెవరితోనో మాటల్లో పడతారు! నిజంగానే అనుకుంటే కలవడానికి ఎంత సేపు?
మనం సంస్కరించిన మనుషులు - మనం అవకాశాలు ఇచ్చిన మనుషులు ,మరొకరి గురించి ప్రశంసలను కురిపిస్తూ ఉంటారు- వారు వీరిని పొగుడుతూ ఉంటారు!
వీరి సంగతి ఇలా ఉంటే,వీరి తోడళ్లుల్ల తోడికోడళ్ల వంటి వారి సంగతి మరోలా ఉంటుంది!
'అంతా మీ నుండి నేర్చుకున్నాం' అని రహస్యంగా చెప్తూ ,బహిరంగంగా మాత్రం అదంతా తమ గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు! నిత్యజీవితంలో ఎందరో నటులు! నటులకే నటన నేర్పగల సమర్ధులు!
నటనను మించిన దుఃఖ హేతువు లేదు!
లోపల పదవీ కాంక్షా ఉద్దేశాన్ని దాచుకుని, పైకి ప్రజాసేవ అంటుంటారు! చేసే ప్రభుత్వ ఉద్యోగం సరిగా చెయ్యరు కానీ, మరేవో గొప్ప పనులు అనుకుని అవి చెయ్యాలని‌ తిరుగుతారు! తినేది ప్రజల సొమ్ము , పాడేది సొంత పాట!
ఓ మాట అంటారు- దానికి కట్టుబడి ఉండరు!
ఓ వాగ్దానం చేస్తారు, దాన్ని పాటించరు!!
మాట్లాడిన దానికి విరుద్ధంగా- రాసిన దానికి విరుద్ధంగా
బ్రతుకులను ఈడుస్తూ ఉంటారు!
ఇటువంటి తప్పించుకునే ధోరణి కవులలో ఎక్కువ ఉంటుంది! బోలెడు విప్లవ కవిత్వం రాస్తారు- మామూలు సంసార జీవితం గడుపుతూ ,చక్కగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ,అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇంగ్లండ్ వగైరా దేశాలకు దారులు చూపిస్తూ, ఇక్కడ మంది పిల్లలకు విప్లవం గురించి దాన్ని సాధించడానికి సాయుధ పోరాటం చెయ్యాలని ప్రేరేపిస్తూ కవిత్వం పాటలు కథలు నవలలు వండి వారుస్తారు!
మళ్ళీ వారే 'కవిత్వానికి ,కవి జీవితానికి సంబంధం అవసరం లేదు' అని తప్పుడు సూత్రీకరణలు చేస్తూ- యధావిధిగా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు! వీరి మాటలు నమ్మి ఎందరో అడవుల పాలై - బూటకపు ఎన్ కౌంటర్ల పాలై పోలీసుల చేత చంప బడ్డారు! 
కాలిన కన్నతల్లుల కడుపు దుఃఖం ఎవరికి పట్టింది!
ఇక రాజకీయ నాయకుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది!
మాట్లాడుతుంటే బెల్లాలు కారుతూ ఉంటాయి, ప్రవర్తనలో విషం ఉంటుంది! ప్రజలకు బోలెడు మాయ మాటలు చెప్తారు, అధికారాన్ని సంపాదిస్తారు, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తారు- వంశపారంపర్య పాలన ప్రజల మీద రుద్దుతారు!
పాలకులకు తీసిపోకుండా ఓటర్లు కూడా పోటాపోటీగా నటిస్తూ ఉంటారు!
ఇలా చెప్పుకుంటూ పోతే, నటన లేని జీవితం లేదు!
నటులు కాని మనుషులు లేరు!సినిమాలు టీవీ సీరియళ్ళ విజయ రహస్యం కూడా అదే! మనుషుల్లో నటన ఉంటుంది!
మన జీవితంలో ఎంత నటన ఉంటే, మనకు అంత అసంతృప్తి ఉంటుంది! మనం ఎంత ద్వంద్వ జీవనాన్ని గడిపితే,మనకు అన్ని చేదు ఫలితాలు వస్తాయి!నటనను మించిన అనారోగ్య హేతువు లేదు!
ఆలోచనకు మాటకు ఆచరణకు సమన్వయం సాధించుకున్న వారు,పరమ ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తారు! వారి వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది!లాంగ్ టర్మ్ లో వారినే విశ్వసిస్తారు! 
ఆలోచన ఎలా ఉంటే ,అలా మాట్లాడు- ఎలా మాట్లాడితే,అలాగే ప్రవర్తించు!చేత కాకపోతే కానట్టే మాట్లాడు! బస్! అదే మంచిది!
ఎలా ఉండాలనిపిస్తే,అలాగే ఉండు! నటన వద్దు! చెడతావు!
ప్రవర్తనే అసలైన జీవితం!అది ఎప్పటికప్పుడు మన గురించి నిజమే చెపుతూ ఉంటుంది!
ఆలోచన మాట చేత,ఒకలాగే ఉంచుకోవాలి!
ఆ మూడింట మధ్య సమన్వయ సాధన సాగించాలి!
అదే అసలైన సక్సెస్ మంత్ర!