ఏకాదశీ మహాత్మ్యము :
*సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.*
పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమునందున్న యగ్రహారంలో నివశించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందియున్నారు.
అతడు చిన్నతనం నుండీ గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండ బోవునపుడిట్లు ఆలోచించెను.
అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనం, శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినాను గదాయని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయెను.
అన్ని రోజులు ఒకేవిధముగా వుండవు గదా! ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనం, బంగారం, ఎత్తుకొని పోయిరి.
అనంతుడు నిద్రనుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోయినాడు. “నారాయణ” అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను.” అని వశిష్ఠుడు తెలియజేసెను.
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి