గుడ్మార్నింగ్ (161 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'ఫలం-విఫలం 'అనే రెండు పదాల మధ్య మరో పదం ఉంటుంది! దాన్ని 'సాధన' అంటారు! సాధన చెయ్యకపోతే విఫలం అవుతారు! సాధన ఉంటే ఫలితం ఉంటుంది!
చిన్నచిన్న విషయాల నుండి మొదలుకొని ,పెద్దపెద్ద విషయాల వరకు కూడా వర్తించే సూత్రం , ఈ చిన్న పదమే!
సాధన అనే మూడు అక్షరాల పదం ,అత్యంత ప్రాముఖ్యత కలిగిన పదం! లేదా జీవనసూత్రం కూడా!మానవజీవితం సజావుగా సాగడానికి నిత్య సాధన అవసరం! అది లేకపోతే ఏదీ అవదు!
సక్సెస్ - ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు అందరికీ అర్థం అవుతాయి! ఆ రెండు వర్డ్స్ మధ్య 'ట్రై ' అనే మరో పదం ఉంటుంది! ట్రై చెయ్యకపోతే ఏ చిన్న పనీ అవదు!
కొందరు చెయ్యాలని ఫీలౌతారు కానీ, చెయ్యరు! అది ఏదైనా కానివ్వండి! చెయ్యాలనుకుంటే,అందుకు సాధన చెయ్యాలి! ప్రయత్నం చెయ్యాలి! ట్రై చెయ్యాలి!
పరీక్షల కోసం చదవాలి అనుకుంటూ, చదవలేకపోవడమే ఫెయిల్యూర్! 
శరీరం లావెక్కుతోందని ఉదయాన్నే వాకింగ్ చెయ్యాలనుకుంటూ,వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడమే ఫెయిల్యూర్!
నిత్యజీవితంలో మనిషి చెయ్యవలసి వచ్చే, చెయ్యగల ,చేసి తీరవలసిన పనులు కొన్ని ఉంటాయి!
వాటిని వాయిదా వెయ్యడానికి కుదరదు! వేసారో ,మనలో మానసిక వ్యాధి ప్రారంభం అవుతుంది! అశ్రద్ద నిర్లక్ష్యం జడత్వం ఇనెర్షియా పట్టించుకోకపోవడం తప్పించుకోవడం
ఇవన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని దిగజారుస్తాయి! మానసిక అనారోగ్యం ఊరికే ఉండదు,అది దాని పని అది చేస్తుంది! ఏమిటి అంటారా? క్రమంగా మన శారీరక ఆరోగ్యం చెడుతుంది! అప్పుడు డాక్టర్లు మందులు పత్యాలు- ఇంకేం ఉంటుంది! దేకుతూ బ్రతకాలి! అనారోగ్య జీవితాన్ని ఈడుస్తూ నడపాలి!
ఇనుప పరికరాన్ని అలా ఊరికే పడెయ్యండి.క్రమంగా తుప్పు పడుతుంది! అది ఉక్కు అయినా సరే ,క్రమంగా తుప్పు పట్టి మట్టిలో కలుస్తుంది! అదే పరికరం వాడకంలో ఉంటే అనేక సంవత్సరాల పాటు మనగలుగుతుంది!
లోహమైనా దేహమైనా,యాక్టివిటీ ఉన్నంత వరకే ఆరోగ్యంగా ఉంటాయి! యాక్టివిటీ అంటే కూడా మనం ఇక్కడ'సాధన' అని అనుకోవచ్చు!
జీవితం అనేది నిత్య సాధనతో ముడిపడి ఉంది!
ఉదయాన్నే నిద్ర లేవాలనుకుని,ముసుగు తన్నేవారు ఎందరో ఉన్నారు! కానీ కొందరు ఉంటారు, నిద్ర మేల్కొనే విషయంలో ఏ తటపటాయింపులు ఉండవు! లేవాలనుకున్న క్షణం లేస్తారు- చెయ్యవలసిన పనులు చేస్తారు- అది ఫలానా పని అని కాదు,ఏదైనా సరే- నిద్ర నుండి ఠంచనుగా లేవడం కూడా ఓ నిత్య సాధనే!
ఒకరోజు అశ్రద్ద నిర్లక్ష్యం చేసారో,మరునాడు కూడా అలాగే ఉంటుంది- ఒకరోజు ఉద్యోగానికి వెళ్లని వారికి ,మరునాడు కూడా వెళ్ల బుద్ది కాదు!
మన నిత్యజీవితంలో మనం ఎన్ని చెయ్యవలసి ఉంటుందో, వాటన్నిటినీ నిత్యం చెయ్యవలసి ఉంటుంది!
'రెండవ' ఆలోచన ఉందో, సాధన కుంటుపడుతుంది!
సాధన కుంటుపడితే,జీవితం కుంటుతుంది!
మనం కలగన్నవాటిని,మనమే సాధించాలి!
'సాధనమున పనులు సమకూరు ధరలోన' అని వేమన కవి చెప్పింది ఇందుకే!
'సాధన చేయుమురా నరుడా,సాధ్యం కానిది లేదురా' అని ఓ సినిమా కవి అన్నదీ ఇందుకే!
సాధనను విడిస్తే,జీవితాన్ని విడిచినట్టు!