గుడ్మార్నింగ్ --(175 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 మనం ఏదైనా సాధించాలి అంటే, అందుకు అవసరమైన కొన్నింటిని క్రమంగా సాధించాలి!
చదువులు పరీక్షలు ఉద్యోగాలు వ్యాపారాలు గేమ్స్ కళలు పాలిటిక్స్ వ్యవసాయం పరిశ్రమలు వంటి సమస్త జీవన రంగాలలో దేంట్లోనో ఒకదాంట్లో మనిషి స్థిరపడాలి అంటే,సజావుగా బ్రతకడానికి అవసరమైన మేరకు డబ్బును సంపాదించాలి అంటే, అందుకు కొన్ని అవసరం అవుతాయి! అందులో ముఖ్యమైనది'సమయం'- 'టైమ్'
అత్యంత విలువైన వాటిల్లో ,సమయం ముఖ్యమైనది!
సాధకులకు ,సమయం ముఖ్యమైన సాధనం!
సమయాన్ని సాధిస్తే,లక్ష్యాన్ని సాధించవచ్చు!
ఈ ఉదయం ఇదంతా ఎందుకు అంటారా?
సూర్యోదయం అయి ,పొద్దు బారెడు ఎక్కింది!
ఇప్పటికీ నిద్ర లేవని వారు,కోట్లాది మంది ఉంటారు!
ముఖ్యంగా పట్టణాలలో ఉండేవారిలో, సూర్యోదయం కంటే ముందు నిద్రలేచేవారు ఎందరు? అఫ్ కోర్స్ , ఇప్పుడు పల్లెల్లో కూడా ,పొద్దు పొడిచిన తరువాత నిద్ర లేచేవారు ఎక్కువ అవుతున్నారు!
ఏమయ్యా? ఏమమ్మా? ఎందుకని మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం లేదూ అంటే , తగిన సమయం దొరకడం లేదని వాపోని వారు ఎందరో ఉన్నారు!
ఆలస్యంగా నిద్ర లేస్తారు,హడావుడిగా తయారు అవుతారు, స్కూల్ కాలేజ్ ఆఫీసు షాప్ వంటి పని ప్రదేశాలకు పరుగులు పెడతారు! ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాల కారణాలలో, తొందరగా వెళ్లాలనే మనస్తత్వాలు ఓ ముఖ్యమైన కారణం! నేను గోదావరిఖనిలో ఉద్యోగం చేసిన సంవత్సరాలలో ,నా టూ వీలర్ ను ఓవర్ టేక్ చెయ్యని వాహనాన్ని నేను చూడలేదు! వందల వేల మంది కార్మికులు ఎంతో వేగంగా హడావుడిగా గనుల వైపు పరుగులు పెట్టేవారు.నాలాంటి వారు చాలా తక్కువ మంది ఉండేవారు! ఆలస్యంగా నిద్రలేవడం- ఇన్ మస్టర్ వేస్తారో లేదో అని పరుగులు పెట్టడం! ఇంక గొల్లకొండ మహానగరపు ట్రాఫిక్ కల్చర్ గురించి చెప్పనక్కరలేదు!
ఓ గంట ముందు నిద్ర లేవవచ్చు! లేవరు!!
రోజులో మనకు ఉన్నదే ఇరవై నాలుగు గంటలు!
అందులో నిద్రకు నాలుగు నుండి ఆరు గంటలు చాలు!
చాలా మంది రోజుకు ఎన్ని గంటల పాటు నిద్రపోతున్నారో?
మనం సద్వినియోగం చేసుకోలేని సమయాన్ని, తిరిగి వినియోగం చేసుకోలేం! ఎవరమూ కూడా! 
టైమ్ అంటే అంత విలువైనది! అది గడిచిపోయింది అంటే, తిరిగి దొరకదు!
మనిషి ఎదిగే దశ ,చాలా ముఖ్యమైన దశ! 
అంటే సమయం అనే అర్థం! చదివే సమయంలో లేవరు! లేచే సరికి సమయం ఉండదు! సాధించేవారు, ముందు సమయాన్ని సాధించాలి! సూర్యోదయం కంటే ముందు లేచి చూడండి, ఆ రోజు మీ చేతుల్లో ఉంటుంది!
ప్రతీ మనిషిలో అంతర్గతంగా చాలా శక్తి ఉంటుంది!
శక్తిని సద్వినియోగం చేసుకోవాలి అంటే, అందుకు తగిన సమయం కూడా కావాలి! ఉన్నదే ఇరవై నాలుగు గంటల సమయం! అందులో నిద్రకు ఎంత సమయం కావాలో అంతే వాడాలి.మీరు ,మీ నిద్ర మీద అదుపు సాధిస్తే,మీరు మీ జీవితం మీద అదుపు సాధిస్తారు!
జీవితం మన చేతుల్లో ఉండాలంటే, సమయం మన చేతుల్లో ఉండాలి! 
వైద్య వృత్తిలో రెండు చేతులా సర్జరీలు‌ చేస్తూ ,అవే రెండు చేతులా సీరియల్ నవలలు రాసే ఓ ప్రసిద్ధి చెందిన తెలుగు డాక్టర్ + నవలా రచయితను ఒకప్పుడు ఎవరో అడిగారట!
'మీరు అంత బిజీ డాక్టర్ కద? ఇన్ని నవలలు రాయడానికి మీకు సమయం ఎక్కడిదీ?" అని!
అప్పుడు ఆ డాక్టర్ కమ్ రైటర్ గారు ఇలా అన్నారట!
" రాయాలని అనుకున్నాను కనుక, సమయం కేటాయించుకుని రాస్తున్నాను " అన్నారట! 
అంత బిజీ సర్జన్ కు రాయడానికి అంత సమయం ఎక్కడిదీ అంటే?
సమయ పాలన అనే ఓ అత్యంత విలువైన మేనేజ్మెంట్ లక్షణాన్ని ఆయన తనలో నెలకొల్పుకున్నాడు!
'టైమ్ మేనేజ్మెంట్' అంటే ఇప్పటి తరానికి అర్థం అవుతుంది!
సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చూడండి , కాలకృత్యాలు తీర్చుకుని ,స్నానం చేసి చూడండి,మీ శరీరం ఎంత చురుకుగా ఉంటుందో గమనించండి! శరీరం చురుకుగా ఉంటే,మెదడు చురుకుగా ఉంటుంది!
ఇక రోజంతా ,మీచేతిలో ఎంతో సమయం ఉంటుంది !
నిద్ర విషయంలో మన సినిమా కవి కూడా ఓ పాట రాసాడు! " మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా!" అని!
కనుక- మీరు దేన్ని సాధించాలన్నా,ముందు సమయాన్ని సాధించాలి! అంటే సమయాన్ని వృధా చెయ్యకూడదు!