గుడ్మార్నింగ్ (178 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'నేను' అనే భావన ఉన్నవారిలో, 'నాది' అనే భావన కూడా ఉంటుంది! అవి ఉన్నవారిలో 'మనం' 'మనది' అనే భావాలు ఉండవు! !ఉండక పోగా ,అటువంటి భావాలు ఉన్నవారిని సహించరు కూడా!
'నేను' అనే భావన దాని కదే చెడ్డది కాదు కానీ, 'నేనే' అనే భావన మాత్రం ప్రమాదకరమైన భావన!
'నేను' అనే భావన పుట్టగానే ' నాది' అనే భావన పుడుతుంది! నేను నాది అనేవి కవల పిల్లల వంటివి!
'నేను' అనే భావానికి- 'నేనే' అనుకునే భావానికి మధ్య సన్నని సరిహద్దు ఉంటుంది! ఆ సరిహద్దును నిరంతరం గుర్తిస్తూ 'నేనే - నాదే' అనుకునే పరమ దుర్మార్గపు భావాలను మన నుండి తొలగించుకోవలసి ఉంటుంది!
ఎందుకంటే?
'నేను' అనుకునే మనిషి విడిగా -  స్వయంభువుగా ఈ భూమ్మీద వెలవలేదు! వచ్చేటప్పుడు ఏదీ పట్టుకుని రాలేదు! తల్లిదండ్రులు తోబుట్టువులు కనీసం ఉంటారు- భార్యా భర్త పిల్లలు ఉంటారు! 
వ్యవసాయం వృత్తులు ఉద్యోగం వ్యాపారం వాణిజ్యం వగైరా అనేక జీవన వ్యాపారాల వల్ల కలిగే ఎన్నో మానవ సంబంధాలు ఉంటాయి! నిత్యం ఎందరితోనో సంబంధ బాంధవ్యాలు నెరప వలసి ఉంటుంది! 
నిజానికి మన బ్రతుకుల్లో మన ప్రమేయం చాలా తక్కువ!
కానీ, కొందరు కేవలం తమ ప్రమేయం లేకుండా ఏదీ జరగడానికి వీలు లేదు అనుకుంటారు! ఎవరినీ సహించరు! ఇంటి నుంచి బయట వరకు, నిత్యం తాము మెదల వలసి వచ్చే ఎందరి మీదనో తమ భావాలను రుద్దడానికి ప్రయత్నాలు చేస్తుంటారు! నిరాకరించబడతారు!
'ఈ ఇల్లు నాది- ఈ ఇంట్లో మరొకరు ఉండటానికి వీలు లేదు' అనకునే వారు ఎందరు లేరు?
మనతో పాటే కొందరు ఉండే హక్కు ఉన్నవారిని‌ అయినా సరే, వారు ఉండటానికి వీలు లేదు అనుకుని- వెళ్లగొట్టే మనుషులు ఎందరు లేరు?
ఏ ఇల్లూ, ఎవరూ ,ఒక్కరే నిర్మాణం చెయ్యరు.నీ జీతం నాతం సమస్తం సమాజాపు ఉమ్మడి రెక్కల కష్టం- ఏవో కొన్ని కారణాల వల్ల నీకు‌ అధికంగా ముట్టవచ్చు- అంత మాత్రాన అదంతా నీ ప్రతిభ కాదు! నీ పట్టం కాదు!!
'నీది' కాదు! నిజానికి నీది ఏదీ కాదు! కొంచెం వాడుకోవచ్చు! అంతే!! అంతకంటే నీది ఏదీ లేదు -కాదు!
ఎవరూ'రాగా' ఏమీ తేలేదు!
పారిశ్రామిక విప్లవం తదనంతరం, సమాజంలో కొన్ని వర్గాల వారికి అధికంగా సంపద వచ్చి పడటం- లీజర్ ఎక్కువ దొరకడం- స్వేచ్ఛ పేరుతో మరొకరిని సహించలేక పోవడం- ఇవాళ ఆధునిక గృహాలలో రెండు తరాల వారు - కనీసం- ఎందుకు కలిసి ఉండటం లేదు? ఎవరికి వారు ఎందుకు విడివిడిగా ఉంటున్నారు? వృద్దుల దయనీయమైన పరిస్థితులకు మనలో ఉన్న ఈ సరికొత్త స్వేచ్ఛా భావనలు కారణం కావా? 
చాలా మందికి 'స్వేచ్ఛ - స్వాతంత్ర్యాలు' అనే రెండు పదాలకు సరైన అర్థం తెలియదు! 
స్వేచ్ఛ అంటే? అందులో మరొకరు ఉండరు! భర్త భార్యా పిల్లలు అత్తమామలు వగైరా ఎవరికీ స్ధానం ఉండదు! కనీసం ఎన్నికలలో బయటకు వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకోరు! మనకు స్వేచ్ఛ గురించి ప్రచారం చేసే సమూహాలు కూడా తయారు అయ్యాయి! 
స్వాతంత్ర్యం అంటే ? నలుగురితో కలిసి ఉండటం! నిజానికి జీవితం నలుగురితో కలిసి మెలిసి ఉండవచ్చేది!
వ్యక్తి స్వేచ్ఛ సిద్దాంతాలను ప్రచారం చేసేవారు, వ్యక్తి బాధ్యతల గురించి ఒక్క మాటా మాట్లాడరు!
మనిషి ఒకరే మనలేరు- మంది అవసరం ఉంటుంది!
కుటుంబం నుండి బయట వరకు ఎందరితోనో మన బ్రతుకు ముడిపడి ఉంటుంది! 'నేను' కు స్ధానం లేదు!
స్వేచ్ఛ అనే ఓ ఆదర్శాన్ని విపరీతంగా ప్రచారం చేసిన ఓ తెలుగు నవలా రచయిత చివరికి ఓ ఆధ్యాత్మిక స్వామి పాదాల చెంత తేలడం మనకు ఓ ప్రముఖ ఉదాహరణగా ఉంది! అయినా, మనం స్వేచ్ఛ గురించి పలవరిస్తూ కవిత్వం కథలు నవలలు సినిమాలు వండి వార్చుతూనే ఉంటాం! పారిశ్రామిక విప్లవం అనంతర అభివృద్ధి చెందిన కొందరు మధ్యతరగతి మేధావుల విపరీత మానసిక ధోరణికి‌ పరాకాష్ఠ 'స్వేచ్ఛా వాదం' దాని పర్యవసానాలు చిట్టచివరకు కానీ అనుభవంలోకి రావు! అప్పుడు చెప్పుకోవడానికి కూడా మనుషులు మిగలరు!
'నేను' అనే భావన యొక్క ప్రమాదకరమైన చివర ' స్వేచ్ఛ'
'మనం' అనుకునే భావన యొక్క చివర 'స్వాతంత్ర్యం'
ఈ రెండింటిని గుర్తెరిగి వ్యవహరించడం నేర్చుకోవాలి!
స్వేచ్ఛ వేరు- స్వాతంత్ర్యం వేరు! 
స్వేచ్ఛ ఓ ఎండమావి- స్వాతంత్ర్యం ఓ నీటి వనరు!
స్వేచ్ఛ ప్రమాదకరమైన తీరానికి చేరిస్తే,
స్వాతంత్ర్యం సౌకర్యవంతమైన తీరానికి చేరుస్తుంది!
స్వేచ్ఛ గురించి మాట్లాడే వారంటే నాకు అనుమానం , స్వాతంత్ర్యం గురించి మాట్లాడే వారంటే నాకు గౌరవం!