ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము :
పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.
ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.
ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను.
ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను.
బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములకు గురి చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు" మని దేవేంద్రుడు ప్రార్థించెను.
బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.
తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి.
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది. అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు.
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి