తెలుగు ఒడిలో...3: --మన భాష తెలుగు -తెలుసుకుంటే వెలుగు:-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

సంపంగి
ఎక్కువ పరిమళము లేదా గంధము గల పూలలో అతి గంధము అని పిలువబడే పూవొకటుంది. అదే సంపెంగ – సంపంగి – సంపంగె అనే పూవు. ఇది పచ్చగా  పసిడి వర్ణంలో  ఉంటుంది.  కనుక దీనిని "హేమపుష్పము "అని అంటారు. ఇంకా, దీప పుష్పము, చాంపేయము, స్థిరగంధము, స్థిరపుష్పము, కాంచనము మొదలైన ఎన్నో పేర్లతో పిలువబడే సోకైన పూవు సంపంగి పూవు. ఎంతో మత్తును కలిగించే ఘాటైన వాసన కల పూవు ఇది. సంపంగి పూల దండను కకుభము అని అంటారు. 
ఆకు సంపెంగ, రేకు సంపెంగ, తీగ సంపెంగ అంటూ సంపెంగ పూవులు రకరకాలుగా ఉన్నాయి. అలాగే ఈ పూలు ఎక్కడబడితే అక్కడ విరివిగా కనబడవు. తిరుపతి, సింహాచలము మొదలైన చోట్ల ఎక్కువగా పెంచబడుతూ కనిపిస్తాయి. ఆహ్లాదాన్ని ఇచ్చే వాసన కోసం ఈ చెట్లను పూల తోటలలో కూడా అక్కడక్కడ పెంచుతారు. ఇళ్ళ పెరళ్ళలో వీటిని ఎక్కువగా పెంచరు. కారణం ఈ సంపంగి చెట్లు వున్న చోటుకు పాములు వస్తాయనటమే. 
ఈ సంపంగి పూలు పూజకు, స్త్రీల సింగారానికి పనికొస్తాయి. అంతేకాదు ఈ పువ్వు నుండి నూనెను తయారు చేస్తారు. అది నొప్పులకు ఔషధంగా పనికొస్తుంది. సంపంగి వేరు, బెరడు ఆకులు, విత్తనాలు అన్నీ నొప్పులకే కాకుండా క్రిమిసంహారానికి కూడా ఉపయోగపడతాయట. 
మీసాలకు సంపంగి నూనె – అనే సామెతను విన్నారా ఎపుడైనా...? ఇది కేవలం సామెత కోసం చెప్పింది కాదు. చాలామంది మగవారు తమ మీసాలకు సంపంగి నూనెను రాసుకొనేవారట. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.
“నానాసూన వితాన వాసనల నానందించు సారంగమేలా
నన్నొల్లదటంచు గంధఫలి పల్ కాకన్ తపంబొనరించి యో
ఫానాసాకృతిన్ దాల్చె” – అంటూ నందితిమ్మన  ముక్కుమీద పద్యం చెప్పి ముక్కు తిమ్మనగా ప్రసిద్ధి చెందాడు. పూపూవును చుట్టుకుని తిరిగి తుమ్మెదలు సంపెంగ పూల జోలికి రావట.
అందుకు బాధ పడిన సంపంగి తపస్సుచేసి స్త్రీ యొక్క ముక్కు రూపాన్ని ధరించిందని కవిచమత్కరించాడుఅంటే ముక్కును సంపంగి మొగ్గతో పోల్చాడు కవి. అంతేకాదు – 
సందెకాడ దివ్వె నువ్వు
సంపంగి  రేకే నువ్వు – అంటూ   ఇష్టమైన అమ్మాయి గురించి అనుకుంటారు కొందరు-
“తుమ్మెద గుంపు ఝమ్మని త్రుళ్ళుచు ప్రేలుచునుండు ధారుణీ
జమ్ములనేకముల్ కలవు జాజులు, మల్లెలు, మామిడుల్ లవంగమ్ములు కాని నీ కుసుమ కాంచన వర్ణము నాత్మగాత్రవ
ర్ణమ్మును పోల్చి సిగ్గగును రాజకుమార్తెల కెల్ల సంపంగీ”
(భావతరంగాలు – 247) అంటూ సంపంగి రంగు గురించి చమత్కరించారు కవి. 
సంపంగి రంగే కాదు వాసన అంతే గొప్ప కనుకనే అవి ఎండిన తరువాత కూడా వాటిని బట్టల్లో పెట్టుకుంటారు. (వాసనకోసం).
మన పౌరాణిక గాథలలో ఎంతో విలువైన పాత్ర మన్మథుడు. అతడు చెరకు గడను విల్లుగా ఉపయోగిస్తూ దానికి అయిదు రకాలైన వింటినారులను వాడతాడట. వాటిలో ఒకటైన కురువేరుదంట నారితో సంపంగి పూవును బాణంగా ప్రయోగించేవాడట.
చక్కని పద జ్ఞానం, విజ్ఞానం పొందటానికి
తెలుగు భాషను నేర్పండి.చదవండి