*సర్వం శివమయం*:- --.సోంపాక సీత--భద్రాచలం--8639311050
శివభావనలతో భక్తసంద్రమంతా
నటరాజులై నర్తిస్తుంటే
మహామృత్యుంజయ మంత్రం
నిర్భీకతను ప్రతిధ్వనిస్తూ డమరుకనాదమై మురిసిన హేల..

శక్తినిస్తూ,ముక్తినిస్తూ;
సంస్కారాన్నిస్తూ,సంస్కరణాభిలాషనిస్తూ;
మనుష్యులలోని ద్వంద్వాలను పారద్రోలే
శివనామం శివమెత్తిన లీల..

మంగళకరమైన భావనలు
ఎదలోపల పూజాకుసుమాలై
చతుర్విధ ముక్తులను ప్రసాదించగల ఆధ్యాత్మిక దోసిలి..

సమస్త సృష్టి పరస్పర పోషకమేనంటూ ,అర్థనారీశ్వర తత్వమే ఆదిమంత్రమై 
అజ్ఞానాంధకారాలను స్పర్శించిన అనంత హేల..

సమస్తం శివారాధనమై,
అంతా శివమయమై, 
సత్యం, శివం,సుందరమై,
మానవత్వం మహిపై వెలిగిన
ఉత్కృష్ట లీల..