ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం.871 2971 999
గదేమి ఇసిత్రమో గాని
ఎండాకాలంల అన్ని సెట్ల ఆకులు రాలి పోయి 
కొత్త కొత్త ఇగుర్లు అత్తే 
మోతుకు సెట్లు 
ఆకులతో నిగ నిగ లాడుతుంటయి.
జాజి రంగుల 
పూలు పూత్తయి.
గీ పూలు పూత్తున్నయంటే
ఓలి పండుగు అత్తున్నట్టె లెక్క

మా మల్లారం ల
జీవయ్య దొర సెలుకల, 
ఎంకయ్య దొర సెలుకల  మోతుకు సెట్లుండేటివి. 
ఎండాకాలంల 
మోతుకాకులను 
సొప్ప పుల్లలతోని 
ఇత్తార్లుగ కుట్టేటోల్లం.
కుట్టిన ఇత్తార్లను
కోమటి నాగబూశంకు
అమ్మెటోల్లం.

పురుల్లకు,పుట్టెంటిలకు,
పండుగులకు,లగ్గాలకు
ఇది,అదని కాదుల్లా!
ఏ కార్యమైనా సరే!
ఇత్తార్లల్లనే తినేటోల్లం.
గిన్నెలల్ల తినే కన్న
గా ఇత్తార్లల్ల తింటేనే
మంచిగనిపిచ్చేది.

గీ మోతుకాకులను 
దొప్పలుగ జేసి, అందులో
గుడాలు గాని,పలారం గాని,
పాశం గాని పెట్టేటోల్లు. 
గౌండ్లోల్లు గుడ
గీ మోతుకాకుల్లనే 
కల్లు పోసేటోల్లు.
పండ్లు అమ్మచ్చేటోల్లు గుడ  
దొప్పల్లనే మొర్రి పండ్లను
పోసి ఇచ్చేటోల్లు.

గంతే కాదుల్లా!
ముసలోల్లు మోతుకాకులతో
సుట్టలు జేసుకొని  
అందులో పొగాకు పెట్టుకొని
జెకమొకతో అగ్గి పుట్టిచ్చి
సుట్ట తాగేటోల్లు. 
పనికచ్చే ఆకులల్ల 
బగ్గ పనికచ్చే ఆకు
మోతుకాకే.
ఔ మల్ల!