ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 2971 999గీ ఎండ కాలంలనే
తాటి సెట్లకు ముంజకాయలుంటయి
నేను సిన్నగున్నప్పుడు
మా మల్లారంల
మా నాన జంగం 
చిన్న ముత్తయ్యకు
తెల్వని గౌండ్లోల్లు లేనే లేరు. 
ముంజ కాయలు కావాల్నని
ఏ గౌండ్లైనను అడిగిన గని
ఒకటో, రెండో కాదు,  
ల్యాత ముంజ కాయల  గొలకు గొలనే కోసి ఇచ్చేటోల్లు.  ఆ గొలను 
మా నాన బుజం మీద ఎత్తుకచ్చి  నాకు ,
మా తమ్ముడు (బాలకృష్ణ)కు,
మా అవ్వ (రాజవ్వ)కు కోసిచ్చేటోడు. 
గా ముంజలు తెల్లగ, సల్లగ, తియ్యగ ఉండేటివి.
తిన్న కొద్ది ఇంకా 
తిన బుద్ది అయేది.
తాటి పండును 
కాల్చుకొని సీకుతుంటే..
బెల్లం కన్నా
బగ్గ తియ్యగుండేటిది

సిన్న పోరగాండ్లం
ముంజలు తిన్న
రెండు తాటి కాయల నడిమిట్ల ఒక సన్న కట్టెను కుచ్చి, బండిని తయారు చేసుకునేటోల్లం  
గజం,గజం నర పొడుగున్న పంగల కట్టె తోని
గా బండిని  బజార్ల 
నడిపిచ్చుకుంట 
ఉరికి పిచ్చుకుంట
సంబుర పడుకుంట ఆడుకునేటోల్లం.
గా బండే మాకు 
కారు లెక్క అన్నట్టు.
ఇంక
బుచ్చి బుచ్చి పోర గాండ్లం
ఎండిన తాటి కమ్మలకు,
సొప్ప బెండుకు  
తుమ్మ ముళ్ళు గుచ్చి
గాలికి తిరిగే గిరుకలను 
తయారు జేసుకొని ఆడుకునేటోల్లం.

గీ తాటి సెట్టు 
మామూలు సెట్టు కాదుల్లా!
అన్ని సెట్ల కంటే పెద్దగ , పొడుగ్గ ఉంటది.
దీని కమ్మలతో
ప్యాదోల్లు గుడిసెలు 
ఏసుకునేటోల్లు. 
మా నాన
యాబై యేండ్ల కిందట కట్టిన
మా ఇంటికి దూలాలు
తాటి మొద్దులే.  గవి ఇప్పటిగ్గుడ గట్టిగనే ఉన్నయ్.

గప్పట్ల 
పందిరి లేని 
ఇల్లు ఉండేది కాదుల్లా.
శానా మంది ఇంటి ముందట 
తాటి కమ్మల తోని పందిరి ఏసుకునేటోల్లు.
లగ్గాలు గుడ ఇంటి ముంగట
గీ పందిట్లనే అయేటివి.

ఎనుకట
గీ కరంటు మోటార్లు లేనప్పుడు
రాటు గొట్టో, మోట గొట్టో
పొలం పారిచ్చుకుందురు
గా పొలాలల్లకు
లీల్లు పోవుటానికి
రాటు కాడ, మోట కాడ 
తాటి మొద్దులతో దోనిని
తయారు జేసేటోల్లు.
బాయిల కెల్లి
గీ దోనిల నుంచే లీల్లు 
కాలువల పొంటి పొలాలల్లకు
పోయేటివి.

ఇగవోతే
ఆడోల్లు తానం జేసుటానికి
జాలారు పక్కన
తాటి కమ్మలను 
తడుక లెక్కతయారు జేసి
నాలుగు పక్కల 
అడ్డం కట్టెటోల్లు. గందులో ఆడోల్లు తానం జేసేటోల్లు.

గంతే గాదుల్లా!
ఇంటికి సుట్టపోల్లు అచ్చినా
ఏదైనా పండుగులు,
లగ్గాలు,పురుడు,పుట్టెంటికెలు అయినా,సావు ఆయినా ఇండ్లల్ల  ఏ కార్యమైనా గాని
తాటికల్లు ఉండుడే. 
కల్లు తాగిపిత్తేనే 
మరియాద అ(ఉ)న్నట్టుల్లా!

ఇగ ఆకరుకు
మనుషులు సచ్చినంక  
గీ తాటి కమ్మలతోనే
పాడె కట్టేటోల్లు. 
గిట్ల
నీడ కైనా, సాటు కైనా
పెండ్లి కైనా, సావు కైనా 
శానా పనికచ్చే సెట్టు
తాటి సెట్టు.
ఔ మల్ల!