ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం-871 2971 999
మా మల్లారంల
నలభై యేండ్ల కిందట
గీ కాముని పున్నం, 
ఓలి పండుగ ఎట్ల సేసుకునేటోల్లో 
యాదికున్నకాడికి రాత్తున్న.

ఓలి పండుక్కు ముందు తొమ్మిదొద్దులు
ఐదారుగుగురు ఆడోల్లు 
జతగ కలిసి 
చప్పట్లు కొట్టుకుంట,
కాముని పాటలు పాడుకుంట, ఇల్లిల్లూ తిరుక్కుంట 
పైసలు అడిగేటోల్లు.  
రెండు మూడు కులాలల్ల 
నాలుగైదు  జతలు గిట్ల జేసేటోల్లు
గట్లనే 
కొందరు మొగ పోర గాండ్లు గుడ  జతలుగ కూడి 
కచ్చురం కనాలతో గాని
మూరెడు సన్న కట్టెలతో గాని కోలలుగ జేసుకోని    
 కోలలు కొట్టుకుంట
" జాజిరి జాజిరి జాజో జాజొ "
అని జాజిరి పాటలు పాడుకుంట ఇంటింటికి 
వోయి  ఏమన్న ఎయ్యుమని అడిగేటోల్లు.
ఎవుసం ఉన్నోల్లు 
అడ్లు పెట్టేటోల్లు. 
ఎవుసం లేనోల్లు 
పది పైసలు,చారానా, 
ఆటానా  పైసలు ఏసేటోల్లు.
కాముని పున్నమి రోజున
కోలలను,సన్న మొద్దులను, 
సిన్న సిన్న తుంటలను తడుకలను,తాటి కమ్మలను
నడి బజార్ల ఏసి  రాత్తిరి
కాల వెట్టెటోల్లు. 
గిట్ల కామున్ని కాల్చేటోల్లు.
పున్నమ తెల్లారి 
ఓలిని రంగులతోఆడుకున్నంక
తొమ్మిదొద్దులు జమ అయిన అడ్లను, పైసలను
అందరూ సరి సమానంగా పంచుకునేటోల్లు.  
గట్ల   
అందరూ ఆడుకుంట, పాడుకుంట సంబురంగ 
కలిసి మెలిసి ఉండాల్ననే  
గిట్ల 
పండుగులను యేర్పాటు సేసిండ్రు కావచ్చునుల్లా!
ఎనుకటి పెద్ద మనుషులు
ఏదీ అట్టిగ అనరు.
ఏమీ ఉత్తగ సెప్పరు.
ఔ మల్ల!