నవ సమాజ నిర్మాణంలో...
ప్రధాన భూమికను పోషించాల్సిన కవే
సమానత్వం,విశాలత్వం పెంచుకోలేక
స్నేహాభిమానాలను పంచుకోలేక
ఈర్ష్యా,ద్వేషాలను తుంచుకోలేక
స్పర్థ,స్వార్థాలను తెంచుకోలేక
మూర్ఖత్వం, మూఢత్వాలను చంపుకోలేక
అసూయ,అపార్థాలను వీడలేక
నిర్మలత్వం,నిబద్ధతలతో ఉండలేక
సాత్వికత,నైతికతలతో మనలేక
ప్రజా శ్రేయోభిలాషిగా
ప్రప్రథముడిగా అగ్రభాగాన
ఉండాల్సిన కవి అథముడుగా
అట్టడుకు దిగజారిపోతున్నాడేమిటి?
.......................................
ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన కవే
కులాల గోడలు కట్టేస్తూ..
మతాల మత్తులు చల్లేస్తూ..
అంతస్తుల అగాధాలు సృష్టిస్తూ..
విపరీత ఇ(నై)జాలతో
వేరు వేరు కుంపట్లను ప్రతిష్టిస్తూ..
విలువల వలువలను విడిచేస్తూ..
దొడ్డ కవులను తోసేసుకుంటూ..
దొడ్డి దారిలో పురస్కారాలను కొనుక్కుంటూ..
సన్మానాలను, సత్కారాలను అడుక్కుంటూ..
సాటి కవులను దూషిస్తూ..
మేటి రచయితలను ద్వేషిస్తూ..
ఇతరుల భావాలను తస్కరిస్తూ...
అసలైన ప్రతిభను తిరస్కరిస్తూ..
తన వారినే సత్కరిస్తూ..
తనకు ద(ఛి)క్కలేదని నీరసిస్తూ..
వేరొకరికొస్తే నిరసిస్తూ..
సాహితీలోకాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఓ కవీ!
నిజానికి కవి అనే వాడు ఎలా ఉండాలో తెలుసా??????
చైతన్యమై వెల్లివిరిసేవాడు,
మానవత్వమై పరిమళించే వాడు,
ప్రజాశ్రేయస్సుకై పరిశ్రమించేవాడు,
దిక్సూచియై క్రాంతదర్శి కాగలిగినవాడు,
సాహిత్యమై ప్రవహించే వాడు,
దశాదిశలను నిర్దేశించేవాడు,
లక్ష్యాలను,గమ్యాలను రగిలించేవాడు,
వివేకాన్ని,వివేచనను కలిగించేవాడు,
విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించేవాడు,
కుట్రల్ని,కుతంత్రాల్ని విప్పి చెప్పేవాడు,
అజ్ఞానం,అంధవిశ్వాసాలను సమాధి చేసేవాడు,
నిరంతరం సమాజ పురోగాభివృద్దికై
పునాదులు వేసేవాడు,
అంతేకాదు......
కర్తవ్యోన్ముఖులకు కారకుడు,
కార్య సాధకులకు ప్రేరకుడు,
అవినీతి,అక్రమాలపై
అనుక్షణం పోరాటం చేసే
కలం యోధుడు!
ప్రజా ప్రగతి కోసం పరితపిస్తూ
క్షణం క్షణం ప్రణాళికలు రచించే
అక్షర శ్రామికుడు!
కుల,మత,ప్రాంతాల కతీతమైన
విశ్వమానవ ప్రేమికుడు!
అతడే...అతడే
అచ్చమైన,స్వచ్చమైన కవి( కవయిత్రి)
.....................
సామాజిక సమస్యలను
సమకాలీన సంఘటలను
సమాజంలోని మా(చే)ర్పులను
తన ఆశ(యా)లను,ఆకాంక్షలను
మననీయంగా ,స్మరణీయంగా
నిర్దిష్టంగా,నిర్దుష్టంగా
గాఢంగా, గూఢంగా
గణనీయంగా ,గుణనీయంగా
అనుసరణీయంగా, ఆచరణ యోగ్యంగా
నీతిమంతంగా,శాంతియుతంగా
స్ఫూర్తిమంతంగా, శ్రేయోదాయకంగా
పాఠ్యాంశంగా , పఠనీయంగా
ఆలోచనాత్మకంగా,సృజనాత్మకంగా
ప్రయోగాత్మకంగా , ప్రయోజనాత్మకంగా
ప్రభోదాత్మకంగా, ప్రతిభావంతంగా
కళాత్మకంగా , కవితాత్మకంగా
అక్షరాల్లోకి మార్చి,చేర్చి,పేర్చి,కూర్చి
జనులకు అందించే
అక్షర తపస్వే కవి.
ఆ కవి ఒక వ్యక్తి కాదు,
ఒక మహత్తర శ(యు)క్తి.
అందుకే...అందుకే
అతని కవిత్వం వ్యక్తిగతం కా(రా)దు, కాకూడదు.
జన హితమే తన మతమై
జన గళమే తన బ(క)లమై
చైతన్య స్ఫూర్తికి ప్రతీకయై
సాహిత్య కీర్తికి పతాకయై
ఆదర్శమూర్తికి ఆకృతియై
ప్రజల ఆర్తికి ప్రకృతియై
నిలిచేవాడే కవి.
కవి కాలక్షేపానికో లేదా
తన పాండితీ ప్రకర్షను
ప్రదర్శించడానికో
కవిత్వం రాసే కాలం కాదిది.
ఎన్నెన్నో అవస్తలున్న
ఈ వ్యవస్థలో.....
కవి తన గురుతరమైన బాధ్యతను విస్మరిస్తే..
సమాజం ఎప్పటికీ క్షమించదు.
అలాంటి వారు ఎంతటి వారైనా..
ఎన్నటికీ క్షమార్హులు కా(లే)రు.
కవి సత్యాన్వేషి! సమాజ హితైషి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి