అమ్మతనమే అమ్మకు ఆభరణం...:--పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్...9110784502
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా ...
నీ కన్న ...మిన్న ఎవరమ్మా !
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా ...
ఏ దేవత...నీకంటే గొప్పమ్మా !

మా అమ్మ ప్రేమమయి
మా అమ్మ కరుణామయి
మా అమ్మ అమృతమయి
మా అమ్మ అనురాగమయి
మా అమ్మ మా ఇంటికి దీపం
మా అమ్మ మా కంటికి వెలుగు

మా అమ్మ...
చిన్నతప్పు చేస్తే క్షమిస్తుంది 
పెద్ద తప్పు చేస్తే గద్దిస్తుంది 
మారితే గర్విస్తుంది అదే తప్పు 
పదేపదే చేస్తే ఒంటినిండా వాతలే
ఐతేనేం మా అమ్మ మాకు "ఆది గురువు" ...

మా అమ్మ...
తన అత్తమామలను గౌరవిస్తుంది 
తన అమ్మానాన్నలను పూజిస్తుంది 
మా అమ్మ అతిథి దేవుళ్ళందరికీ అమ్మే
ఔను మా అమ్మే మాకు "మార్గదర్శి" ....
కారుచీకటిలో ఒక కాంతిరేఖ......

అమ్మ శాంతం కడలికన్న మిన్న
అంతులేని ప్రశాంతత ఆమె సొంతం
కోపంతో ఆమె కళ్ళు చింతనిప్పులైనా
పెదాలపై చిరునవ్వుల పువ్వులే పూస్తాయి 
ఔను మా అమ్మ సహనానికి 
ఓర్పుకు చెరగని ఒక "చిరునామా"....

మా అమ్మ...ఎందరికో అమ్మ
ఆమె పిలుపులో ఆమె చూపులో 
గొప్ప గెలుపుతనమే కలుపుగోలుతనమే
ఆమెకు ఊరంతా బంధువులే
ఔను మా అమ్మ ఆరని ఒక "ఆశాజ్యోతి"...
ఆమె ఒక ఆత్మబంధువు....

అమ్మా ! ఓ అమ్మా చెప్పమ్మా !
అమ్మఋణం తీరనిదే కానీ తీర్చేందుకు 
ఎన్ని జన్మలెత్తైడానికైనా మేము సిద్దం
ఓ దైవమా ! మా ప్రార్థన ఒక్కటే మా కోరికొక్కటే జన్మజన్మలకు ఈ‌ చల్లనితల్లి గర్భాన 
జన్మించే భాగ్యం మాకు ప్రసాదించండి తండ్రి !
ఔను అమ్మలేని‌ ఇల్లు "దేవుడులేని కోవెలే"...

మా అమ్మమాట...మధురం 
మా అమ్మ ప్రేమ...ఆక్సిజన్ 
మా అమ్మ మాట...అమృతభాండం
మా అమ్మ ఆలనా పాలనతో... మా జన్మధన్యం 
మా అమ్మే‌ ...మాకు దైర్యం... మాఅమ్మే మాకు దైవం 
మా అమ్మే మాకు ప్రాణం...మాఅమ్మే మాకు సర్వస్వం 

అమ్మా నీవు లేక మేము...లేము...లేము...లేము
అందుకే అమ్మా ! మీకు వందనం ! పాదాభివందనం !!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)