కరోనా రక్కసినుండి రక్షణకోసం?.: --పోలయ్య కవి కూకట్లపల్లి ‌హైదరాబాద్......9110784502..
ఓ భక్తాగ్రేసరులారా!
ఓ నిష్టాగరిష్టులారా!!
నిద్దురలేచింది మొదలు
నిత్యం ఆ దైవసన్నిధి చేరి
ముక్కోటిదేవుళ్ళకు దేవతలకు
అర్చనలు అభిషేకాలతో హారతి ఇచ్చి
మ్రొక్కి మొరపెట్టరేమి?
ఆశతో అర్థించరేమి?
కన్నీటితో ప్రార్థించరేమి?
ఈ కౄరమైన కరోనా
రక్కసి నుండి రక్షించమని....

ఓ భక్తాగ్రేసరులారా!
ఓ నిష్టాగరిష్టులారా!!
అవసరమైతే 
బలులర్పించి
నిప్పులపై నడిచి
పొర్లుదండాలు పెట్టి
మొక్కులు మ్రొక్కి
తలనీలాలిచ్చి
గుళ్ళల్లో దేవాలయాల్లో
యజ్ఞయాగాదులు
హోమాలు చెయ్యరేమి?
శాంతిమంత్రాలు జపించరేమి?
ఆ కరోనా రక్కసిని శపించమని....

ఓ భక్తాగ్రేసరులారా!
ఓ నిష్టాగరిష్టులారా!!
చర్చీలకు, మసీదులకు
మూసిన తలుపులు
వేసిన తాళాలు తియ్యరేమి?
శరణాగతుడైన ఆ భగవంతున్ని
అడగరేమి? ఆరాధించరేమి?
చాటు మాటుగా కాటువేసే 
ఈ కరోనాపై వేటు వెయ్యమని....