(సీస మాలిక) మనభాష మనశ్వాస:--మమత ఐల-హైదరాబాద్-9247593432

ఇతిహాసములనెన్నొ యింపుగా కూర్చిన
      మనభాష తీపిని మరచుటెట్లు
భావమున్ దెలుపుచు పదజాల కూర్పుతో
     ఘనముగా భాషించు ఘనత గలది
బమ్మెర పోతన భాగవతమునందు
     తెలుగు సౌందర్యము తేజరిల్లె
నన్నయ్య తిక్కన నాటి కాలమునుండి
     వృద్ధి జేసిరి మహా వృక్షముగను
భారతంబును వ్రాసి వాసికెక్కిన వారు
     భాషనే శ్వాసగా పరిగణించి
తెలుగులో కావ్యాలు దేశానికందిచి
     మార్గదర్శకులైరి మాన్యులుగను

తే గీ
మరువ లేనట్టి మనభాష మధుర భాష
పెంచి పోషించ వలెనెల్ల వేలలందు
దేశ భాషలో లెస్సైన తెలుగు భాష
గౌరవముతోడ నిలుపుమా సారమెరిగి

తే గీ
భాష యేదైన తెలిపెడి భావ మొకటె
మనిషి కుచ్చ్వాస నిచ్చ్వాస మైనభాష
మాతృ భాషలో నున్నట్టి మధుర తీపి
లేదు లేదెట్టి భాషలో లేశమైన

ఆ.వె
పలుకు తేనెలొలుకు పరభాష కన్నను
ఝరివలె ప్రవహించు విరుల భాష
శ్వాస తెలుగు భాష చక్కనైనది ప్రాస
మనసు పెట్టి వినుము మమత మాట