కలసి వుంటే కలదు సుఖం ( అందమైన అబద్దాలు - కమ్మని ఊహలు )* డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212


 పిల్లలూ... పూర్వం ఇప్పట్లా గ్రామాలు, నగరాలు, పట్టణాలు వుండేవి కావంట. అంతా అడవుల్లోనే బ్రతుకుతా వుండేవారంట. మరి మనుషులు అడవులు వదలి పక్కకు ఎప్పుడొచ్చారు. ఊర్లు ఎప్పుడు కట్టినారు. ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుందా... అయితే సరదాగా ఈ కమ్మని కథ వినండి.
అది చాలాచాలా కాలం కిందటి సంగతి. మనుషులకు, పశువులకు పెద్దగా తేడా లేని కాలం సంగతి. అడవిలో జంతువులూ, పక్షులూ, మనుషులూ అంతా కలసి బ్రతుకుతూ వున్నప్పటి సంగతి.
అప్పట్లో అడవిలో చాలా జంతువులుండేవంట. వాటిలో కొన్ని మాంసం తినేవయితే, మరికొన్ని ఆకులూ, అలములు తినేవి.
ఆ అడవిలో ఒకచోట ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మేకలు, జింకలు, గాడిదలు అన్నీ కలసిమెలసి వుండేవి. కానీ వాటికి పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు మొదలైన వాటితో పెద్ద కష్టమొచ్చి పడింది. ఎప్పుడు ఏవి ఎటువైపు నుంచి దాడి చేస్తాయో... దేనికి ఏ పూట భూమి మీద నూకలు చెల్లిపోతాయో అర్థమయ్యేది కాదు. దినమొక గండంగా వుండేది. హాయిగా ఆడుకోవాలన్నా, పాడుకోవాలన్నా, కాసేపు అటూయిటూ సరదాగా తిరగాలన్నా, ముచ్చట్లు చెప్పుకోవాలన్నా ఒకటే భయం. అడవిలో ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ తిరుగుతా వుండేవి.
వీటి ఇంటి పక్కనే కుక్కలు గూడా వుండేవి. అవి మాంసాహార జంతువులయినా వీటి జోలికి వచ్చేవి కావు. అడవిలో ఏవయినా చిన్నచిన్న జంతువులుగానీ, చచ్చిపోయినవి గానీ దొరికితే వాటిని తింటా వుండేవి. కానీ వీటికి గూడా సింహాలన్నా, పులులన్నా చచ్చేంత భయం. అందుకే అవి వీటితోనే కలసి తిరుగుతా బాగా స్నేహంగా వుండేవి. అప్పుడప్పుడూ ఏవయినా జంతువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ముందే పసిగట్టి వాటిని హెచ్చరిస్తా వుండేవి.
ఒకసారి ఈ సాధుజంతువులన్నీ కలసి ఒకచోట కూచున్నాయి. అప్పుడు ఆవు ''ఏం బ్రతుకు మిత్రులారా మనది. ఒక అచ్చటా లేదు. ముచ్చటా లేదు. ఇట్లా రోజూ భయపడతా బ్రతకడం కన్నా ఈ పులులూ, సింహాలు లేని దూర ప్రాంతానికి ఎక్కడికయినా పోతే బాగుంటాది గదా'' అంది.
ఆ మాటలకు గుర్రం కళ్ళనీళ్ళతో ''కానీ ఎక్కడికి పోగలం మిత్రమా. ఈ అడవిలో అవి లేని చోటంటూ ఎక్కడుంది. మొన్ననే ఒక తోడేలు మా చిన్నపిల్లలని చంపి తినేసింది'' అంది.
''మిత్రమా... బాధపడకు. మనసుంటే మార్గముంటాది. కాస్త ఆలోచిద్దాం'' అంది మేక ఆప్యాయంగా దాని వీపు నిమురుతా.
అంతలో ఎద్దు ముందుకు వచ్చి ''మిత్రులారా... ఈ అడవిలో అందరికన్నా బలవంతులు మనుషులే. మనం వెళ్ళి వాళ్ళని కాపాడమని సాయం అడుగుదాం. ఏమంటారు'' అంది.
అన్నీ కాసేపు ఆలోచించి ''సరే... ఏ ప్రయత్నం చేయకుండా వూరికే గమ్మున కూర్చోవడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచిపనే కదా... పోదాం పదండి'' అనుకున్నాయి.
మనుషులు అడవుల్లో ఈ క్రూర జంతువులకి, విష సర్పాలకి చిక్కకుండా కొండల మీదా, గుట్టల మీదా నివసించేటోళ్ళు. మరికొందరయితే ఎత్తయిన చెట్ల మీద చిన్నచిన్న ఇళ్ళు కట్టెలతో కట్టుకునేటోళ్ళు. పులులకూ, సింహాలకు గూడా మనుషులంటే కొంచం భయమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొశ్శని బాణాలుండేవి. ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకోని దాడి చేస్తుంటారు.
జంతువులన్నీ కలసి మనుషుల దగ్గరికి పోయాయి. ''ఏమబ్బా ఇవన్నీ ఇట్లా కట్టకట్టుకోని వచ్చాయి'' అని ఆశ్చర్యంగా చూడసాగారు వాళ్ళంతా. అప్పుడు మనుషుల రాజు ముందుకు వచ్చి ''ఎవరు మీరు. ఎందుకిట్లా మా దగ్గరకు వచ్చారు'' అని అడిగాడు. అప్పుడు ఆవు ముందుకు వచ్చి ''మాకు ఈ అడవిలో బ్రతకడం రోజురోజుకీ చాలా కష్టమయిపోతా వుంది. ఎట్లాగయినా సరే మీరు మమ్మల్ని కాపాడండి'' అంది. ఆ మాటలకు మనుషులు నవ్వి ''చూడండి. మమ్మల్ని మేము కాపాడుకోడానికే నానాక బాధలు పడతా వున్నాం. మరలా మిమ్మల్ని ఎట్లా కాపాడ్డం. అయినా మిమ్మల్ని కాపాడ్డం వలన మాకేం లాభం. ముందు ఆ సంగతి చెప్పండి'' అన్నారు.
జంతువులన్నీ కలసి కూర్చోని మాట్లాడుకున్నాయి. మొదట ఎద్దు ముందుకు వచ్చి ''మీరు మమ్మల్ని కాపాడితే మేము గూడా రకరకాలుగా మీకు సాయపడతాం. నేను మీరు పంటలు పండించుకోవడానికి, వాటిని ఇంటికి తెచ్చుకోడానికి, బండ్లను లాగడానికి సహాయం చేస్తాను'' అంది.
గాడిద ముందుకు వచ్చి ''ఈ కొండలల్లో, గుట్టలల్లో, చిక్కని అడవులల్లో మీరు సేకరించే పండ్లు, కాయలు, కొట్టుకొచ్చే కట్టెలు మీరే మోసుకోని రాకుండా ఒకచోటి నుండి మరొక చోటుకి తరలించడానికి నేను ఉపయోగపడతాను'' అంది.
తరువాత గుర్రం ముందుకు వచ్చి ''నాకు చాలా వేగంగా పరిగెత్తే శక్తి వుంది. ఒకేసారి ఒకరినిగానీ, ఇద్దరిని గానీ ఎక్కించుకోని ఎంత దూరమయినా తక్కువ సమయంలో తీసుకుపోగలను'' అంది.
అంతలో ఆవు ముందుకు వచ్చి ''నా పాలు చాలా బాగుంటాయి. అవి తాగితే మీకు బలం చేకూరడమే గాకుండా ఆకలి కూడా తీరుతుంది. మా దూడలకు కొంచం వదలి మిగతావి మీరు పిండుకోండి'' అంది.
మనుషులు బాగా ఆలోచించారు. ''సరే... ఇవి చెప్పినవన్నీ బాగానే వున్నాయి. మనకు గూడా రోజూ వేటాడడం, ఆహారం దొరుకుతుందో లేదో అనే ఆందోళనా తప్పుతాయి. వీటి సాయంతో సులభంగా మనమే పంటలు గూడా పండించుకోవచ్చు. కాబట్టి వీటికి సహాయం చేద్దాం'' అనుకున్నారు.
దాంతో ''సరే వచ్చేయండి. మిమ్మల్ని కాపాడుకుంటాం'' అన్నారు. తరువాత రోజు అడవిలో వుండే ఆవులూ, గుర్రాలూ, ఎద్దులూ, గాడిదలూ అన్నీ మనుషుల దగ్గరికి బైలుదేరుతూ జింకతో ''నువ్వు గూడా రాగూడదా... ఈ అడవిలో ఆ క్రూరమృగాలతో ఎంతకాలం బాధపడతావు'' అన్నాయి.
దానికి జింక ''వద్దు మిత్రమా... నాకు ఇలా స్వేచ్ఛగా వుండడమంటేనే ఇష్టం. అదీగాక నాది మెరుపువేగం. చీమ చిటుక్కుమన్నా ఛటుక్కున పసిగట్టేసి క్షణంలో మాయమైపోతా... ఆ మనుషుల దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పిన పనల్లా చేస్తా బానిసలాగా పడి వుండడం నా చేతగాదు'' అంది.
అందుకు గుర్రం ''సరే... నీకిష్టం లేకపోతే నువ్విక్కడే వుండు అంతేగానీ పెద్దపెద్ద మాటలు వద్దు. కాలు జారితే తీసుకోగలం గానీ, నోరు జారితే తీసుకోలేం. ఒకరికొకరు సాయం చేసుకోవడం వేరు. బానిసత్వం వేరు'' అంది.
అట్లా మిగతా జంతువులన్నీ కలసి మనుషుల దగ్గరికి చేరిపోయాయి. మనుషులు వాటిని ఎంత కాపాడుకుంటున్నా అడవి జంతువులు వాటిని వదల్లేదు. చీకటి పడితే చాలు మట్టసంగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి, ఒక్కసారిగా ఎగిరి దుంకి ఏది దొరికితే దాన్ని చంపి తీసుకుపోవడం మొదలుపెట్టాయి.
దాంతో మనుషులు బాగా ఆలోచించి ''మనం ఇట్లా అడవుల్లో వుంటే వాటి దాడి నుంచి తప్పించుకోలేం. మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చిన వాటిని కాపాడడం మన బాధ్యత. కాబట్టి మైదాన ప్రాంతాలకు పోవడమో, అడవిని కొంత నరికి మైదానంగా చేసేయడమో చేయాలి. అప్పుడే వాటిని దూరం నుంచే సులభంగా గుర్తుపట్టి ఎదురుదాడి చేయగలం'' అనుకున్నారు.
అంతే... తరువాత రోజు నుంచీ చెట్లు కొట్టడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోగా అడవిలో చాలా వరకు కొట్టేసి చుట్టూ కంచె వేసి మధ్యలో చిన్న వూరు కట్టుకోని జంతువులతో వుండసాగారు. అట్లా గ్రామాలు ఏర్పడ్డాయి. దాంతో అడవి జంతువుల బాధ చాలా వరకు తగ్గిపోయింది. కానీ పూర్తిగా తగ్గలేదు. చీకటి పడితే చాలు భయమే... అప్పుడప్పుడు ఏదో ఒకటి ఏదో వైపు నుంచి వూహించని విధంగా దాడి చేస్తూనే వుండేది.
దాంతో జంతువులన్నీ బాగా ఆలోచించాయి. ''మనం పూర్తిగా వీటి దాడుల నుంచి బైటపడాలంటే ఒకేఒక మార్గం వుంది'' అనుకున్నాయి. దాంతో అవి ఆవును అడవిలోకి పంపించాయి. అది ఎవరి కంటా పడకుండా చెట్ల చాటునా, పుట్టల చాటునా దాక్కుంటా దాక్కుంటా తమ మిత్రుడు కుక్క దగ్గరికి చేరుకుంది.
ఆవును చూడగానే కుక్క సంతోషంగా దాని మెడను కౌగిలించుకోని ''ఎన్ని నాళ్ళయింది మిత్రమా... మిమ్మల్ని చూసి, మీరంతా ఎట్లా వున్నారు. మీ కష్టాలన్నీ తీరిపోయాయా... మనుషులు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా... మీరు ఇక్కన్నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచీ మిమ్మల్ని తలచుకోని రోజు లేదంటే నమ్మండి... మిగతావాళ్ళంతా బాగున్నారు గదా'' అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది.దానికి ఆవు విచారంగా ముఖం పెట్టి ''ఏం సుఖంలే మిత్రమా... ఎక్కడ వేసిన గొంగడి అక్కన్నే వున్నట్టుంది మా పరిస్థితి. చావు భయం ఇంచు గూడా తగ్గలేదు'' అంది.
''అరెరే... ఏమైంది'' బాధగా అడిగింది కుక్క.
అపుడు ఆవు నెమ్మదిగా జరిగిందంతా వివరించి ''మిత్రమా... మమ్మల్ని కాపాడే శక్తి నీకొక్కదానికి మాత్రమే వుంది. నువ్వు గూడా మాతో బాటు మనుషుల దగ్గరికి వస్తే మాకు ప్రమాదం తప్పినట్లే. రాత్రిపూట ఏ మాత్రం చిన్న అలికిడయినా నువ్వు పసిగట్టేసి అందరినీ హెచ్చరించగలవు. దాంతో మనుషులు వాటి దాడిని తిప్పికొట్టగలరు'' అంది.
ఆ మాటలకు కుక్క కాసేపు కిందామీదా పడి ఆలోచించి ''కానీ మిత్రమా... నేను మాంసం లేకుండా వుండలేనే'' అంది.
''నిజమే... మిత్రమా... కానీ మాకు నువు తప్ప వేరే మార్గం లేదు'' అంది ఆవు కన్నీళ్ళు కారిపోతుంటే.
దాంతో కుక్క కరిగిపోయింది. ''ఛ... ఛ... స్నేహితుల కోసం త్యాగం చేయని బ్రతుకూ ఒక బ్రతుకేనా... సరే వస్తా పద'' అంది.
ఆరోజు నుంచీ కుక్క అప్పుడప్పుడు మనుషులు వేసే మాంసం తింటూ, మిగతా సమయంలో అన్నం, పప్పు, కూరలు తినడం అలవాటు చేసుకుంది. ఊరిలో తన మిత్రులను కాపాడుకోవడం కోసం ఊరికి కాపలాగా నిలబడింది. దాంతో అడవి జంతువులు దాడి చేసినప్పుడల్లా మనుషులు తిప్పికొట్టడమే గాక, వాటినే కుక్కల సాయంతో వేటాడి చంపడం మొదలుపెట్టారు.
దాంతో అవన్నీ భయపడిపోయి గ్రామాల వైపు రావడం తగ్గించి అడవుల్లోనే వుండిపోవడం మొదలుపెట్టాయి. మనుషులు గూడా వాటిని వేటాడ్డం తగ్గించి జంతువుల సహాయంతో వ్యవసాయం చేసుకుంటూ, కావలసిన పంటలు పండించుకుంటూ హాయిగా గ్రామాల్లో నివసించడం మొదలుపెట్టారు.
కామెంట్‌లు