పిల్లలూ... కొబ్బరిచెట్లను చూశారు గదూ... అవి చాలా ఎత్తుగా, ఎవరూ సులభంగా పైకి ఎక్కడానికి వీలు లేకుండా, నున్నగా జారిపోయేటట్లు వుంటాయి గదూ... అట్లా ఎందుకుంటాయో తెలుసా...
ఒకప్పుడు కొబ్బరిచెట్టు కూడా చాలా లావుగా అన్ని చెట్లలాగే భూమికి దగ్గరగా వుండి, చెయ్యెత్తితే చాలు కాయలు అందుతా వుండేవంట. ఆ చెట్టు చాలాచాలా మంచిదంట. అడవిలోని జంతువులన్నీ దాని చుట్టూ తిరుగుతా, కబుర్లాడుతా వుండేవి. వాటి పిల్లలు వచ్చినప్పుడు కొబ్బరిచెట్టు మట్టలు కిందకు వంచి వాటిని మీదకు ఎక్కించుకునేది. మట్టలన్నీ దగ్గరదగ్గరగా చేసి పందిరిలాగా చేస్తే పిల్లలు హాయిగా దాని మీద పడుకునేవట. అది వాటికి గాలి విసురుతా మెల్లగా వుయ్యాలలూపుతా నవ్విస్తా వుండేదంట.
ఎప్పుడయినా ఏవయినా జంతువులు దాని లేతకాయలు తెంపడానికి వస్తే ''వద్దమ్మా పచ్చివి తెంపొద్దండి. అవి తెంపుతా వుంటే ప్రాణం గిజగిజలాడిపోతా వుంటాది. శరీరంలోంచి ఒక భాగం కోసేసినంత నొప్పిగా వుంటాది. చాలా జంతువులు, వాటి పిల్లలు అడవిలో పోతాపోతా వూరికే సరదాగా కనబడిన చెట్ల ఆకులను ఫటఫటఫట తెంపేస్తా, కొమ్మలు విరిచేస్తా ఆనందిస్తుంటాయి. మీ సరదా మాకెంత బాధగా వుంటుందో అర్థం చేసుకోరు. ఎవరయినా పోతాపోతా ఊరికే మీ నెత్తి మీద ఠపీమని కొట్టి పోతే మీకెట్లుంటాది... మీకు అంతగా కావలిస్తే పండి రాలిపోవడానికి సిద్ధంగా వున్న ఎండుకాయలు తీసుకోండి. పీచు వలచుకోని కొబ్బరి తిని హాయిగా చల్లని నీళ్ళు తాగండి. నాకేం బాధగా వుండదు'' అని చెప్పింది. దాంతో జంతువులు కూడా ఏవీ దాని కాయలు తెంపి బాధపెట్టేవి కావు.ఒకసారి ఒక గుర్రంపిల్ల, ఏనుగుపిల్ల ఆ చెట్టు కిందకు వచ్చాయి. చిరునవ్వులు నవ్వుతా పైకి ఎక్కుతామన్నాయి. సరేనని ఆ కొబ్బరిచెట్టు వాటిని ఎక్కిచ్చుకొంది. చెట్టుపైన రెండూ హాయిగా వుయ్యాలలూగుతా వుంటే గుర్రంపిల్లకు ఒక ఎండిపోయిన టెంకాయ కనబడింది. ''అరెరే... భలే... భలే...'' అంటూ సంబరంగా అది ఆ టెంకాయ తీసుకొంది. వెంటనే ఏనుగుపిల్ల ''ఏయ్... దాన్ని నాకివ్వు. నాకు చాలా దాహంగా వుంది'' అంది. అందుకా గుర్రం పిల్ల ''వూహూ... దీన్ని మొదట చూసింది నేను. తెంపింది నేను. కావాలంటే పగలగొట్టి సగంసగం తిందాంలే'' అంది. కానీ ఆ ఏనుగుపిల్ల ఒప్పుకోలేదు. అది పెద్ద పోరంబోకుది. దాంతో ఆ టెంకాయను పట్టుకోని గుంజసాగింది. అది చూసి కొబ్బరిచెట్టు ''వద్దొద్దు... కొట్టుకోవద్దు. కావాలంటే నాకు నొప్పయినా పరవాలేదు. ఒకరు పచ్చికాయ తీసుకోండి'' అని అరవసాగింది. కానీ ఏదీ దాని మాట వినలేదు. రెండూ ఒకదాన్నొకటి కొట్టుకోసాగాయి. అంతలో ఏనుగుపిల్ల తొండంతో గుర్రంపిల్లను గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా విసిరికొట్టింది. అంతే... అది చెట్టు పైనుంచి దభీమని కింద పడింది. పడడం పడడం కిందున్న ఒక బండరాయి మీద పడి తల పగిలి ఎక్కడిదక్కడ పడిపోయింది.
అది చూసి ఏనుగుపిల్ల వణికిపోయింది. ఎట్లా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి గట్టిగా ''అయ్యో... గుర్రంపిల్ల కింద పడిపోయింది. పచ్చికాయలు తెంపుకుంటా వుంటే కోపం వచ్చి కొబ్బరిచెట్టు విసిరికొట్టింది. కాపాడండి... కాపాడండి'' అంటూ అరవసాగింది. చుట్టుపక్కల వున్న జంతువులన్నీ పరుగుపరుగున వచ్చాయి. చూస్తే గుర్రంపిల్ల అప్పటికే రక్తం మడుగులో పడి వుంది. అన్నింటికీ కొబ్బరిచెట్టు మీద విపరీతమైన కోపం వచ్చింది.
''ఏదో పాపం... చిన్నపిల్ల... తెలీక ఆశపడి ఒక కాయ తీసుకోబోయిందే అనుకో... దానికి ఇంత శిక్షా. అసలు నీకు మనస్సనేది వుందా'' అంటూ నానాక తిట్లు తిట్టసాగాయి. ''అయ్యో! నా మాట వినండి. నా తప్పేం లేదు'' అని అది ఎంత గొంతు చించుకున్నా ఏవీ పట్టించుకోలేదు. అంతలో పులి గట్టిగా గాండ్రిస్తూ ''పాపం... ఒక్క కాయకే ఇంత చేసినావు గదా... అసలు నీకు ఇప్పుడు ఒక్క కాయగానీ, ఒక్క కొబ్బరిమట్టగానీ లేకుండా చేస్తాం. అప్పుడేం చేస్తావో చూస్తాం'' అంటూ గట్టిగా అరిచింది. అంతే జంతువులన్నీ చుట్టూ చేరి ఆ కొబ్బరిచెట్టును రపారపా పెరకసాగాయి.
పాపం... కొబ్బరిచెట్టుకు ఏం చేయాల్నో తోచలేదు. వాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాల్నో తోచలేదు. చివరికి తన బలమంతా వుపయోగించి వాళ్ళకు అందకుండా నేల మీద నుంచి ఒకొక్క అడుగే పెరగసాగింది. అది అట్లా ఒక అడుగు పెరిగినప్పుడల్లా దానికి చుట్టూ ఒక గీత ఏర్పడసాగింది. దాని లావు తగ్గి సన్నగా మారసాగింది. కానీ జంతువులు దాన్ని వదలలేదు. కట్టెలు తీసుకొచ్చి కొట్టసాగాయి. దాంతో అది కట్టెలకు కూడా అందకుండా పెరిగింది. దాంతో జంతువులకు ఇంకా కోపం వచ్చి రాళ్ళు తీసుకోని విసరసాగాయి. దాంతో అది రాళ్ళకు కూడా అందకుండా మరింత మరింత పెరుగుతా పోయింది. అట్లా పెరుగుతున్న కొద్దీ సన్నగా, నున్నగా ఎవరూ ఎక్కకుండా సర్రున జారిపోయేలా తయారయింది. జంతువులన్నీ కోపంతో దాని చుట్టూ చేరి గట్టిగా వూపసాగాయి. దాంతో అంత పైనుంచి ఒక కాయ వూడి దభీమని ఆ గుర్రంపిల్ల పక్కన పడింది. పడడం పడడం టప్పుమని రెండు ముక్కలుగా చీలి దానిలోని నీళ్ళు ఎగిరి గుర్రంపిల్ల ముఖమ్మీద పడ్డాయి. దాంతో దానికి మెలకువ వచ్చింది. అది చూసిన జంతువులన్నీ కొబ్బరిచెట్టును వదిలేసి గుర్రంపిల్ల చుట్టూ చేరాయి.
''ఎలా వుంది... బాగుందా... దెబ్బలేమైనా తగిలాయా... నొప్పిగా వుందా...''అంటూ అన్నీ ఒకదాని మీద ఒకటి అడగసాగాయి.
గుర్రంపిల్లకు వాటి మాటలేవీ చెవికెక్కడం లేదు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని కొబ్బరిచెట్టునే చూస్తా ''ఏమైంది... ఇది ఇట్లా అందనంత ఎత్తుకి ఎట్లా ఎదిగిపోయింది'' అంది.
దానికి జంతువులు జరిగిందంతా చెప్పాయి.
ఆ మాటలకు గుర్రంపిల్ల విలవిలలాడిపోతా ''అరెరే... ఎంత పని చేశారు. ఆ కొబ్బరి చెట్టంటే అడవిలోని పిల్లలకంతా ఎంతిష్టమో తెలుసా... మమ్మల్నందరినీ అమ్మలాగా మీదికెక్కించుకొని వుయ్యాలలూపేది. పడుకోబెట్టి ఎండ తగలకుండా ఆకులు కప్పి నాన్నలాగా చల్లని గాలి విసిరేది. స్నేహితునిలాగా తియ్యని కొబ్బరినిచ్చి, చల్లని నీళ్ళను పంచేది. అట్లాంటి అందమైన మనసున్న చెట్టును ఏ తప్పూ చేయకున్నా బాధ పెట్టారా'' అంటూ జరిగిందంతా చెప్పింది.
ఆ మాటలకు జంతువులన్నీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి. ''అరెరే... ఏ మాత్రం ఆలోచించకుండా కొబ్బరిచెట్టును ఎంత బాధ పెట్టాము'' అనుకుంటా దానివైపు తిరిగి ''మిత్రమా... పొరపాటయింది. మా తప్పును మన్నించు. నువ్వు మరలా ఎప్పటిలా మామూలుగా మారిపో. ఇకపై నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. దీనికంతా కారణం ఈ దొంగదే. దీని సంగతి చూస్తాం'' అంటూ కట్టె తీసుకోని ఏనుగుపిల్లను కొట్టబోయాయి.
అంతలో కొబ్బరిచెట్టు ''వద్దొద్దు మిత్రులారా... ఆగండి. అది చిన్నపిల్ల. భయంతో పిల్లలు అట్లా అబద్దం చెప్పడం మామూలే... కానీ మీ వివేకం ఏమయింది. ఇన్ని రోజులుగా కలసి వుంటున్నాం. ఐనా ఏ మాత్రం ఆలోచించకుండా దాడి చేసి గాయపరిచారే మిమ్మల్నెట్లా నమ్మడం. నేనలాగే వుండి వుంటే ఈ పాటికి మీ చేతుల్లో చచ్చిపోయి వుండేదాన్ని. వద్దు మిత్రమా ఇక నన్నిట్లాగే వదిలివెయ్యండి. పగిలిన అద్దం, చెదిరిన మనసు అతుక్కోవడం కష్టం. ఈ అడవిలో ఎవరు ఎక్కడి నుంచి చూసినా ఎత్తుగా నేను మీకు కనబడుతూనే వుంటాను. నన్ను చూసినప్పుడల్లా మీకు మీరు చేసిన తప్పు గుర్తుకు వస్తుంటాది. దాంతో ఇకపై ఎదుటివారు చెప్పేది వినకుండా ఏ నిర్ణయాలూ తీసుకోరు. నేను పడిన బాధ ఈ అడవిలో ఇంకెవరూ పడగూడదు'' అని చెప్పింది. అట్లా అప్పటినుంచీ కొబ్బరిచెట్టు జంతువులకి దూరంగా ఆకాశంలోనే వుండిపోయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి