ఒక రాకుమారి ఏడుమంది గంధర్వ కన్యలు (అద్భుత జానపద కథ)- డా.ఎం.హరికిషన్- కర్నూల్ - 9441032212

 ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు ఏడుమంది కొడుకులు. వాళ్ళలో అందరికన్నా చిన్నోడు చానా చక్కనోడు. అచ్చం నెమలి లెక్క అందంగా వుంటాడు. ఆ ఏడు మంది కొన్నాళ్ళకు పెరిగి పెద్దగైనారు. పెద్దగైనాక పెండ్లి చేయాల గదా. కానీ వాళ్ళ నాయనకు ఒకొక్క ఇంటి నుండి ఒకొక్క అమ్మాయిని తెచ్చి తన కొడుకులకు పెండ్లి చేయడం ఇష్టం లేదు. యాడన్నా ఒకే ఇంట్లో ఏడు మంది అక్కచెల్లెళ్ళుంటే వాళ్ళను తన కొడుకులకు ఇయ్యాలని ఆయన కోరిక. అందుకని రాజ్యమంతా తెగ వెదికినాడు. కానీ ఆయనకు ఏ ఇంట్లోనూ ఏడు మంది అక్కాచెల్లెళ్ళు కనబళ్ళేదు.
దాంతో ఆ ఏడుమంది రాకుమారులు వాళ్ళ నాయన దగ్గరికి పోయి ''నాయనా ... నాయనా...ఈ రాజ్యంలో మాకెక్కడా ఏడుమంది అక్కాచెల్లెళ్ళు కనబడ్డంలేదు. మేం దేశసంచారం పోయి చుట్టుపక్కల రాజ్యాల్లో యాడన్నా వున్నారేమో వెదికి, వుంటే పెండ్లి చేస్కోనొస్తాం'' అన్నారు. దానికి వాళ్ళ నాయన సరేనని వాళ్ళందర్నీ దీవించి పంపించినాడు.
అట్లా...వాళ్ళు ఒకొక్క రాజ్యమూ వెదుక్కుంటా...వెదుక్కుంటా... ఏడు రాజ్యాలు దాట్నాక ఒక పేదరాశి పెద్దమ్మ కనబడి ''ఏంది నాయనా ఏంది మీ కథ'' అనడిగింది. వాళ్ళు జరిగినదంతా చెప్పినారు. అప్పుడా పేదరాశి పెద్దమ్మ ''ఈడికి తూర్పు దిక్కున ఏడు మైళ్ళ దూరంలో ఒక రాజ్యముంది. ఆ రాజుక్కూడా ఏడుమంది కూతుర్లే. ఆయన కూడా మీ నాయన లెక్కనే ఇస్తే ఏడుమంది అన్నదమ్ములున్న ఒక్కింటికే నా కూతుర్లను ఇస్తా గానీ ఒకొక్కరిని ఒకొక్క ఇంటికి ఇయ్యనంటూ పట్టుబట్టి కూచున్నాడు. మీరు ఆడికి పోండి'' అని చెప్పింది.
వాళ్ళు సంబరంగా వెంటనే ఆ రాజ్యానికి చేరుకున్నారు. రాజు వాళ్ళందరినీ రాజభవనంలోకి తీస్కోనిపోయి, మర్యాదలు చేసి తన ఏడు మంది కూతుళ్ళనీ వాళ్ళకిచ్చి అంగరంగవైభోగంగా పెండ్లి చేసినాడు. పెండ్లయినాక వాళ్ళు ఒక ఏడురోజులు హాయిగా ఆన్నే వుండి ''ఇంగ మేం మా వూరికి పోయొస్తాం'' అని అత్తామామల్తో చెప్పి, వాళ్ళిచ్చిన చీరాసారే అన్నీ తీస్కోని పెండ్లాలతో ఇంటికి తిరిగి బైలుదేరినారు.
అడవిలో సగం దూరం పోయినాక చీకటి పడింది. చీకట్లో పోవడం మంచిది కాదుగదా. అందుకని వాళ్ళు ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర ఆగి ఈ రాత్రికి ఈన్నే పండుకోని రేప్పొద్దున్నే పోదాం అనుకున్నారు. ఆ పక్కనే వున్న చెరువుకాడ కాళ్లూ చేతులు కడుక్కోని, తెచ్చుకున్నవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయినారు.
ఆ మర్రిచెట్టు పక్కనే ఒక చెరువుంది గదా... అందులో ప్రతిరోజూ అర్ధరాత్రి ఆకాశం నుండి ఏడుమంది గంధర్వ కన్యలు దిగొచ్చి స్నానం చేసి మళ్ళా పొద్దు పొడిచేకళ్ళా తిరిగి వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళు చానా చెడ్డోళ్ళు. అందర్నీ సతాయిస్తా, భయపడిస్తా నవ్వుకునేటోళ్ళు. ఆరోజు గూడా వాళ్ళు ఎప్పట్లాగే స్నానం చేసొద్దామని కిందికి దిగినారు. దిగి స్నానానికి పోతా వుంటే చిన్నామెకు ఆడ పండుకొన్నోళ్ళు కనబన్నారు.
వెంటనే ''అకా...అకా... అటు చూడు. ఎవరో మానవులు ఆ చెట్టు కింద పండుకోనున్నారు. పోయి భయపడిచ్చి వద్దామా'' అనింది. సరేనని వాళ్ళందరూ ఆ చెట్టు కాడికి పోయినారు. వాళ్ళకు ఆడ చిన్నోడు కనబన్నాడు. చిన్నోనిది చూడచక్కని అందం గదా. దాంతో వాళ్ళు ''అబ్బ...ఎంతందంగా వున్నాడీ మానవుడు. దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుషుల్లో గూడా యాడా ఇంత సుందరాంగుడు వుండడు. చేస్కుంటే ఇట్టాంటోన్నే పెండ్లి చేస్కోవాల'' అనుకోని నిద్రపోతున్న వాన్ని నిద్రపోతున్నట్టు...సప్పుడు గాకుండా మట్టసంగా ఎత్తుకోనిపోయి ఆ చెరువు కింద ఏడంతస్తుల మేడ కట్టించి అందులో దాచిపెట్టినారు.
పొద్దున్నే అందరూ లేచి చూస్తే ఇంగేముంది... చిన్నోడు లేడు. ''యాడికి పోయినాడబ్బా అని అడవంతా తెగ వెదికినారు. వుంటే గదా కనబడ్డానికి. పాపం...మొగుడు కనబడకపోయేసరికి చిన్నరాణి బాధతో కండ్ల నిండా నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడ్చింది. అందరూ వెదికీ వెదికీ అలసిపోయి...''చీకటి పడ్తోంది. మనం పోదాం పదండి. బతికుంటే వాడే వస్తాడు'' అని బైలుదేరినారు.
చిన్నరాణి చూడ్డానికి సన్నగా, అమాయకంగా కనబడ్తాది గానీ ఆమె బలె ధైర్యవంతురాలు. కత్తి తిప్పడం, గుర్రంస్వారీ చేయడం అన్నీ ఆమెకు వచ్చు. అందుకే ''మీరు పోండి...నేను వస్తే నా మొగున్తో వస్తా... లేదంటే లేదు'' అని ధైర్యంగా చెప్పింది. సరేనని మిగతావాళ్ళందరూ ఆమెకు ఒక గుర్రం, కత్తి, తినడానికి పళ్ళూ, ఫలహారాలు ఇచ్చి వెళ్ళిపోయినారు.
రాకుమారి ప్రతిరోజూ పొద్దున్నే అడవంతా వెదికీ...వెదికీ...అలసిపోయి, రాత్రి కాగానే మళ్ళా అదే చెట్టు కింద నిద్రపోయేది. ఒకరోజు రాత్రి నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతా వుంటే పైన్నుంచి గాజుల గలగలలు, నవ్వుల కిలకిలలు వినబన్నాయి. ''ఇదేందబ్బా... ఇంతర్ధరాత్రిపూట'' అని కండ్లు తెరిచి చూస్తే ఇంగేముంది... ఏడుమంది గంధర్వకన్యలు పైనుండి కిందికి దిగొచ్చి చెరువులోకి పోవడం కనబడింది.
ఆ చెరువులో ఏముందబ్బా...అని ఆమె తర్వాత రోజు పొద్దున్నే చెరువులోకి దభీమని దుంకి అడుగుకి పోయి చూసింది. చూస్తే ఇంగేముంది. ఏడంతస్తుల మేడ ధగధగా మెరిసిపోతా కనబడింది. 
నెమ్మదిగా తలుపు తోసుకోని లోపలికి పోయి వెదుకుతా వుంటే ఒక గదిలో రాకుమారుడు కాళ్ళూ, చేతులు కట్టేసి కనబన్నాడు. ఆమె పరుగుపరుగున మొగుని దగ్గరకు పోయి అన్నీ ఇప్పేసింది.
అప్పుడా రాకుమారుడు పెళ్ళాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకోని ''వాళ్ళు ప్రతిరోజూ వచ్చి మమ్మల్ని పెళ్ళిచేసుకుంటావా... లేదా... అని భయపడిస్తా వున్నారు. నేనొప్పుకోవడం లేదు. అందుకే నన్నిట్లా కట్టేసి బాధపెడ్తా వున్నారు'' అని చెప్పినాడు. సరిగా తిండి లేక బక్కచిక్కిపోయిన మొగున్ని చూసి ఆమె కండ్లనీళ్ళు పెట్టుకోనింది. అప్పట్నించీ ప్రతిరోజూ పొద్దున్నే పండ్లూ, కాయలూ తీసుకోని మొగుని దగ్గరకు పోయి, పగలంతా ఆన్నే వుండి చీకటి పడగానే తిరిగొచ్చేసేది.
ఒకరోజు ఆ గంధర్వ కన్యలకు ఆ గదిలో పగిలిపోయిన గాజుముక్కలు కనబన్నాయి. అది చూసి వాళ్ళు ''ఓహో! ఐతే...ఎవరో రోజూ ఈడికి వస్తున్నారన్నమాట'' అని కనుక్కోని రాత్రికి రాత్రే ఆ రాకుమారున్ని తీస్కోనిపోయి ఏడు సముద్రాల అవతల ఒక చిన్నదీవిలో దాచిపెట్టినారు.
తర్వాత రోజు పొద్దున్నే రాకుమారి పోయి చూస్తే... ఇంగేముంది... మేడా లేదు... మొగుడూ లేడు. ''ఏమైపోయినాడబ్బా......'' అని గుర్రమేస్కోని వెదుక్కుంటా... వెదుక్కుంటా... పోతా వుంటే... దారిలో ఒక చోట ఒక చెట్టు మీద నుండి ''కాపాడండి... కాపాడండి...'' అని అరుపులు వినబన్నాయి.
''ఎవరబ్బా...పాపం...అట్లా అరుస్తా వున్నారు!'' అని తల పైకెత్తి చూస్తే ఇంగేముంది...ఏడు తలల నాగుబాము ఒకటి గండభేరుండ పక్షి పిల్లలను తినడానికి వస్తా కనబడింది. వెంటనే రాకుమారి ఒరలోంచి కత్తి తీసి చకచకా చెట్టు పైకెక్కి దాని మీదకి దుంకింది. రాకుమారేమీ సామాన్యురాలు కాదుగదా. కత్తి గిరగిరా తిప్పుతా వుంటే పాము ఆరు తలలూ ఆరు నిమిషాల్లో తెగి కిందపడినాయి. ఏడోతల నరకబోతున్నంతలో అది అనుకోకుండా కసుక్కున ఆమె కాలు మీద కాటేసింది. అంతే...పాపం...ఆమె శరీరమంతా విషమెక్కి నోట్లోంచి నురగలు రావడం మొదలుపెట్టినాయి. ఐనా సరే అంత బాధలో గూడా కత్తి వదలకుండా ఆ చిన్న పిల్లల్ని కాపాడ్డానికి శక్తినంతా కూడగట్టుకోని సర్రున ఏడోతల మీద కూడా ఒక్కేటు వేసింది. అంతే...ఆ పాము కింద పడి గిలగిలా కొట్టుకుంటా చచ్చిపోయింది. రాకుమారిని పాము కరిచింది గదా... దాంతో పాపం ఆమె గూడా పాముతో బాటే కింద పడి చచ్చిపోయింది.
కాసేపటికి గండభేరుండ పక్షి ఆడికి వచ్చింది. వెంటనే పిల్లలు ''అమా... అమా...'' అంటూ జరిగిందంతా చెప్పినాయి. అప్పుడా పక్షి ''అయ్యో! మిమ్మల్ని కాపాడ్డానికి తన ప్రాణాలే పోగొట్టుకుందా....ఏది ఏమైనా గానీ ఈమెను తిరిగి బతికియ్యాల్సిందే'' అంటూ ఏడువేల మైళ్ళ దూరంలోనున్న సంజీవనీ కొండ దగ్గరకు పోయి జీవపుల్ల తెచ్చింది. జీవపుల్లంటే తెల్సుగదా...అది అట్లాంటిట్లాంటి మామూలు పుల్లగాదు. దాన్ని ముక్కు దగ్గర పెడితే చచ్చినోళ్ళు గూడా టక్కున లేచి కూచుంటారు. ఎంత పెద్ద దెబ్బలైనా సరే చిటికెలో మాయమైపోతాయి. అట్లాంటి శక్తి గల ఆ పుల్ల రాకుమారి ముక్కు దగ్గర పెట్టేసరికి ఆమెకు జీవమొచ్చి మళ్ళా కళకళలాడుతా కళ్ళు తెరిచింది.
అప్పుడా గండభేరుండ పక్షి ''అమ్మా...నీవెవరోగానీ నీ ప్రాణాలు అడ్డం పెట్టి నా పిల్లల ప్రాణాలు కాపాడినావు. చెప్పు ...నీకే సాయం కావాలన్నా చేసి పెడ్తా'' అనింది. అప్పుడా రాకుమారి తన కతంతా చెప్పి ''నా మొగుడు యాడున్నాడో కనుక్కోగలవా'' అనడిగింది. దానికా పక్షి ''నువ్వేం బాధపడొద్దు. ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏమూల నీ మొగున్ని దాచిపెట్టినా కనుక్కోనొస్తా... అంతవరకూ నువ్వు ఈన్నే హాయిగా విశ్రాంతి తీసుకో'' అంటూ ఏడు రోజుల్లో భూప్రపంచం మొత్తం ఆ మూల నుంచి ఈ మూలవరకు సుడిగాలిలా చుట్టుకోనొచ్చి గంధర్వకన్యలు రాకుమారున్ని యాడ దాచిపెట్టినారో కనుక్కునేసింది.
తిరిగి రాకుమారి దగ్గరికొచ్చి ''నీ మొగున్ని యాడ బంధించినారో తెల్సిపోయింది. దా పోదాం'' అంటూ ఆమెను వీపు మీద ఎక్కించుకోని గంటకో సముద్రం చొప్పున, ఏడు గంటల్లో ఏడు సముద్రాలు దాటుకోని రాకుమారున్ని దాచిన దీవిలో దింపింది.
రాకుమారి వురుక్కుంటా పోయి మొగున్ని చేరింది. వాళ్ళ నుండి ఎట్లా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి మొగున్తో ''మనకు ఒకటే దారి. వాళ్ళ ఆయుష్షు యాడుందో ఎట్లాగైనా కనుక్కో'' అని చెప్పింది. సరేనని రాకుమారుడు ఆ రాత్రి గంధర్వ కన్యలు రాగానే వగలుపోతా ''మిమ్మల్ని చేసుకోవడం నాకిష్టమే. కానీ మీవాళ్ళు వూకుంటారా. మీరు బైటికి పోయినప్పుడు నన్ను చంపినా చంపుతారు. అందుకే మీ ప్రాణాలు యాడున్నాయో చెప్పండి. నావి కూడా ఆన్నే దాచిపెడ్తా. అప్పుడు నన్ను కూడా ఎవరూ ఏమీ చేయలేరు'' అన్నాడు.
దానికా గంధర్వ కన్యలు ''నువ్వేం భయపడొద్దు. ఈడికి ఏడుమైళ్ళ దూరంలో ఏడంతస్తుల పెద్దమేడ ఒకటుంది. దాని ఏడోఅంతస్తులో ఏడు పంజరాలున్నాయి. అందులో ఒకొక్క దాంట్లో ఒక చిలకుంటాది. దాండ్లలోనే మా ప్రాణాలుండేది. నీ ప్రాణం కూడా ఆన్నే దాచిపెడ్తాంలే'' అని చెప్పినారు. తర్వాత రోజు పొద్దున్నే రాకుమారికి వాడు విషయమంతా చెప్పినాడు.
అట్లాగా అని ఆ రాకుమారి గండభేరుండ పక్షినెక్కి ఆ ఏడంతస్తుల మేడకు చేరుకోనింది. లోపలికి పోదామని కాలు పెడుతున్నంతలో యాన్నించి వచ్చినారో... దాన్ని కాపలా కాస్తావున్న ఏడుమంది రాక్షసులు ఒక్కసారిగా ఆ రాకుమారి మీద పడినారు. వాళ్ళను చూసి రాకుమారి ఏమాత్రం భయపళ్ళేదు. వెంటనే ఒరలోంచి సర్రున కత్తి తీసి దెబ్బకొకని చొప్పున ఏడు దెబ్బల్లో ఏడుమంది తలలు నరికేసి లోపలికి పోయింది. ఏడో అంతస్తులో ఏడు పంజరాలు కనబన్నాయి. కత్తి తీసుకోని ఒకొక్క చిలకనే బైటకు తీసి చంపి పాడేసింది. అంతే చిలకల్లోనే గదా ఆ గంధర్వకన్యల ప్రాణాలుండేది. దాంతో ఆ ఏడుమంది ఎక్కడివాళ్ళు అక్కడ నిలుచున్నచోట నిలబన్నట్టుగా నెత్తురు కక్కుకోని చచ్చిపోయినారు.
అప్పుడా రాకుమారుడు, రాకుమారి సంబరంగా గండభేరుండ పక్షినెక్కి మళ్ళా తమ రాజ్యానికి చేరుకున్నారు. తిరిగొచ్చిన వాళ్ళిద్దర్నీ చూసి వూరువూరంతా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.
కామెంట్‌లు