భవితని భద్రంగా ఏలుకో!:-నాశబోయిన నరసింహ (నాన), చిట్యాల,నల్గొండ,9542236764
కలం పాళీ కన్నా
కత్తి మొన కన్నా
పదునైన ఆయుధానివి                        
ఎన్నికల  రణక్షేత్రాన 
గెలుపోటమిల రథసారథివి

వయోజన అస్తిత్వపు గుర్తింపు        
వ్యవస్థ పరిణామానికి నాంది నీవు                                                        
తలరాత తార్మార్ చేసే తాపత్రయం
సమాజ గతిని మతిని కుదిపేసే తంత్రం                                            
జీవన గమనం మార్చే మహా అద్భుతశక్తివి..!                   

సాంఘిక ఆర్థిక సమానత్వ సాధనకై 
రాజనీతి ప్రజాస్వామ్య పరిరక్షణకై 
నీతో ప్రయోజనం అమోఘం అపూర్వం!
నీ కోసం ఎదురు చూసే జనప్రభంజనం..!                                      

కుల మత భేద భావ హద్దులు చెరిపి 
రాజ్యాంగం కల్పించిన అవకాశం నీది                  
సమ సమాజం స్తాపన కోసం నీ ఆర్భాటం
సకల జనుల స్వేచ్ఛా బతుకుకై పోరాటం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే తుది తీర్పు                                       
కలిమి లేమి లింగవివక్షత లేని తత్వం ఓటుది!   
                           
నిష్పక్షపాత పరిపాలనకై 
సత్ సంప్రదాయాల సంరక్షణకై 
ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో 
నేస్తమా ఓటు హక్కు వినియోగించాలి! 

ఓటు హక్కుమాత్రమే కాదు 
ప్రతి పౌరుడి కనీస బాధ్యత 
ఒక ప్రాంత సమగ్రాభివృద్ధికై
సమర్థ పాలకుల ఎన్నికకై 
ఓటు పాత్ర అత్యంత కీలకం                                          
ఓ యువకుడా ఓటు విలువ తెలుసుకో!
బంగారు భవితను భద్రంగా ఏలుకో!

గల్లీలోని వార్డు సభ్యుడైనా
ఢిల్లీలోని రాజ్యాధికారైనా 
ఓటు వినియోగం అనివార్యం 
రెపరెపల బ్యాలెట్ పత్రాలైనా                                       
ఎలక్ట్రానిక్ మంత్ర దండాలైనా                         
నీ ఓటు వజ్రాయుధం! మరువొద్దు!
                            
నీ ఓటే వేట కత్తి  ప్రశ్నించే హక్కు దానిది 
ఓటును పచ్చ నోటుకు ముడి వేయకు
ప్రలోభాలకు లొంగని పవిత్రాత్మతో 
నీతి నిజాయితీ సేవకునికి పట్టంగట్టు!