మకుటం లేని మహారాజు:-నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,చిట్యాల,నల్గొండ,9542236764.
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే దాకా 
మట్టితో చెలిమి చేసే మకుటంలేని మహారాజు 
పల్లె తల్లిని పరవశింప చేసే భూమి పుత్రుడు
హలం ఆయుధంగా పొలం సాగున యుద్ద సైనికుడు
రక్తం స్వేదంగా మార్చి సేద్యం చేసే రైతుబాంధవుడు 

పుడమి తల్లిని ప్రేమతో ఆరాధిస్తూ 
వ్యవసాయ యజ్ఞంలో అతనో సమిధ 
అన్నార్తుల ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు 
ఆరుగాలం శ్రమతో విరామమెరుగని విశ్వరక్షకుడు 
కంటికి రెప్పలా పంట మొక్కకు కాపలా సైనికుడు

రోగం రొప్పి మరిచి కష్టించే కర్మయోగి కర్షకుడు 
తిండి తిప్పలు మరిచి ప్రకృతితో మమేకమై
అలుపెరుగని నిత్య కృషీవలుడు మట్టి మనిషి
నేలతల్లి కడుపులో పసిడి పండించి
మానవాళికి గోరు ముద్ద లందించే మార్గదర్శకుడు 

కాలమెంత కన్నెర్ర చేసినా గుండె నిబ్బరంతో
సేద్యం వదలని అన్నదాత అపర భగీరథుడు 
అతని పాద స్పర్శకు ధరణి పులకరించు 
పొద్దంతా సూరీడుతో పోటీపడి చెమట చిందించు
అన్నదాత కన్నీటి దారలు దేశప్రగతి నిరోధకాలు