భౌతిక దూర సూత్రం:--నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య పర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,9542236764
ఓ మనిషికి సూక్ష్మక్రిమికి 
నడుమ స్థూల సమరం 
మూడో ప్రపంచ పోరాటం  

బాంబు విస్ఫోటనాల్లేవ్ 
రుధిర ధారల్లేవ్ 
ఎలా వచ్చిందో ఏమో!  
రోజు రోజుకు రెట్టింపు బలం
భూమండలమంతా 
తన కబంధ హస్తాల్లో 
బిక్కు బిక్కు మంటూ 
ప్రపంచం వెన్నులో 
వణుకు పుట్టించే అరాచకం 
రోగుల హాహాకారాల నడుమ 
కరోనా కరాళ నృత్యం!

గాలిలో పల్టీలుకొట్టే గద్దొచ్చి 
కోడిపిల్ల నెత్తుకు పోయే చందం 
గుడ్లప్పగించి చూడటం తప్ప 
చేసేదేమి లేని దీనత్వం
తడిగుడ్డతో గొంతుకోసే 
కోవిడ్ కసాయి తత్వం!  

ఓ జనతా కర్ఫ్యూ 
ఒక లాక్ డౌన్ 
ఇంకో హోమ్ క్వారంటైన్ 
మరో సోషల్ డిస్టెన్సీ
హ్యాండ్ వాష్ లన్నీ 
యుద్ధ నైపుణ్యం పరంపరలే 
కరోనా కోరలు పీకి బొంద పెట్టడానికే!  

ప్రతి పౌరుడు సైనికుడై 
విష వైరస్ వలయం చేధించి 
కరోనా కనుమరుగు చేయాలి
తుమ్మొచ్చినా దగ్గొచ్చినా 
చేతిరుమాలు అడ్డుపెట్టి
మాస్కులతో రక్షించుకోవాలి 

నమస్కారమే సంస్కారం
మనిషి మనిషికి 
భౌతిక దూర సూత్రం 
శరీరం రోగ


నిరోధకశక్తి కర్మాగారమై
పరిశుభ్రత ప్రాధాన్యతతో 
సబ్బునీటితో చేతులు రుద్దాలి 

దేహమే దేవాలయమై
వైద్యులే నారాయణులై 
అప్రమత్తతే ఆయుధంగా 
ఆచరణతో సిద్దించు సాధన