అర్థం కాని భాష:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.

 రాము, పీటర్ ఇద్దరు స్నేహితులు. ఒకసారి వారు ఇద్దరూ పనిమీద ఇంగ్లాండ్ వెళ్లారు.  రాముకు ఇంగ్లీష్ రాదు .ఇద్దరూ ఒక హోటల్ కు వెళ్లారు .తాను తన మిత్రుని దగ్గరికి వెళ్లి అయిదు నిమిషాలలో తిరిగి వస్తానని పీటర్ అన్నాడు. అందుకు రాము సరేనన్నాడు .రెండు గంటలు గడిచినా పీటర్ రాలేదు.
         ఆ హోటల్ సర్వర్ బయటకు వచ్చి "వాటర్! వాటర్ !"అని అరవసాగాడు . అక్కడే ఉన్న రాము "వాటర్ కాదయ్యా !పీటర్ !"అని అన్నాడు.
       ఆ మాటలు సర్వర్ కు అర్థం కాక తిరిగి "వాటర్! వాటర్ !"అని అన్నాడు. రాము" నీ తలకాయ! వాడి పేరు వాటర్ కాదు .పీటర్ "అని అన్నాడు .ఇది అర్థం కాని సర్వర్  తెలుగులో గట్టిగా "పీటర్ !పీటర్" అని అరుస్తున్న రామును చూసి  " మాడ్! మాడ్" (పిచ్చివాడు, పిచ్చివాడు)అని అరిచాడు .
        అది సరిగా వినిపించని రాము "వీడికి 'మ్యావ్, మ్యావ్ 'అని  అనరాక "మాడ్ ! మాడ్ "అని అంటున్నాడనుకొని  పిల్లి " మ్యావ్! మ్యావ్" అని అంటుంది కాని "మ్యాడ్ , మ్యాడ్ "అని కాదయ్యా! "అని అన్నాడు.
       అప్పుడు ఇది అర్థంకాని సర్వర్ ఏదో తప్పుగా మాట్లాడాననుకొని  రాముతో "సారీ! సారీ"!(క్షమించు, క్షమించు) అని అన్నాడు.
   "  ఓహో వీడికి సంగీతం నేర్పాలేమో! అని అనుకొని "నాకు సంగీతం రాదయ్యా! సారీ కాదు. 'సారీగమపదనీస 'అని నేర్చుకోవాలి .అది నేర్పేవారు మా దేశంలో ఉన్నారు. ఇక్కడ లేరు "అని అన్నాడు.
        అది కూడా అర్థం గాని సర్వర్  తిరిగి "సారీ !సారీ" అని అన్నాడు ." ఏరీ! ఏరీ !  నా పీటర్ " అని అన్నాడు రాము .ఇద్దరికీ ఒకరన్నది  మరొకరికి అర్థం కాలేదు .
       ఈ లోపలే పీటర్  వచ్చి రాముని కలుసుకొని ఆలస్యమైనందుకు తనను క్షమించమన్నాడు. రాము ద్వారా జరిగింది తెలుసుకొని పీటర్ నవ్వుకున్నాడు. తాను ఎప్పుడూ తిరిగి అతన్ని ఒంటరిగా వదిలి పెట్టనని చెప్పాడు పీటర్.