కోసల దేశంలో ఒక మంత్రి పదవి ఖాళీ ఏర్పడింది .ఆ పదవి కొరకై రాజు అనేక పరీక్షలు పెట్టి పదిమంది తెలివితేటలు కలవారిని ఎంపిక చేశాడు. ఈ పది మందిలో నుండి ఒకరిని తిరిగి పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాల్సి ఉంది.
రాజు వారిని పిలిపించి ఇప్పుడు రాజ్యం అల్లకల్లోలంగా ఉందని ,తిరిగి శాంతి నెలకొనాలంటే ఏ చర్యలు తీసుకోవాలో సూచించమని ,అందుకు వారం రోజుల గడువును తీసుకొమ్మని తెలిపాడు .అందుకు వారు సంతోషంగా అంగీకరించి వెళ్ళిపోయారు .వారం రోజుల తర్వాత తొమ్మిది మంది వచ్చి తమ తమ అభిప్రాయాలను రహస్యంగా రాజుగారికి నివేదించారు. వారిలో ఒకరు ప్రజలలో దానగుణం పెంపొందింప చేయాలని అన్నారు. మరొకరు ప్రజలలో సోమరితనం పోగొట్టాలని అన్నారు. ఇంకొకరు ప్రజల్లో ఐక్య భావన పెంపొందింప చేయాలని అన్నారు. మరొకరు శత్రు భావం కల ప్రజలను ఏరి పారేయాలని అన్నారు. ఇలా తమ తమ అభిప్రాయాలు ఒక్క రాజు గారికే రహస్యంగా తెలియజేశారు.
రాజు పదవవ్యక్తిని పిలిచి అతని అభిప్రాయం చెప్పమన్నాడు. అతడు రాజుతో" మహారాజా! ముందుగా నేను వారందరి అభిప్రాయాలు మీకు చెప్పి పిదప నా అభిప్రాయం చెబుతాను" అని చెప్పి వారందరి అభిప్రాయాలను పూస గుచ్చినట్లు తెలియజేశాడు. రాజు ఆశ్చర్యపోయి" వారి అభిప్రాయాలు నీకు ఎలా తెలిశాయి" అని ప్రశ్నించాడు? " ఏముంది మహారాజా !నేను వారి దగ్గరికి వెళ్లి వారి అభిప్రాయాలు సేకరించాను. మంత్రి పదవి పొందేవాడు అందరితో కలుపుగోలుగా ఉండాలి తప్ప తన సలహానే గొప్పదని భావింపరాదు. అంతేకాదు తన అభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పరాదు. వారందరూ నాకు తమ తమ అభిప్రాయాలు తెలిపారు . ఇవి అమలు చేస్తే చాలు. ఇదే నా అభిప్రాయం" అని అన్నాడు.
అప్పుడు రాజు" లేదు లేదు. నీ సలహా కూడా చెప్పు" అని అన్నాడు . "మహారాజా! ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అవి చేయండి.వారందరిలో దేశభక్తి పెంపొందింపజేయుటకై క్రీడాకారులతో క్రీడా పోటీలు ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రతి పౌరునిలో నా రాజ్యం అన్న భావన ఏర్పడి శాంతి నెలకొంటుంది .ఐకమత్యం పెంపొందుతుంది" అని అన్నాడు. రాజుకు అతని సలహా నచ్చి అతనిని మంత్రిగా నియమించాడు.అందుకే మంత్రి తన సలహానే గొప్పదని భావించరాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి