శంకరం మంచి గాయకుడు. అతడి తండ్రి చలపతి దూరదేశంలో ఉండే వాడు.
ఒకసారి చలపతి పేరుమీద కొంత డబ్బు మంజూరైంది. అది చలపతికి ఇస్తారని అధికారులు ప్రకటించారు. ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిది, శంకరంది ఒకే ఊరు కావడంతో శంకరానికి ఈ విషయాన్ని ఆ ఉద్యోగి చెప్పాడు .కానీ చలపతి దూరదేశంలో ఉండడం వలన ఆ డబ్బు ఎలా తీసుకోవాలో శంకరానికి తోచలేదు. చివరికి ఆ ఉద్యోగినే శంకరం సలహా అడిగాడు. అతడు తన కార్యాలయంలోని అధికారికి శంకరాన్ని చూపించి 'చలపతి' ఇతడేనని పరిచయం చేస్తానని, మీ నాన్న డబ్బును వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. అందుకు శంకరం సరేనన్నాడు.
ఆ ఉద్యోగి మరుసటిరోజు తన కార్యాలయంలోని అధికారికి చలపతి వచ్చాడని, అతనికి డబ్బులు ఇవ్వమని చెప్పాడు. అందుకు ఆ అధికారి సరేనని అతడిని పిలువమని అన్నాడు. ఆ ఉద్యోగి శంకరాన్ని 'చలపతి 'అని గట్టిగా పిలిచాడు. లోపలికి వచ్చిన శంకరాన్ని చూసిన ఆ అధికారి "ఏమోయ్! శంకరం బాగున్నావా! నిన్ను చూసి ఈయన చలపతి అంటాడేమిటి? " అని ప్రశ్నించే సరికి ఆ ఉద్యోగి తెల్లబోయాడు.
తన అధికారికి శంకరం పేరు ఎట్లా తెలిసిందని ఆ ఉద్యోగి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ అధికారి తన ఉద్యోగిని చీవాట్లు పెట్టి ,శంకర్ తండ్రే చలపతి అని చెబితే తాను డబ్బు ఇచ్చే వాడినని ,అనవసరంగా అబద్దాలు ఆడావని మందలించాడు. ఆ ఉద్యోగి అధికారికి క్షమాపణలు చెప్పి శంకరాన్ని చలపతి పేరుమీద పరిచయం చేసినందుకు తనను తాను తిట్టుకున్నాడు.
ఆ అధికారి శంకరానికి డబ్బును ఇస్తూ " నీవు మంచి గాయకుడవు. నీ పాటలు నేను చాలా విన్నాను. అనేక కార్యక్రమాల్లో నిన్ను నేను చూశాను" అని చెప్పేసరికి శంకరం సంతోషించాడు . తనతో బయటకు వచ్చిన ఉద్యోగితో శంకరం"ఈయనకు నేను తెలుసని నాకే తెలియదు. ఇందులో నా పొరపాటు కానీ , మీ పొరపాటు కానీ ఏమీ లేదు. ఇది కాకతాళీయంగా జరిగింది. అయినా దీనికి కారణం నేనే గనుక నన్ను క్షమించండి" అని అన్నాడు .
తరువాత ఆ అధికారికి శంకరం ఇందులో ఆ ఉద్యోగి పొరపాటు ఏమీ లేదని అన్నాడు .తానే ఈ ఉద్యోగిని డబ్బులు ఇప్పించమని కోరానని, మీకు నేను తెలుసని ఆ ఉద్యోగికి తెలియదని, చివరికి నాకు కూడా తెలియదని, నా తండ్రి దూర దేశంలో ఉండటంవల్ల అలా చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు. తర్వాత అధికారితో ఆ ఉద్యోగిని క్షమించమని శంకరం కోరాడు. అతడు శంకరంపై గల అభిమానంతో సరేనని అన్నాడు .
అందుకే "మనం అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి "అని అంటారు పెద్దలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి