చెల్లని నోటు:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి:-మొబైల్:9908554535.




 చలమయ్య ఇంటిలో ఒకసారి రంగయ్యకు ఏదో విషయంలో కోపం వచ్చి ఒక వస్తువును  పగలగొట్టాడు .చలమయ్య విసుక్కుంటే ఆ వస్తువు ఖరీదును తాను తన కొట్టులో  ఇస్తానని రంగయ్య అందరి ముందు అన్నాడు. ఈ విధంగా రంగయ్య ఆ వస్తువు ఖరీదు వందరూపాయలు బాకీ ఉన్నాడు.

         చలమయ్య చాలా తెలివిగలవాడు. ఎలాగైనా బాకీ వసూలు చేస్తాడని రంగయ్యకు తెలుసు. అయితే ఆ డబ్బు ఇవ్వడానికి రంగయ్యకు మనసొప్పలేదు. ఈ రీతిగా చలమయ్య ఎన్నిసార్లు అడిగినా గానీ  రంగయ్య ఆ వంద రూపాయలు మరునాడు ఇస్తానని చెప్పేవాడు. చివరికి ఇవ్వక తప్పదని గ్రహించిన రంగయ్య ఒక చెల్లని నోటును చలమయ్య కొరకై ప్రత్యేకంగా దాచిపెట్టాడు .అది ఎంతమందికి ఇచ్చినా వారు తిరిగి దానిని అతనికి వెంటనే ఇచ్చి ఇంకొక నోటును ఇమ్మని అడిగేవారు.  ఈ నోటు ఎలాగూ చెల్లదు గనుక ఎలాగైనా చలమయ్యకు దీనిని  కట్టబెడదామని రంగయ్య అనుకున్నాడు.

       ఒకరోజు చలమయ్య యథాప్రకారం రంగయ్యను  వంద రూపాయలు ఇమ్మని అడిగాడు. రంగయ్య చెల్లని  నోటును చలమయ్య చేతికి ఇచ్చాడు. రంగయ్య ఎత్తును తెలుసుకున్న చలమయ్య వెంటనే ఆ నోటుకు చిల్లర ఇమ్మని అడిగాడు. తన దగ్గర చిల్లర లేవని రంగయ్య డబ్బు పెట్టెను తెరచి చూపాడు . అందులో ఒక్క రూపాయి కూడా లేదు .ఎందుకంటే చలమయ్య ఎలాగూ అది తీసుకోడనీ ,తనకే వాపస్ ఇస్తాడని రంగయ్యకు తెలుసు. అందుకే రంగయ్య డబ్బు పెట్టెలో ఒక్క పైసా కూడా లేకుండా చేసి ముందే ఎత్తు వేశాడు.

       ఇంతలో డబ్బు చెల్లించేందుకు వచ్చిన సోమయ్య అనే కొత్త వ్యక్తి రంగయ్యకు  ఐదు వందల రూపాయలు  ఇచ్చాడు .అవి అన్నీ చిల్లర నోట్లే. అది గమనించిన చలమయ్య ఇప్పుడు చిల్లర వచ్చింది కనుక తనకు వంద చిల్లరను  ఇమ్మన్నాడు ."ఈ నోటు చెల్లదు అంటావా !"అని రంగయ్య ప్రశ్నిస్తే చలమయ్య" నేను అలా అనలేదు. నాకు మాత్రం చిల్లర కావాలి "అని అన్నాడు.చేసేది లేక రంగయ్య వంద రూపాయల చిల్లరను చలమయ్యకు ఇచ్చాడు. చలమయ్య తన బాకీ వసూలు అయినందుకు  సంతోషంగా ఇంటికి వెళ్ళాడు .

      కానీ అంతకుముందే రంగయ్యకు చిల్లర డబ్బు  ఇవ్వబోతున్న సోమయ్యను చలమయ్యే  దారిలో ఆపాడని, తాను కొట్టులో  ఉన్నప్పుడే ఆ డబ్బు ఇవ్వమన్నాడని పాపం రంగయ్యకు తెలియదు.


కామెంట్‌లు