అవసర బంధుత్వం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి-మొబైల్: 9908554535.

 రాము బస్సులో ఎక్కాడు. బస్సు జనంతో క్రిక్కిరిసి ఉంది. అతని కాలుకు గాయం వల్ల నొప్పిగా ఉంది. కానీ తప్పదు. ఈ బస్సు తప్పితే మళ్లీ రెండు గంటల వరకు బస్సు లేదు .రాము అరగంటసేపు బస్సులో నిలబడ్డాడు. సీటు మాత్రం దొరకలేదు. పైగా తన కాలుకు గాయమైన చోటనే జనం ఆ పాదాన్ని తొక్కుతున్నారు .ఎవ్వరిని ఏ మనుటకు వీలు లేదు. ఎందుకంటే స్త్రీలు, పిల్లలు  ఎంతోమంది నిలబడే ఉన్నారు .
        అంత జనంలో రాము తాను నిలుచున్న సీటు నుండి  కొద్దిగా ముందుకు జరిగాడు .ఆ సీట్లో కూర్చున్న వ్యక్తిని "హాయ్ రాజేష్ .బాగున్నావా!" అని పలకరించాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి "ఆ. బాగున్నాను !"అని అన్నాడు . "మీది పైడిపర్రు కదూ" అని తిరిగి ప్రశ్నించాడు రాము. " కాదు. నిడమర్రు"అని అన్నాడు రాజేష్. " మీ నాన్న పేరు గిరీశం కదూ!" అన్నాడు రాము. " అవును "అన్నాడు రాజేష్.  రాజేష్ వెంటనే కొద్దిగా పక్కకు జరిగి తన ప్రక్కన కూర్చొనుటకు సీటును ఇచ్చాడు . "నీవు ఇంటర్ చదువుతున్నావు  కదూ "అని అడిగాడు రాము. "అవును" అన్నాడు రాజేష్ .  "ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా" అని అడిగాడు రాము. " అవును" అన్నాడు రాజేష్ .ఇద్దరూ కొద్దిసేపు వివిధ విషయాలు మాట్లాడుకున్నారు .
       తరువాత రాజేష్ రాముతో "మీకు మా కుటుంబం గురించి ఎలా తెలుసండి !మీకు మాకు ఏమన్నా దూరపు బంధుత్వం ఉందా !"అని ప్రశ్నించాడు ? "బస్సు సీటు బంధుత్వం అండీ !మీ వివరాలు మీ నోటుబుక్కు పైననే ఉన్నాయిగా! అవి చూసి మిమ్మల్ని పలకరించాను. నా అవసర బంధుత్వం వల్లనే మీరు నాకు బస్సులో సీటును ఇచ్చారు. అందుకు మీకు కృతజ్ఞతలు !"అని చెప్పి రాము బస్సు దిగాడు.