స్నేహ ధర్మం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

 మేకల గుంపులోని ఒక మేక మరొక మేక తో స్నేహం చేయసాగింది . ఇది గమనించిన మిగతా మేకలు ఆ మేకతో "నీవు మేకతో స్నేహం చేయడంలో గొప్పదనం ఏమీ లేదు. మరొకదానితో స్నేహం చేస్తే గొప్ప" అని అన్నాయి.
       ఇది విన్న మేక తన తోటి మేక స్నేహాన్ని వీడి గొర్రె తో స్నేహం చేయసాగింది. అప్పుడు కూడా మిగతా మేకలు" గొర్రెలు మనం దాదాపు ఒకే జాతి వారము. నీవు గొర్రెతో కాకుండా మరొక తెలివైన జంతువుతో స్నేహం చేస్తే మేలు "అని అన్నాయి.
        వెంటనే మేక గొర్రె స్నేహం వదిలి అడవిలో కనిపించిన నక్కతో  స్నేహం చేయసాగింది. అప్పుడు మళ్ళీ మేకలు" నక్క జిత్తుల మారి. పైగా మన కన్నా తెలివిగలది .అది నిన్ను ఎప్పుడో మోసం  చేయక మానదు. అందువల్ల దానితో స్నేహం తగదు "అని అన్నాయి.
        అప్పుడు విసుక్కున్న మేక " మరి ఎవరితో స్నేహం చేయమంటారో చెప్పండి "అని అడిగింది. "మనకన్నా  బలవంతుల తో స్నేహం చేస్తే మేలు" అని మిగతా మేకలు అన్నాయి.
          వాటి మాటలు విని  మేక సింహం తో స్నేహం చేయసాగింది .అప్పుడు కూడా మేకలు "ఆ సింహం ఈ అడవికి రాజు. దానికి ఆకలైతే మాత్రం నిన్ను నీ స్నేహాన్ని పట్టించుకోకుండా నిన్ను  భక్షింపక మానదు.  అందువల్ల దాని స్నేహం పనికి రాదు" అని అన్నాయి.
          ఆ మాటలు విన్న మేక" ఛీ !వీరి మాట వినడమే బుద్ధి తక్కువ. ఎవరితో స్నేహం చేయాలన్నా వీరు ఇష్టపడరు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నాతోటి పూర్వపు మేక తో స్నేహమే నాకు గొప్ప" అని పాత స్నేహితురాలు వద్దకు వెళ్ళింది.
         అప్పుడు ఆ పాత స్నేహితురాలైన మేక "ఇతరుల మాటలు విని స్నేహ ధర్మాన్ని, మనసును మార్చుకునే  నీలాంటి వారి స్నేహం ఎప్పటికీ పనికిరాదు. అందుకే నేను ఇతరులతో జత కట్టాను" అని అంటూ దానికి దూరంగా వెళ్ళిపోయింది .అందుకే ఇతరుల మాటలన్నీ పట్టించుకొని ఉన్న స్నేహాన్ని దూరం చేసుకోకూడదు.