ఉంగరం మహిమ:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.-మొబైల్: 9908554535.

  పూర్వం రత్నపురి  రాజ్యంలో  శివానందుడు అనే శివ భక్తుడు ఉండేవాడు. అతడు కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అని ఆలోచించాడు. అతడు శివుని గురించి గొప్ప తపస్సు చేశాడు. కొన్ని రోజులకు శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. వెంటనే శివానందుడు  స్వార్థంతో "దేవా !నాకు మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మహిమ గల ఉంగరాన్ని ఇవ్వండి "అని అన్నాడు .అందుకు శివుడు సమ్మతించి నీకు ఎవరికైనా ముగ్గురికి మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఈ ఉంగరానికి ఉంది. అంతకన్నా ఎక్కువ అయితే ఇది పని చేయదు" అని తెలిపి దాని మంత్రం ఉపదేశించి మాయమయ్యాడు.
        ఇలా ఉండగా ఆ దేశపు రాజు గారు  అస్వస్థతకు గురి అయినాడు. ఆయనకు వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది .అప్పుడు శివానందుడు రాజు గారి వద్దకు వెళ్లి తన ఉంగరం మహిమతో అతని ఆరోగ్యం బాగు చేస్తానని అన్నాడు. కానీ తనకు కోరినంత ధనం ఇవ్వాలని షరతు పెట్టాడు. అందుకు రాణి అంగీకరించింది.
       వెంటనే శివానందుడు  రాజుపై ఉంగరం ఉంచి  మంత్రాన్ని పట్టించాడు. రాజు ఒకే క్షణంలో పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయినాడు. వైద్యులందరూ ఉంగరం మహిమకు ఆశ్చర్యపోయారు. రాజు తో పాటు ఆ రాజ్య ప్రజలు అందరూ శివానందుని దేవునిగా భావింపసాగారు .రాజు పరమానందభరితుడై అతనికి కావాల్సినంత ధనం ఇచ్చి ఉండడానికి తన రాజభవనం లోనే బసను ఏర్పాటు చేయించాడు. శివానందునికి  ఇక్కడ దివ్యంగా జరుగుతున్నది.
       కొన్ని రోజులకు రాజు గారి తల్లి అనారోగ్యం పాలైంది. శివానందుడు తన ఉంగరం  మహిమతో ఆమెను కూడా సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా చేశాడు. రాజు సంతోషించాడు.
         మరొకసారి రాజ వైద్యుని కుమారుడు కూడా జబ్బు పడ్డాడు. అప్పుడు గూడా శివానందుడు అతనిని కోలుకునేటట్టు చేశాడు. క్రమేపీ  శివానందుని  కీర్తి పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించింది. దీనితో అతనికి  శివుడిచ్చిన ఉంగరం మహిమ  మూడు సార్లు పూర్తి అయింది.
           ఒకరోజు అనుకోకుండా రాజు గారి భార్య అనారోగ్యం పాలైంది. రాజు తన భార్యకు స్వస్థత చేకూర్చాలని శివానందుని కోరాడు. శివానందుడు  తన ఉంగరం  సంగతి చెప్పి ఆ ఉంగరం మహిమ   ఇప్పుడు పని చేయదని అన్నాడు. .అప్పుడు రాజుకు కోపం వచ్చి అతని ధన మంతా తీసుకొని ,అతనికి దేశ బహిష్కార  శిక్ష విధించాడు .
       బ్రతుకు జీవుడా అని అంటూ శివానందుడు పొరుగు  రాజ్యానికి బదులుగా  అడవికి వెళ్లి తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నాడు.తాను స్వార్థంతో డబ్బు కొరకు  ఇటువంటి వరం కోరుకోవడమే తన తప్పని భావించి ఆనాటి నుండి శివుని ఏ స్వార్థం లేకుండా ఆరాధించి గొప్ప భక్తుడుగా పేరుగాంచాడు.