ఆచరణ ముఖ్యం:-యు.విజయశేఖర రెడ్డి,99597 36475

 “నువ్వు ఉదయాన్నే వస్తవాని చెబితే నేను స్నానం చేసేసాను. అమ్మవారి వ్రతానికి వేళ అవుతోంది...నువ్వు చూస్తే ఇంతవరకూ రాలేదు” అని సెల్ ఫోన్లో పనిమనిషికి క్లాసు పీకుతోంది దుర్గ.
“అమ్మగారు నాకు బాగా జ్వరంగా ఉంది. ఈ రోజు పనికి రాలేను,ఇల్లు చిమ్మడానికి నా కూతుర్ని పంపుతున్నాను...ఎలాగోలా చేయించుకోండి” అంది అవతల నుండి సీతాలు. 
“అలాగే పంపు” అంది దుర్గ. 
కాలింగ్ బెల్ విని తలుపు తీశాడు శ్రీధర్. పట్టుమని పది సంవత్సరాలు లేని అమ్మాయి చిరునవ్వుతో వాకిట్లో నిలబడి ఉంది. ఈ అమ్మాయితో పని చేయించుకోవాలా? బాల కార్మికుల మీద నవల వ్రాసిన శ్రీధర్‌కు ఎన్నో సత్కారాలు జరిగాయి.ఆ అమ్మాయితో ఇల్లు చిమ్మించుకోవడం భావ్యం కాదని ఇంట్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి పంపించివేశాడు. 
ఇదంతా చూస్తోంది దుర్గ,ఈ పూటకు ఇల్లు నేను చిమ్ముతాను అని శ్రీధర్ మూలాన ఉన్న చీపురు తీసుకున్నాడు. 
“నాదే తప్పు ఆ అమ్మాయిని పంపించేసి మీరు మంచి పని చేశారు..నేనే ఇల్లు చిమ్మి మళ్ళీ స్నానం చేస్తాను” అని భర్త చేతిలోని చీపురు తీసుకుంది దుర్గ.
ఎదుటి వారికి చెప్పే నీతులను మనం ముందుగా ఆచరణలో పెట్టాలి.**