చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టమే !:--- యామిజాల జగదీశ్
 ఓసారి ఓ రైతు తన దగ్గరున్న గాడిదను అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
సమీపంలో ఉన్న పొరుగూరికి గాడిదను తరలించుకుపోయాడు. 
కొడుకునికూడా తన వెంటే తీసుకుపోయాడు. 
తండ్రీకొడుకులిద్దరూ గాడిదను దారిపొడవునా లాక్కుంటూ పోయారు.
మార్గమధ్యంలో ఓ బాటసారి వారిద్దరూ గాడిదను లాగుతున్న తీరు చూసి ఓ నవ్వు నవ్వాడు.
పైగా "మీ ఇద్దరిలో ఎవరో ఒకరు దానిమీద కూర్చోవచ్చుగా" అన్నాడతను.
ఆ మాట నిజమే కదా అనుకున్న తండ్రి కొడుకుని గాడిదమీద కూర్చోపెట్టాడు.
కొంత దూరం ముందుకు వెళ్ళారు.
ఇంతలో ఎదురుగుండా ఒకడొచ్చాడు.
ఎందుకయ్యా మీ నాన్నను ఇబ్బందిపెడుతున్నావు. ఆయనకు వయస్సయింది కదా, ఆయనను గాడిదమీద కూర్చోపెట్టి నువ్వు నడవచ్చుగా అన్నాడతను. నీకేమీ మీ నాన్న మీద జాలి కలగడం లేదా అన్నాడు.
వెంటనే గాడిదమీదున్న ఆ కుర్రాడు కిందకు దిగి తన తండ్రిని గాడిద మీద కూర్చోమన్నాడు. తండ్రి కూడా వద్దనకుండా ఆ గాడిదపైన కూర్చున్నాడు.
ఇలా కొంత దూరం వెళ్ళారు. అక్కడ మరొకడు కనిపించాడు. గాడిదమీదున్న పెద్దాయనను చూసి మండిపడ్డాడు.
ఎందుకయ్యా ఇలా ఉన్నావు....కాస్తంత కూడా ఆలోచించవా....నీ కొడుకు చిన్నవాడేగా వాడిని నడిపించి నువ్వు దర్జాగా గాడిద మీద కూర్చుని పోవడం ఏమైనా బాగుందా ఒక్కసారి ఆలోచించు...నేనన్నానని కాదు...నీకు తెలియక్కర్లేదూ...అన్నాడా వ్యక్తి.
ఆ మాటలకు బాధ పడి పెద్దాయన కిందకు దిగి కొడుకుని గాడిద మీద కూర్చోమన్నాడు. ఇలా దారి పొడవునా తండ్రీ కొడుకులు ఎవరెవరో చెప్పగా కాస్సేపు ఒకరు, కాస్సేపు మరొకరు గాడిద మీద కూర్చుని ప్రయాణం చేసారు. ఆలోచించి ఆలోచించి చివరకు తండ్రీ కొడుకులిద్దరూ ఆ గాడిద వీపు మీదకూర్చుని ప్రయాణించారు.
ఇద్దరూ కలిసి గాడిద మీద కొంత దూరం వెళ్ళేసరికి కొందరు వారికి అడ్డొచ్చి ఇద్దరికీ బుద్ధుందా....నోరు లేని జంతువే కావచ్చు. చాకిరీకి పెట్టింది పేరే కావచ్చు...అంతమాత్రాన ఆ గాడిదమీద ఇద్దరూ కలిసి కూర్చుని దర్జాగా పోవడం ఏమన్నా బాగుందా...ఎంత దారుణం...అడిగేవారు లేరనేనా ఆ ధీమా....ఛీఛీ...మీది రాతి హృదయం అని మాటలకు లంఘించుకున్నారు.
వారి మాటలు విన్న పెద్దాయనకు చాలా కోపం వచ్చింది. వెంటనే గాడిద మీద నుంచి కిందకు దూకాడు.
ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తమను ఇంతసేపూ మోసిన గాడిదకు ఇక ఏ మాత్రం కష్టం కలిగించకూడదనుకున్న తండ్రీకొడుకులు ఆ గాడిదను తమ భుజాలపై మోయాలనుకున్నారు.  గాడిద కాళ్ళను తాడుతో గట్టిగా కట్టేశారు.
మరో అర గంటలో వారు గ్రామం చేరుకోవలసి ఉండగా, మధ్యలో ఓ చెరువు ఉంది. దానిని దాటి గానీ వారు గ్రామం చేరుకోలేరు. మరో దారి లేదు.  
తండ్రీకొడుకులు అతి కష్టంతో ఆ గాడిదను తమ భుజాలపై మోసుకుంటూ చెరువునీటిలో నడుస్తుండటం చూసి గట్టున ఉన్న కొందరు పిల్లలు పెద్దగా నవ్వారు.
ఆ నవ్వులకు కంగారుపడ్డ గాడిద ఊహించని విధంగా తండ్రీ కొడుకుల భుజంమీద నుంచి తప్పించుకుని బలంగా ఒక్క దూకు దూకింది. అయితే కాళ్ళు కట్టేసుండడంతో అది ఈదడానికి అవకాశం లేకుండా పోయింది. పాపం గాడిద, నీటిలో మునిగి చనిపోయింది.
ఈ తండ్రీ కొడుకులలా సొంతంగా ఓ నిర్ణయం తీసుకోకుండా ఎదుటివారి చెప్పుడు మాటలు, తప్పుడు సలహాలూ వినడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అంతేకాదు, తీవ్ర నష్టం కూడా చవిచూడాల్సి వస్తుందనడానికి గాడిద చావునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అప్పుడు మిగిలేది బాధే తప్ప మరొకటి కాదు.
ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇందులో అనుమానమే లేదు. అతిశయమూ కాదు కూడా. కానీ అందరినీ తృప్తి పరచడం కోసం తాము సొంతంగా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు చేటు తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదు.
అందుకే అంటారు అనుభవజ్ఞలు –
చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని. సొంతంగా ఆలోచించాలి అని.

కామెంట్‌లు