ఒక అడవిలో ఓ గాడిద ఉండేది.
అది ఓ రోజు అమ్మ మీద అలిగింది.
ఇంట్లో నుండి పారిపోయి పట్నం చేరుకుంది.
వింత విషయాలు విన్నది.
విచిత్రాలను చూసింది.
అలసిపోయిందాకా తిరిగింది.
సాయంత్రానికి ఆకలి అయింది.
రోడ్డు మీద ఉండే చెత్తా చెదారం తిన్నది.
ఒక మనిషి దాన్ని పట్టుకున్నాడు.
కష్టమైన పనులు ఎన్నో చేయించాడు.
ఇలా కొంతకాలం గడిచింది.
గాడిదకు జబ్బు చేసింది.
పనులు చేయలేక పోయింది.
మనిషికి దాని అవసరం తీరింది.
నడ్డిమీద డోలువేసి తరిమికొట్టాడు.
తిరిగి అడవికి వచ్చి అమ్మకు క్షమాపణచెప్పింది.
అడవి వైద్యుడు కొంగతో పరీక్ష చేయించుకుంది.
“రక్తం,మలం, మూత్రాలలో ఏ తేడా లేదు" అంది కొంగ.
స్కానింగ్ లో చూసింది.
అరగని పదార్థాలు పొట్టలో కనిపించాయి.
వెంటనే ఆపరేషను ఏర్పాట్లు చేసింది.
తాటి ఆకుతో పొట్ట కోసింది.
లోపల పదార్థాలు బయటకు తీసింది.
ఈత ఆకు ఈనెలతో కుట్లు వేసింది.
జిల్లేడుపాల జిగురు కుట్లపై పూసింది.
పక్షుల మెత్తని ఈకలు పేర్చి తామర ఆకుతో కట్టు కట్టింది.
అడవంతా తిరిగి అనేక ఆకులు ఏరి మెత్తగా నూరింది.
పసరు పిండి కడుపులో పోసింది.
గాడిద కోలుకుంది.
తీసిన పదార్థాలు పరీక్షగా చూసింది.
అందులో రంగు రంగుల పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్
వైర్లు, వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి.
కొంగ కలవరపడింది.
వాటిని దూరంగా పూడ్చి పెట్టి రమ్మంది.
కొంగ కంగారుకు కారణం అడిగింది గాడిద.
కొంగ ఇలా చెప్పింది.
"ప్రపంచంలో అతి ప్రమాదకరమైనది ప్లాస్టిక్. దీనికి మరణమే లేదు. లక్ష ఏళ్లు గడిచినా అవి చెక్కు చెదరవు.
వీటి వలన అంతుపట్టని వ్యాధులు వస్తాయి. ఆ రోగాలకు మందులే లేవు. వీటిని భూమిలో పాతి పెడితే భూసారం పోతుంది. పంటలు పండవు. సముద్రంలో వేస్తే జలచరాలు తిని మరణిస్తాయి. కాల్చితే ఆ పొగ మేఘాలుగా మారి విష వర్షాలు కురుస్తాయి. కాల్చిన పొగ పీలిస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఇందులో నిల్వ ఉంచిన పదార్థాలు తింటే ఇక అంతే. నీవు అదృష్టవంతుడవు. బ్రతికి బట్ట కట్టావు" అంది.
తనకు పునర్జన్మ ఇచ్చినందుకు కొంగకు కృతజ్ఞతలు తెలిపింది గాడిద.
నీతి : అలక వలన అనేక అనర్థాలు వస్తాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి