బాల శంకరా (ఇష్టపదులు ):-ఎం. వి. ఉమాదేవి
బాల శంకర నీవు బతుకు నింపుమయ్యా 
ఏడేడు జన్మముల ఎరుక గలిగించుమయ!

పారాడు పాపములు పదఘట్టనములతో 
వేలాడు జటలలో వెలుగు నెలవంకగా !

మోహాలు చెలగినవి మోక్ష మార్గములోను 
దేహాన సంకుచిత దేవులాటలు బెఱిగె !

సత్యమూ ధర్మమూ సంతకే వెడలినవి 
నడివీధిలో భక్తి నవ్వులాటగ మారె!

ఉపవాస సూత్రాలు ఉట్టికెక్కిన వేమొ 
జాగరణ విధులెల్ల జగడముల దించినవి 

అభిషేక ప్రియ నీకు అచ్చమౌ గంగేది 
మానవులు గూల్చిరి మారేడు తరువులను 

భస్మ ధారణ యొకటి భవ్యశాంతుల నిచ్చు 
భజన జేతుమయ్యా భావనల పరమ శివ!

దీప్తినొసగు హృదయపు దివ్య గుడి యందును 
ఆర్తి దీర్చుజనులకు ఆదిదేవ నమసులు!