పెన్ను, పెన్సిల్(-బాల గేయం )-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
పెన్ను పెన్సిల్ పేపర్ తోటి 
గొప్పలు చెప్పాయి 
కన్ను మిన్ను కానకుండా 
గొడవలు పడ్డాయి !

పెన్ను అన్నది గర్వంగాను 
తన వ్రాతే అందమని 
చెరిగి పోనివి అక్షరాలని 
తన హోదా గొప్పదని !

పెన్సిల్ అన్నది ముక్కుతిప్పుతూ 
బొమ్మలు స్కెచ్ లు గీస్తానని 
గీతను చెరిపే రబ్బరు ఉంది 
పెన్నుకు పేపర్ పాడవుతుందని! 

సిరా కక్కుతూ పెన్ను అన్నది 
తన గీతలే  శాశ్వతమని
పెన్సిల్ అన్నది అహం తోటి 
చాలా రోజులు వస్తానని!

అటుగా పోయే అక్షరమన్నది 
జగడం మానమని 
ఏది శాశ్వతము ఈ లోకంలో 
సమ భావన ముఖ్యమని !!