పచ్చని చెట్టు :-- ఎం. వి. ఉమాదేవి.
పచ్చని చెట్టొకటి ఉంది 
వెచ్చని పక్షి గూడులతో 
చిచ్చరమగు ఎండ నుండీ 
మచ్చర మగు వాన నుండి 
ఇచ్చును రక్షణ పరులకు 
మెచ్చుట కెవరు లేకున్నా !!

వచ్చిరి దురాశ పరులు 
ముచ్చు ముఖం నీచులు 
ఉచ్చులు,మరి గొడ్డళ్లతో 
హెచ్చు లాభం అమ్ముటనుచు !

వచ్చెనొక వృద్ధుడటకు 
నొచ్చుకొనుచు ఇట్లనెను 
"ఇచ్చిత్రపు పని ఇదేమి, 
పచ్చని తరువును చంపుట !

ఇచ్చట మహిళలు మధ్యాహ్నం 
ముచ్చట్లు చెప్పుకుందురు 
అచ్చన గాయలు,వైకుంఠపాళీ 
ముచ్చటగ సెలవులో బాలలు !
రచ్చబండ ఇదిగో దేశవార్తలకు 
ఇచ్చి పుచ్చుకొను సలహాలిచట 
గచ్చు చేసికొంటిమి అందుకే !

స్వచ్ఛమైన గిరులతరులపైన 
పెచ్చరిల్లే దుష్ట నాగరికతిపుడు 
కచ్చడముగ ఆకులే ఆదిలోన. 
చెచ్చెరమే మరలి పొండు,లేదా 
వెచ్చ దనమే భువిలో పొంగి 
వచ్చు తరము నీరు లేక 
బిచ్చగాళ్ళవుదురే తరుశాపం"!

హెచ్చరికరికలు వినిన వారు 
ఖచ్చితముగ వెనుదిరిగిరి 
పచ్చని ప్రకృతి హసితమై 
మెచ్చి దీవించెను వృద్ధుని!!